నిదురపోరా.. తమ్ముడా..!

28 Feb, 2020 10:29 IST|Sakshi

నిద్రలేమి రాత్రులు గడుపుతున్న నగరవాసులు  

మహానగరాల్లో కంటినిండా నిద్రకరువు..

పన్నెండు దాటినా..సోషల్‌ మీడియాలో బిజీ..

పడకగదిలోకి  దూసుకొచ్చిన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు  

హైదరాబాద్‌లో 54 శాతం మందికి నిద్రలేమి..  

సాక్షి,సిటీబ్యూరో: మహానగరాల వాసులకు నిద్రలేమి శాపంగా పరిణమించింది. ల్యాప్‌టాప్‌.. ట్యాబ్‌.. స్మార్ట్‌ఫోన్‌..ఐపాడ్‌.. తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఒకప్పుడు నట్టింట్లో మాత్రమే ఉండేవి..ఇప్పుడు పడకసమయంలోనూ ఇవి బెడ్‌మీదకు చేరడంతో సిటీజన్లు నిద్రలేమికి గురవుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. సెంచురీ మాట్రెసెస్‌ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సిటీజన్ల ’స్లీపింగ్‌ ట్రెండ్స్‌(నిద్ర అలవాట్లు)’పై జరిపిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. ఈ విషయంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలవడం గమనార్హం. మన నగరంలో సుమారు 54 శాతం మంది నిత్యం సుమారు 5–6 గంటల నిద్రకు సైతం దూరమౌతున్నట్లు తేలింది. చాలా మంది అర్ధరాత్రి పన్నెండు దాటినా..తమకు నచ్చిన  షోలను టీవీల్లో వీక్షించడంతోపాటు..స్మార్ట్‌ఫోన్లలో సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా కనిపిస్తున్న తాజా సమచారాన్ని తెలుసుకునేందుకు నిద్రలేని రాత్రులను గడుపుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబాయిలో 75 శాతం, దేశ రాజధాని ఢిల్లీలో 73 శాతం మంది నిద్రసమయంలో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలతో కుస్తీ పడుతుండటం.  బెంగళూరులో 50..పూణేలో 49 శాతం మందిదీ ఇదే వరసని ఈ సర్వే పేర్కొంది. 

12 తరువాతేనిద్రలోకి..
దేశవ్యాప్తంగా ఐదు నగరాల్లో సెంచురీ మాట్రెసెస్‌ ప్రజల స్లీపింగ్‌ ట్రెండ్స్‌పై జరిపిన సర్వేలో సుమారు పదివేల మంది నుంచి ఆన్‌లైన్‌లో అభిప్రాయాలు సేకరించి ఈ సర్వేకు తుదిరూపం ఇచ్చారు. ప్రధానంగా టీవీ, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్,సహా ..స్మార్ట్‌ఫోన్‌లలో ఫేస్‌బుక్,వాట్సప్,ట్విట్టర్,ఇన్‌స్ట్రాగామ్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో నిరంతరాయంగా అప్‌డేట్‌ అవుతోన్న ఫీడ్‌ను తిలకిస్తూ మెజార్టీ సిటీజన్లు కాలక్షేపం చేస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. మొత్తంగా ఐదు నగరాల్లో సరాసరిన 50 శాతం మంది రాత్రి సమయాలలో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలతో కుస్తీపడుతూ..కాలక్షేపం చేస్తూ నిద్రకు దూరం అవుతున్నట్లు తేలింది. ఇక మరో 54 శాతం మంది నిత్యం  రాత్రి 12  గంటల తరవాతే నిద్రకు ఉపక్రమిస్తున్నట్లు చెప్పారట.

అధికంగా వీక్షిస్తే కళ్లకు అనర్థమే
రాత్రి పొద్దుపోయాక నిద్రపోయినప్పటికీ...ఉదయం 5–6 గంటల మధ్యన నిద్రలేవాల్సి వస్తుందని పలువురు తెలిపినట్లు ఈ సర్వేలో తేలింది. ఇక అధిక పనిఒత్తిడి..ఉద్యోగాలు చేసేందుకు సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండడంతో వారంలో మూడురోజులపాటు పనిప్రదేశాలు..జర్నీలో కునికిపాట్లు పడుతున్నట్లు 37 శాతం మంది అభిప్రాయపడినట్లు ఈ సర్వేలో తేలింది. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను అవసరాన్ని బట్టి ఉపయోగించడమే మేలు. గంటలతరబడి అదేపనిగా వాటితో కాలక్షేపం చేస్తే వాటి నుంచి వెలువడే రేడియేషన్‌తో కంటిచూపు దెబ్బతింటుంది. కళ్లు, వాటిల్లో ఉండే సూక్ష్మమైన నరాలు అధిక ఒత్తిడికిగురవుతాయి. దీంతో మెడ,మెదడు, నరాలపైనే దుష్ప్రభావం పడుతుంది. కనీసం పడక సమయంలోనైనా ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలకు దూరంగా ఉంటే మంచింది.– డాక్టర్‌ రవిశంకర్‌గౌడ్, సూపరింటెండెంట్,    సరోజిని దేవి కంటి ఆస్పత్రి
వివిధ నగరాల్లో నిద్రలేమి శాతం ఇలా..

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా