రాదేమి కునుకు!

13 Mar, 2020 10:00 IST|Sakshi

నైట్‌షిఫ్ట్‌ డ్యూటీలు.. ఫేస్‌బుక్‌..వాట్సాప్‌ టెక్నాలజీ ప్రభావం  

మద్యపానం, మాంసాహారం మోతాదు మించడమూ కారణమే  

గ్రేటర్‌లో 40 శాతం మందిలో నిద్రలేమి సమస్య

10– 12 శాతం మందిలో అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా  

రోజుకు 7– 8 గంటల నిద్రతోనే ఆరోగ్యం: వైద్యులు

ఇంటర్నెట్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ టెక్నాలజీ,టెలివిజన్‌ ప్రసారాలు సిటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాత్రి తొమ్మిది గంటలకే పడకెక్కాల్సిన నగరవాసులు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కళ్లప్పగించే చూస్తున్నారు. అందివచ్చిన ఈ టెక్నాలజీకి మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు తోడు కావడంతో ప్రస్తుతం గ్రేటర్‌లో 40 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులపరిశీలనలో వెల్లడైంది. పరోక్షంగా ఇదితీవ్రమైన మానసిక ఆందోళన, ఏకాగ్రత లోపం, మధుమేహం, హైపర్‌ టెన్షన్‌లకే కాదు.. యువత దాంపత్య జీవితంపై కూడాతీవ్ర ప్రభావం చూపుతోంది.  

సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు రాత్రి 8 గంటలకే నిద్రకు ఉపక్రమించిన సిటీజన్లు ప్రస్తుతం తీవ్రమైన పని ఒత్తిడి, మానసిక ఆందోళనతో అర్ధరాత్రి దాటినా రెప్పవాల్చడం లేదు. ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారు విదేశాలకు అనుగుణంగా తమ పని వేళలను మార్చుకోవడం, వీకెండ్‌ పార్టీల పేరుతో వీరు ఎక్కువ సేపు డిస్కోలు, పబ్‌ల్లో గడుపుతున్నారు. ఇదే సమయంలో అర్ధరాత్రి దాకా మద్యం తాగడం, ఆయిల్, మసాలా ఫుడ్‌ ఎక్కువ తీసుకుంటున్నారు. ఆహారం జీర్ణం కాకముందే నిద్రకు ఉపక్రమించడంతో శ్వాసనాళాలపై ఒత్తిడి పెరుగుతోంది. పడకెక్కిన పది నిమిషాలకే గుర్ర్‌.. గుర్ర్‌.. అంటూ గురకపెడుతున్నారు. బాధితుల్లో కొంత మంది స్లీపింగ్‌ టాబ్లె ట్స్, ఇతర మత్తు పదార్థాలకు, మద్యానికి అల వాటు పడుతున్నారు. ఇలా ఒక సమస్య నుంచి బయట పడేందుకు యత్నించి మరో సమస్యలో చిక్కుకుంటున్నట్లు జాతీయ నిద్ర ఫౌండేషన్‌ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 

12 శాతం మందిలో స్లీప్‌ అప్నియా..
ఢిల్లీలో 16– 18 శాతం మంది అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నీయా (గురక, నిద్రలో శ్వాస సరిగా తీసుకోలేక పోవడం) బాధితులు ఉంటే, బెంగళూరులో 15.5 శాతం, చెన్నైలో 15 శాతం ఉండగా హైదరాబాద్‌లో పది నుంచి 12 శాతం మంది ఉన్నట్లు స్టార్‌ ఈఎన్‌టీ వైద్యులు ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. నిద్రకు ఉపక్రమించిన తర్వాత ఒకటి నుంచి రెండు సార్లు మాత్రమే మేల్కొనాల్సి ఉండగా, చాలా మంది ఇలా నిద్రపోగానే అలా లేచి కూర్చుంటున్నట్లు గుర్తించింది. బలవంతంగా శ్వాస తీసుకునే ప్రయత్నం చేసినా ఊపిరితిత్తులు, మెదడు, గుండెకు చేరడంలేదు. పరోక్షంగా ఇది ఆకస్మిక గుండెపోటుకు కారణమవుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. రాత్రి 2 నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్యలో వెలుగు చూస్తున్న 60 శాతం ఆకస్మిక గుండెపోటు మరణాలకు ఈ అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నీయానే కారణమవుతున్నట్లు తేలింది.

యువతలోనే అధికం: డాక్టర్‌ శ్రీనివాస్, ఈఎన్‌టీ, స్టార్‌ ఆస్పత్రి
నవతరానికి నిద్రలేమి ఓ ప్లేగులా అంటుకుంది. ప్రతిపది మందిలో ముగ్గురు నిద్రలేమితో బాధపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 35 ఏళ్ల లోపు వారే. నిద్రలేమితో జబ్బులు రాకుండా ఉండాలంటే వ్యక్తికి కనీసం 8 గంటల నిద్ర తప్పనిసరి. ఆరు, అంతకన్నా తక్కువ గంటలు నిద్రపోతే ఏకాగ్రత లోపిస్తుంది. జ్ఞాపకశక్తి సంబంధ సమస్యలు వస్తాయి. రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. ఆయుష్షు తగ్గిపోతుంది. కేవలం నాలుగైదు గంటలు మాత్రమే నిద్రపోయే వారిలో కేన్సర్‌పై పోరాడే శక్తి 70 శాతం తక్కువ ఉంటుంది. అంతేకాదు రాత్రి నిద్ర పోకపోవడం వల్ల మానసిక, శారీరక ఎదుగుదలకు సంబంధించిన హార్మోన్స్‌ తగ్గడంతో పాటు సెక్స్‌వల్‌ హార్మోన్స్‌ ఉత్ప త్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది.

మంచి నిద్ర కోసం కొన్ని చిట్కాలివీ..  
నిద్ర పోవడానికి.. మేల్కొనడానికికచ్చితమైన వేళలు పాటించాలి
నిద్రకు ముందు ఎక్కువ భోజనం చేయకూడదు
నిద్ర పోవడానికి 4 గంటల ముందే మద్యం తాగడం ఆపివేయాలి
నిద్రపోవడానికి ఆరు గంటల ముందె కాఫీ, టితో పాటు సోడా, చాక్లెట్‌ వంటి వాటిని తీసుకోవడం ఆపివేయాలి  
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, కానీ నిద్రపోయే ముందు మాత్రం కాదు
సౌకర్యవంతమైన పరుపులను వాడాలి. గదిలో సౌండ్‌ పొల్యూషన్‌ లేకుండా చూసుకోవాలి.
గదిని చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి
శరీరానికి అవసరమైన ఉష్ణోగ్రత, వెంటిలేషన్‌ ఉండాలి  
పడక గదిలో కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు లేకుండా చూసుకోవాలి.-సుఖ నిద్రకోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి: డాక్టర్‌ రమణప్రసాద్, కన్సల్టెంట్‌ ఫల్మొనాలజిస్ట్, కిమ్స్‌ ఆస్పత్రి

నిద్రపోయే ముందు మొబైల్‌ ఫోన్లు, ఇతరత్రా డిజిటల్‌ స్క్రీన్లు చూడొద్దు. అవి నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మీరు నిద్రపోయే గదిలో ఇవి ఉన్నట్లయితే.. మరో గదిలోకి మారిపోండి.
కాఫీ తాగితే బాగా నిద్రపడుతుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది తప్పు ఆలోచన. మెదడు చుట్టూ ప్రవహించే కెఫిన్‌ గాఢ నిద్రను దూరం చేస్తుంది. నిద్రపోయే ముందు కాఫీ తాగొద్దు.
మద్యం సాధ్యమైనంత త్వరగా స్ఫృహను పోగొట్టి.. సహజసిద్ధమెన నిద్రను దూరం చేస్తుంది. రాత్రిపూట మధ్యమధ్యలో నిద్రలేచేలా చేస్తుంది. అలా లేచిన విషయం గుర్తుండకుండా చేస్తుంది. గాఢనిద్రను అడ్డుకుంటుంది. కాబట్టి మద్యం నిద్రకు ఉపకరించదు.
సాధ్యమైనంత వరకు సాయంత్రం ఐదు గంటలకే ఇంటికి చేరుకుని, రాత్రి 7 లోపే డిన్నర్‌ పూర్తి చేయాలి. ఆ తర్వాత టీవీ, సెల్‌ఫోన్‌ ఇతర ఎలక్ట్రానిక్స్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేసి పడక గదిలోకి వెళ్లాలి.
పడక గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యాయామం, యోగాసనాలు సుఖ నిద్రకు బాగా ఉపయోగపడతాయి.  

ఫిలిప్స్‌ సర్వే ప్రకారం ఇలా.. 
నిద్రలేమి సమస్యపై ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఫిలిప్స్‌ ఇటీవల హైదరాబాద్‌ సహా దేశంలోని పలు నగరాల్లో ఓ సర్వే చేసింది. పట్టణాల్లో 40 శాతానికిపైగా మంది నిద్రలేమితో బాధపడుతున్నట్లు ఆ సర్వేలో తేలింది. కంటికి తగినంత నిద్రలేకపోవడంతో ఆఫీసులో సరిగా పని చేయలేకపోతున్నామని 58 శాతం మంది చెప్పగా, పనిచేస్తున్న చోటే నిద్రపోతున్నామని చెప్పిన వారు 22 శాతం మంది ఉన్నారు. ఇక నిద్ర చాలకపోవడంతో పనికి సెలవు పెట్టేస్తున్నామని 11 శాతం మంది చెప్పారు. రాత్రిపూట కనీసం ఒకటి నుంచి మూడు సార్లు నిద్రలో లేస్తున్నామని 74 శాతం మంది చెప్పారు. నిద్రలేమితో ఆరోగ్యం దెబ్బ తింటోందని 87 శాతం మంది చెప్పారు.  అత్యంత తీవ్రమైన నిద్రలేమి సమస్య (అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా)తో బాధపడుతున్నామని 10 నుంచి 12 శాతం మంది అంగీకరించారు. 

మరిన్ని వార్తలు