పరీక్షకే పరీక్ష

8 Jul, 2020 08:12 IST|Sakshi
చార్మినార్‌ యునానీ ఆస్పత్రి వద్ద కోవిడ్‌ పరీక్షల కోసం నిరీక్షిస్తున్న చిన్నారులు

నమూనాలు ఇవ్వాలంటే 3 రోజుల నిరీక్షణ

రిపోర్ట్‌ వచ్చేందుకు 4 నుంచి 5 రోజులు

నరకయాతనలో బాధితుల కుటుంబాలు  

వేగం పుంజుకోని కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు  

సాక్షి, సిటీబ్యూరో: చిక్కడపల్లికి చెందిన కరుణాకర్‌లో జూన్‌ 28 నుంచి స్వల్ప జ్వరం, జలుబు లక్షణాలు కనిపించాయి. రెండు రోజులైనా తగ్గలేదు. దీంతో సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు.ఆయనలో కోవిడ్‌ లక్షణాలున్నాయని, తమ ల్యాబ్‌లో ప్రభుత్వం నిర్ధారణ పరీక్షలు తాత్కాలికంగా నిలిపేసిన దృష్ట్యా టెస్ట్‌చేయటం సాధ్యపడదని తేల్చి చెప్పారు. దీంతో సమీపంలోని ఫీవర్‌ ఆస్పత్రికి వెళ్లారు ఆయన. అప్పటికే ఆ రోజుకు సరిపడా టోకెన్లు ఇతరులకు ఇవ్వటంతో అక్కడా టెస్ట్‌ సాధ్యపడలేదు. దీంతో జ్వరం, ఆయాసంతోనే ఇంటికి వచ్చారు. ఇంతలోనే ఓ మిత్రుడు ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రికి వస్తే తాను టెస్ట్‌ చేయిస్తానని భరోసా ఇచ్చారు. జూలై 3న కోవిడ్‌ టెస్ట్‌ కోసం చెస్ట్‌ ఆస్పత్రిలో కరుణాకర్‌ నమూనాలు ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో ఫలితం వస్తుందనుకున్నారు. కానీ  5 రోజులు వరకు పాజిటివా.. నెగెటివా..? అనే విషయం తేలనే లేదు. అప్పటికే కోవిడ్‌ అయితే చికిత్స ఎలా..? అన్న అంశాన్ని మీడియాలో చూసిన బాధితుడు  సొంత వైద్యాన్ని ప్రారంభించారు. అయినా జ్వరం తగ్గకపోవటంతో మంగళవారం రాత్రి సమీపంలోని ఓ ల్యాబ్‌కు వెళ్లి టైఫాయిడ్, మలేరియా పరీక్షలు చేయించుకున్నారు. అక్కడా ఫలితం కోసం మరో రోజు ఆగాలని చెప్పారు. ఈ పరిస్థితి ఒక్క కరుణాకర్‌దే కాదు.. నగరంలోని వందలాది మందిది ఇదే తరహా.

సకాలంలో ఫలితం రాక..   
నగరంలో ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కోవిడ్‌ క్యాంప్‌ల ఫలితాల్లో తీవ్ర జాప్యం కారణంగా ఆయా కుటుంబాల్లో తీవ్ర గందరగోళానికి దారి తీస్తున్నాయి. ఇటీవల కీసర రాంపల్లికి చెందిన ఓ వ్యక్తికి నగరంలోని ఖైరతాబాద్‌లో గత గురువారం నిర్వహించిన ఓ క్యాంప్‌లో శాంపిల్‌ ఇచ్చారు. ఇచ్చిన రోజు నుంచే ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. కుటుంబ సభ్యులంతా హడలిపోయారు. బీపీ, షుగర్‌తో పాటు సిగరెట్‌ అలవాటు ఉండటంతో ఆయనకు వెంటనే కోవిడ్‌ చికిత్సను ఇంట్లోనే ప్రారంభించారు. తీరా మంగళవారం మధ్యాహ్నం అంటే ఆరు రోజులకు ఆయనకు కోవిడ్‌ లేదని¯ð గెటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. రిపోర్ట్‌ వచ్చాక ఊపిరి తీసుకున్నా.. ఆరు రోజులు ఆ కుటుంబం నరకయాతనే అనుభవించింది. నగరంలో గాంధీ, సీసీఎంబీ, నిమ్స్‌ ఉస్మానియా, ఐపీఎం తదితర తొమ్మిది ప్రభుత్వ ల్యాబ్‌ల్లో రోజూ ఆరువేల శాంపిళ్లను నిర్ధారించే అవకాశం ఉన్నా.. సరిపోను సిబ్బంది లేక ఆలస్యమతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 

>
మరిన్ని వార్తలు