బ్రహ్మం..బ్రహ్మాండం

8 Jul, 2019 10:42 IST|Sakshi

వంట గ్యాస్‌తో పనిచేసే ఇస్త్రీ పెట్టె తయారీ

యాప్రాల్‌ : కృషి, పట్టుదల ఉంటే సామాన్యుడు సైతం అద్భుతాలు సృష్టిస్తాడు. అందుకు ఉదహరణే బాలాజి నగర్‌ నివాసి కొదురుపాక లింగబ్రహ్మం. ఇతను ఓ ఇంజనీరు అనుకుంటే పొరపాటే. చదివింది మూడో తరగతే. వరంగల్‌ జిల్లాలో ఓ మారుమూల గ్రామం ఎల్లాయిగూడెంలోని ఓ నిరుపేద కుటుంబంలో జన్మించి కంసాలి పని చేసుకుంటూ ఉండేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి బాలాజినగర్‌లో నివాసముంటున్నాడు. ఏదో ఒకటి చేయాలనే తపన ఎప్పటి నుంచో బ్రహ్మం మనసులో పడింది. బొగ్గు, విద్యుత్‌తో పని చేసే ఇస్త్రీ పెట్టెల వల్ల ఖర్చు ఎక్కువగా అవుతుందని భావించి గ్యాస్‌తో పని చేసే ఇస్త్రీ పెట్టెను తయారు చేయాలనుకున్నాడు. స్నేహితులు, బంధువులు నిరుత్సాహపరిచినా పట్టు వీడలేదు.

కుల వృత్తిని నిర్లక్ష్యం చేయడంతో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. అయినా అదే పనిగా 2004 సంవత్సరం నుండి 2005 సంవత్సరం వరకు సంవత్సరం పాటు కష్టపడి గ్యాస్‌తో పని చేసే ఇస్త్రీ పెట్టెను తయారు చేసి తన లక్ష్యాన్ని సాధించాడు. ఇతను రూపొందించిన ఇస్త్రీ పెట్టె ఎల్‌పీజీ గ్యాస్‌తో పని చేస్తూ రెండు నిమిషాలలోనే వేడెక్కుతుంది. గ్యాస్‌ ఖర్చు రోజంతా ఇస్త్రీ చేస్తే 8 నుండి 10 రూపాయల వరకు అవుతుందని బ్రహ్మం తెలిపారు. ఇతని ప్రతిభను గుర్తించి అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్‌ ఇన్నోవేషంట్‌ ఫౌండేషన్‌ వారు గుర్తింపు పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం ప్రొత్సహిస్తే బ్యాంక్‌ నుంచి రుణాలు ఇప్పిస్తే గ్యాస్‌తో కూడిన ఇస్త్రీ పెట్టెల తయారి కర్మాగారాన్ని నిర్మిస్తానని బ్రహ్మం తెలిపారు.

మరిన్ని వార్తలు