హలో... బైక్‌ 'పే' చలో

16 Nov, 2019 06:36 IST|Sakshi

గ్రేటర్‌లో బైక్‌ ట్యాక్సీలకు ఫుల్‌ డిమాండ్‌  

మెట్రో కనెక్టివిటీ రూట్లలో పరుగులు  

ఆర్టీసీ సమ్మెతో మరింత గిరాకీ  

బీమా సదుపాయం కల్పిస్తున్న ‘ర్యాపిడో’

అందుబాటులోమహిళా రైడర్లు సైతం  

సాక్షి, సిటీబ్యూరో:  రాజేశ్‌ జీడిమెట్ల నుంచి కూకట్‌పల్లి మెట్రోస్టేషన్‌కు వెళ్లాలి. బస్టాపులో గంటల తరబడి వేచి చూసినా బస్సు రాలేదు. ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు అరకొరగా తిరుగుతున్నాయి. ఇక లాభం లేదని మరోఆలోచనకు తావు లేకుండా ర్యాపిడో బైక్‌ ట్యాక్సీనిబుక్‌ చేసుకున్నాడు.కొద్దిసేపట్లోనే బైక్‌ ట్యాక్సీ వచ్చేసింది. మెట్రో వరకు ప్రయాణం సాఫీగాసాగిపోయింది.

...ఇలా ఒక్క రాజేశ్‌ మాత్రమే కాదు.. ఎంతో మంది నగరవాసులు ఇప్పుడు బైక్‌ ట్యాక్సీల సేవలు వినియోగించుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో సకాలంలో ఆఫీసులకు, ఇళ్లకు చేరుకునేందుకు ఇవి అందుబాటులో ఉంటున్నాయి. ఒకే రూట్‌లో ప్రయాణం చేసేవారు సాధారణంగా క్యాబ్‌లను షేర్‌ చేసుకునేవారు. కానీ మార్గం ఒక్కటే అయిన వేర్వేరు ప్రాంతాల్లో ప్రయాణికులను చేరవేయాల్సి రావడంతో కొంత జాప్యం చోటుచేసుకుంటోంది. దీంతో చాలామంది ప్రయాణికులు షేర్‌ క్యాబ్‌లకు బదులు బైక్‌ ట్యాక్సీలను ఎంపిక చేసుకుంటున్నారు. సోలో ప్యాసింజర్స్‌కు బైక్‌ ట్యాక్సీలు ఎంతో అనుకూలంగా ఉంటున్నాయి. క్యాబ్‌ల తరహాలోనే కొన్ని ట్యాక్సీలు రాత్రింబవళ్లు ప్రయాణ సదుపాయాన్ని అందజేస్తుండగా... మరికొన్ని అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటున్నాయి. ఇవి క్యాబ్‌లతో పోటీ పడి పరుగులు పెడుతున్నాయి. ఉబర్, ఓలా లాంటి సంస్థలు వివిధ రకాల క్యాబ్‌ సర్వీసులతో పాటు బైక్‌ ట్యాక్సీలను కూడా ప్రవేశపెట్టాయి. కానీ ఇటీవల ప్రజారవాణా రంగంలోకి దూసుకొచ్చిన అంతర్జాతీయ సంస్థ  ‘ర్యాపిడో’ బైక్‌ ట్యాక్సీలతోనే ప్రయాణికులకు చేరువైంది. ఒక్క ర్యాపిడో బైక్‌ ట్యాక్సీలే నగరంలో ప్రతిరోజు సుమారు 30శాతం  ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ఉబర్, ఓలా బైక్‌లు సైతం పోటీపడి విస్తరిస్తుండగా... ర్యాపిడో మరో అడుగు ముందుకేసి మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మహిళా రైడర్లను ఏర్పాటు చేసింది. 

మెట్రోరైలుకు అనుసంధానం  
మెట్రో రైలు ఇప్పుడు లైఫ్‌లైన్‌గా మారింది. ప్రతిరోజు సుమారు 3.5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలోనే రాకపోకలు సాగిస్తున్నారు. కానీ చాలామందికి మెట్రో స్టేషన్‌ వరకు చేరుకోవడం పెద్ద సవాల్‌గా మారింది, మెట్రో మార్గానికి అనుసంధానం చేసే విధంగా సిటీ బస్సులు విస్తరించకపోవడం, మినీ బస్సులు, ఇతరత్రా  రవాణా సదుపాయాలు పెద్దగా అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఎక్కువ శాతం ప్రత్యామ్నాయ సదుపాయాలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో బైక్‌ ట్యాక్సీలు ప్రస్తుతం ఎంతో అనుకూలంగా మారాయి. ఉదాహరణకు ఉప్పల్‌ బస్టాపునకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మావతి కాలనీ, వెంకటేశ్వర టెంపుల్, శ్రీశ్రీనగర్‌ తదితర ప్రాంతాల నుంచి ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌కు నేరుగా వెళ్లేందుకు సిటీ బస్సులు అందుబాటులో లేవు. ఆటోలు బస్టాపు వరకే వెళ్తాయి. అక్కడి నుంచి స్టేషన్‌ వరకు సెవెన్‌ సీటర్‌ ఆటోలో వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఒక్క రూట్‌లోనే కాదు. మెట్రోకు సమీపంలోని అనేక ప్రాంతాల్లో, సిటీ బస్సులు అందుబాటులో లేని కాలనీల్లో బైక్‌ ట్యాక్సీలు పరుగులు తీస్తున్నాయి. మెహిదీపట్నం, హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, ఐటీ కారిడార్లు, కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ తదితర ప్రాంతాల్లో వీటికి ఫుల్‌ డిమాండ్‌ ఉంది. ‘నాగోల్‌ నుంచి హైటెక్‌ సిటీ వరకు, ఎల్‌బీనగర్‌ నుంచి మియాపూర్‌ వరకు మెట్రోకు రెండువైపులా కనీసం 30 కిలోమీటర్‌ల దూరం నుంచి కూడా బుకింగ్‌లు వస్తున్నాయి. చాలామంది రాత్రిపూట మెట్రో దిగిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు బైక్‌ ట్యాక్సీలను ఎంపిక చేసుకుంటున్నారు’ అని చెప్పారు ర్యాపిడో రీజినల్‌ హెడ్‌ రాజీవ్‌ భైరి. ఒక్క ర్యాపిడో మాత్రమే కాదు.. ఉబర్, ఓలా బైక్‌లకు సైతం రాత్రి వేళల్లో ఎక్కువ డిమాండ్‌ ఉంటుందని పలువురు రైడర్లు  అభిప్రాయపడ్డారు.  

ప్రమాద బీమా రూ.5 లక్షలు   
ర్యాపిడో సంస్థ ప్రయాణికులకు ప్రమాద బీమా సైతం కల్పిస్తోంది. ప్రయాణం ప్రారంభమైన వెంటనే ప్రయాణికుడికి, రైడర్‌కు ఇది వర్తిస్తుంది. ‘దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే దాని తీవ్రత మేరకు రూ.5 లక్షల వరకు బీమా ఉంటుందని’ రాజీవ్‌ తెలిపారు. ప్రస్తుతం బైక్‌ ట్యాక్సీలు రూ.10 కనీస చార్జీలతో మొదలవుతున్నాయి. కిలోమీటర్‌కు రూ.3 చొప్పున వసూలు చేస్తున్నారు. ఒకవేళ బైక్‌ను కొద్దిసేపు వెయిటింగ్‌లో ఉంచదలిస్తే నిమిషానికి రూ.1.25 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికుడి నుంచి చార్జీల రూపంలో వచ్చే డబ్బులో 70శాతం వెంటనే రైడర్‌ ఖాతాలో చేరిపోతుంది. మరో 30శాతం ర్యాపిడోకు చేరుతుంది. ఆటోలు, క్యాబ్‌ల కంటే బైక్‌ ట్యాక్సీ చార్జీలు కొంతమేరకు అందుబాటులో ఉండడం వల్ల కూడా ప్రయాణికులు వీటిని ఎంపిక చేసుకుంటున్నారు. ‘హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌ నుంచి సమీప ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా రద్దీగా ఉంటుంది. ఆ సమయంలో క్యాబ్‌ కంటే బైక్‌  బెటర్‌’ అని చెప్పారు విశాల్‌. సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పని చేస్తున్న అతడు ప్రతిరోజు హైటెక్‌సిటీ నుంచి తార్నాకవరకు మెట్రోలో ప్రయాణం చేస్తున్నాడు.  ‘ట్రైన్‌ దిగిన తర్వాత ఆఫీస్‌కు చేరుకోవడం ఒకప్పుడు ఎంతో కష్టంగా ఉండేది. 5 కిలోమీటర్‌ దూరానికి ఒక్కోసారి గంట పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ బాధ తప్పింద’ని ఆనందం వ్యక్తం చేశారు విశాల్‌.   

సమ్మె ఎఫెక్ట్‌.. మరింత డిమాండ్‌  
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బైక్‌ ట్యాక్సీలకు డిమాండ్‌ బాగా పెరిగింది. ప్రస్తుతం బస్సులు అరకొరగా తిరుగుతుండడం వల్ల ప్రయాణికులు వీటినే ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం 7గంటల ఉంచి రాత్రి 12గంటల వరకు ఇళ్లకు చేరుకునే ప్రయాణికులు బైక్‌లను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు   ప్రయాణికుల భద్రత విషయంలో అన్ని రకాల ప్రమాణాలను పాటిస్తున్నట్లు క్యాబ్‌ సంస్థలు తెలిపాయి. ‘డ్రైవర్లు ర్యాష్‌గా డ్రైవ్‌ చేసినట్లు ఫిర్యాదులు వస్తే వెంటనే మా ఎమర్జెన్సీ టీమ్‌ రెస్పాండ్‌ అవుతుంది. ఇది నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. ర్యాపిడో మొబైల్‌ యాప్‌లో ప్రయాణికుల ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటాం. దుష్ప్రవర్తన కలిగిన రైడర్లను తొలగిస్తున్నాం. మా ప్రతి సర్వీసుపై పోలీసుల పర్యవేక్షణ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు రాజీవ్‌.

రోజుకు రూ.1500  
ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తే రూ.1500 వరకు వస్తాయి. ఒకప్పుడు హైటెక్‌సిటీ నుంచి ఎక్కువ బుకింగ్‌లు ఉండేవి. ఇప్పుడు సిటీలో అన్ని ప్రాంతాల నుంచి బుకింగ్‌లు వస్తున్నాయి. గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగానే ఎక్కడికైనా వెళ్తున్నాం.  – మల్లేష్, రైడర్‌ 

సంతృప్తి..  
మెహిదీపట్నం నుంచి కూకట్‌పల్లి వరకు ప్రయాణికులను చేరవేస్తాను. ఈ ప్రొఫెషన్‌ నాకు చాలా తృప్తినిచ్చింది. ప్రయాణికులు ఎంతో గౌరవం ఇస్తున్నారు. గతంలో మగవారి నుంచి కూడా బుకింగ్‌లు వచ్చేవి. ఇప్పుడు మహిళా రైడర్లు అందుబాటులోకి రావడంతో మహిళా ప్రయాణికులకే ప్రాధాన్యంఇస్తున్నారు.  – గాయత్రి, రైడర్‌ 

మరిన్ని వార్తలు