సైబర్‌ మాయలో పడొద్దు

7 Feb, 2019 10:16 IST|Sakshi
బ్యానర్లు విడుదలు చేస్తున్న రాచకొండ కమిషనర్‌ మహేష్‌భగవత్‌

సైబర్‌ మోసాలపై అవగాహన కల్పిస్తున్న రాచకొండ

సైబర్‌ సెల్‌  పోలీసులు పలుచోట్ల బోర్డులు ఏర్పాటు

నాగోలు: టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువత, ఉద్యోగులు ఫోన్‌ ద్వారానే బ్యాంకు లావాదేవీలు, క్రెడిట్, డెబిట్‌ కార్డులు చెల్లింపులు చేయడంతో ఇదే అదునుగా భావించిన సైబర్‌ నేరగాళ్లు, క్రెడిట్, డెబిట్‌ కార్డుల నెంబర్లను సులువుగా సంపాదిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ నేరాలు జరగకుండా సైబర్‌ సెల్‌ పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తూ పలు ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. సైబర్‌ నేరగాళ్లకు చెక్‌ పెట్టేందుకు ప్రజలు మోస పోకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలసుకోవాలని సూచిస్తున్నారు. సైబర్‌ మాయగాళ్ల గురించి తెలిపేందుకు వాల్‌పోస్టర్‌లు, బ్యానర్లు, వాట్సప్‌ గ్రూప్స్‌లలో వివరాలు తెలియజేస్తూ అవి మరో ముగ్గురికి పంపేలా అవగాహన కల్పిస్తున్నారు. ఆధార్‌ సిమ్‌ కార్డు లింక్‌ అంటూ చాలా మంది యువతులతో ఫోన్‌ చేయించి బ్యాంకు ఖాతా వివరాలు లూఠీ చేస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిసున్నారు. 

పోలీసుల సూచనలు...  
బ్యాంకు అధికారులమని అపరిచిత వ్యక్తులు ఫోన్‌ చేస్తే నమ్మవద్దని, మీ బ్యాంకు వివరాలు కావాలంటే స్వయంగా బ్యాంకుకు వెళ్లి తెలుసుకోవాలి.
గుర్తు తెలియని వ్యక్తులకు ఖాతా, క్రెడిట్, డెబిట్‌ కార్డుల వివరాలు  లియజేయవద్దు. బ్యాంకు ఖాతా, పిన్‌ నంబర్‌ అడిగితే మోసంగా భావించి సమాధానాలు చెప్పవద్దు.  
కంప్యూటర్లకు, ల్యాప్‌టాప్‌లకు పాస్‌వర్డ్‌ పెట్టుకోవాలి. వ్యక్తిగత వివరాలు ఫోన్‌లో ఇతరులకు చెప్పకూడదు.  
అనుమానాస్పద ఈ మెయిల్స్, ఫోన్స్, మెసేజ్‌లు వస్తే స్పందిచరాదు. – అనుమానాస్పద ఫ్రెండ్‌ రిక్వెస్ట్, చాటింగ్‌ మెయిల్స్‌ తెరవవద్దు. సోషల్‌ మీడియాలో బ్యాంకు ఖాతాలు, డెబిట్, క్రెడిట్‌ కార్డుల వివరాలు షేర్‌ చేయొద్దు.  
మొబైల్స్‌కు వచ్చే ఓటీ పీ నెంబర్లను ఇతరులకు ఎవరికీ చెప్పవద్దు. తెలియని ఖాతాలకు నగదు బదిలీ చేయవద్దు.  
వ్యక్తిగత సమాచారం ఫొటోలు, వీడియోలు, ఉద్యోగం చేసే చిరునామా, ఇంటి చిరునామా, ఇతర విషయాలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయరాదు. నిరంతరం మెసేజెస్‌ పంపినట్లు అనుమా నం వస్తే వెంటనే సైబర్‌ పోలీసులకు తెలపాలి.

సైబర్‌ నేరాలు జరగకుండా అవగాహన
అన్ని ప్రాంతాల్లో సూచిక బోర్డుల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు రాచకొండ సైబర్‌ సెల్‌ ఏసీపీ హరినాథ్‌ తెలిపారు. ప్రజలను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. వివరాలకు   9490617111, 18004256235 నెంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు.–రాచకొండ సైబర్‌ సెల్‌ ఏసీపీ హరినాథ్‌

మరిన్ని వార్తలు