బహుపరాక్‌!

27 Feb, 2019 09:20 IST|Sakshi

ముష్కర మూకలు రెచ్చిపోయే ప్రమాదం

సర్జికల్‌ స్ట్రైక్స్‌ నేపథ్యంలో ఐబీ హెచ్చరికలు

నగరంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు   

సాక్షి, సిటీబ్యూరో: పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయుసేనమంగళవారం తెల్లవారుజామున సర్జికల్‌ స్ట్రైక్‌ చేసిన నేపథ్యంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు దాడులకు దిగే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా వర్గాలు (ఐబీ) హెచ్చరికలు జారీ చేశాయి. దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిణామాలతో ఉగ్రవాదులు, స్లీపర్‌సెల్స్‌ విధ్వంసాలు, ఎంపిక చేసుకున్న టార్గెట్లపై విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉందని స్పష్టం చేశాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ప్రాంతాల్లో అదనపు నిఘా, బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించాయి. ఈ హెచ్చరికల్ని పరిగణనలోకి తీసుకున్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఐబీ హెచ్చరికలకు సంబంధించి సిబ్బంది తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

అనుమానిత ప్రాంతాల్లో జల్లెడ..
సిటీలో ఉన్న అనుమానిత ప్రాంతాలను పోలీసు, నిఘా వర్గాలు జల్లెడపడుతున్నాయి. ఆయా స్వీపర్‌ సెల్స్‌ ఎక్కడ ఆశ్రయం పొందుతున్నారు? ఏ ముసుగులో ఉన్నారు? అనే అంశాలపై దృష్టి పెట్టారు. హైదరాబాద్‌లో ఒకప్పుడు ‘టెర్రర్‌ జోన్స్‌’ ప్రత్యేకంగా ఉండేవి. దక్షిణ మండలంలోని కొన్ని ప్రాంతాలు, తూర్పు మండల పరిధిలోని సైదాబాద్, సంతోష్‌నగర్, మలక్‌పేట్, సలీంనగర్‌ కాలనీ, పశ్చిమ మండల పరిధిలోని టోలిచౌకి, నదీమ్‌కాలనీలతో పాటు శివార్లలో ఉన్న పహాడీషరీఫ్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లోనే ఉగ్రవాదుల ఛాయలు ఎక్కువగా కనిపిస్తుండేవి.  రంగారెడ్డి జిల్లాలోని అనంతగిరి అడవులూ ముష్కర మూకలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఉగ్రవాదుల షెల్టర్‌ జోన్స్‌ విషయంలో చోటు చేసుకున్న ఈ మార్పులతో ప్రస్తుతం పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు.  
రంగంలోకి ప్రత్యేక బలగాలు..
నిఘా వర్గాల నుంచి అందిన పక్కా హెచ్చరికల నేపథ్యంలో నగరంలోని ఏ ప్రాంతాన్ని వదలకుండా గాలింపు చర్యలు చేపట్టారు. సిబ్బందితో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాలను దీని కోసం వినియోగిస్తున్నారు. నిఘా వర్గాలు, శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు టాస్క్‌ఫోర్స్, స్పెషల్‌ బ్రాంచ్, ఇంటెలిజెన్స్‌ వర్గాలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రంగంలోకి దిగాయి. గతానికి భిన్నంగా ఈసారి హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌లోనూ డేగకన్ను వేశారు.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనా చోటుచేసుకోకుండా పోలీసులు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు.

మరిన్ని వార్తలు