లాక్‌డౌన్‌ కట్టడిలో...

23 Apr, 2020 10:07 IST|Sakshi
వాహనాలు లేక వెలవెలబోతున్న ఉప్పల్‌ చౌరస్తా

నగరంలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలు

అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు

వెంగళరావునగర్‌: లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనదారులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో మె యిన్‌ రోడ్లను బుధవారం ట్రాఫిక్‌ పోలీసులు దిగ్భందం    చేశారు. ఉదయం 7 గంటల నుంచే రోడ్లన్నీ మూసేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే సిబ్బందిని సైతం      అడ్డుకుని వాహనాల∙పత్రాలను పరిశీలించారు.  

పాతబస్తీ దారులన్నీ క్లోజ్‌....
చార్మినార్‌: పాతబస్తీ దారులన్నింటినీ మూసివేశారు.  ప్‌లై ఓవర్‌ బ్రిడ్జ్‌పై రాకపోకలకు అడ్డుకట్ట వేశారు.   మంగళవారం నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్, ట్రాఫిక్‌ అదనపు పోలీసు కమిషనర్‌ అనీల్‌కుమార్, నగర ట్రాఫిక్‌ డీసీపీ బాబురావు తదితరులు పాతబస్తీలో పర్యటించి లాక్‌డౌన్‌ అమలు తీరును స్వయంగా పరిశీలించారు. దీంతో బుధవారం వాహనదారుల రద్దీ తగ్గింది.   

కాలనీల్లో బారికేడ్ల ఏర్పాటు...
ఉప్పల్‌: ఉప్పల్‌  జోన్‌ పరిధిలో లాక్‌ డౌన్‌ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపై బారికేడ్‌లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలువరిస్తున్నారు. బోడుప్పల్‌ పరిధిలో ఓ వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో చుట్టు కాలనీలన్నీ అప్రమత్తమయ్యాయి. ఎవరికి వారు ఆయా కాలనీల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసుకున్నారు.  

100కు పైగా వాహనాలు సీజ్‌..
జీడిమెట్ల: జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం పోలీసులు వాహనదారులను ఎక్కడికక్కడే నిలిపివేశారు. బాలానగర్‌ ఏసీపీ పురుషోత్తంతో పాటు జీడిమెట్ల సీఐ బాలరాజు ఆధ్వర్యంలో స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించారు. 100 కు పైగా వాహనాలను సీజ్‌ చేశారు.   

పకడ్బందీగా అమలు
గోల్కొండ: కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లోని కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు జరుగుతోంది. అహ్మద్‌నగర్, షేక్‌పేట్, ఆసిఫ్‌నగర్‌తో పాటు మెహిదీపట్నం ప్రాంతాల్లోని కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.  

మరింత కఠినంగా..
గచ్చిబౌలి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సైబరాబాద్‌ పోలీసులు లాక్‌డౌన్‌ను  మరింత కట్టుదిట్టం చేశారు.  బుధవారం అడుగడుగునా తనిఖీలు నిర్వహించడంతో రోడ్లపైకి వచ్చే వారి సంఖ్య తగ్గింది.   

కానరాని భౌతిక దూరం...
మేడ్చల్‌: మేడ్చల్‌ నియోజకవర్గ పరిధిలో లాక్‌డౌన్‌ అమలు జరగడం లేదు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించడం లేదు. అన్నదానాలు, నిత్యావసర సరుకుల పంపిణీ కొనసాగుతూనే ఉంది. గ్రామాల్లో అక్రమంగా కల్లు, మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.

లష్కర్‌లో ఉక్కుపాదం...
సికింద్రాబాద్‌:  సికింద్రాబాద్‌ సర్కిల్‌ పరిధిలో బుధవారం నుంచి లాక్‌ డౌన్‌ నిబంధనలు మరింత కఠినం చేశారు. అన్ని ఇంటర్నల్‌ రోడ్లను కట్టడి చేశారు. కంటైన్మెంట్‌ ప్రాంతాలుగా గుర్తించిన మెట్టుగూడ, బౌద్ధనగర్, సీతాఫల్‌మండి ప్రాంతాల్లో పోలీసు పికెట్‌లు రెట్టింపు చేశారు. గోపాలపురం ఏసీపీ వెంకటరమణ, చిలకలగూడ ఇన్‌స్పెక్టర్‌ బాలగంగిరెడ్డి నేతృత్వంలో తనిఖీలు ముమ్మరం చేశారు.  

ఇళ్ల వద్దకే నిత్యావసరాలు...
పంజగుట్ట: ఖైరతాబాద్‌ నియోజకవర్గ పరిధిలో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు జరుగుతుంది. సరైన కారణం లేకుండా బయటకు వస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు బుక్‌ చేస్తున్నారు. పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ వెనక వీధి, ఖైరతాబాద్‌ ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్, చింతల్‌బస్తీ, ఫిలింనగర్, బంజారాహిల్స్‌ సయ్యద్‌నగర్, వెంకటగిరి ప్రాంతాలు కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో బారికేడ్లు, గ్రిల్స్‌ ఏర్పాటు చేశారు.ప్రజలకు ఇళ్ల వద్దకే నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు.

లాక్‌డౌన్‌ అమలులో మార్పు
అంబర్‌పేట: లాక్‌డౌన్‌ అమలు తీరులో మార్పు వచ్చింది. రెండు రోజులుగా అంబర్‌పేట నియోజకవర్గంలో లాక్‌డౌన్‌ను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. రోడ్లపై వచ్చిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. దాతలను కూడా అనుమతించడం లేదు.  మధ్యాహ్నం 2 గంటలకే కిరాణా దుకాణాలను మూసివేయిస్తున్నారు.   

రోడ్డెక్కితే అంతే..
దిల్‌సుఖ్‌నగర్‌: మలక్‌పేట్, మహేశ్వరం జోన్ల పరిధిలో లాక్‌ డౌన్‌ను పోలీసులు మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, సైదాబాద్, కొత్తపేట్‌ ప్రాంతాల్లో కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.  

నిబంధనలు బేఖాతర్‌
చైతన్యపురి: చైతన్యపురి ప్రాంతంలో లాక్‌డౌన్‌ ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్‌బీనగర్‌ జాతీయ రహదారి, కొత్తపేట నుంచి నాగోలు రోడ్డులో జన సంచారం ఎక్కువగా ఉంది. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ పరిసరాల్లో డీసీఎం వాహనాలు రోడ్లకు ఇరువైపులా పార్కు చేసి పండ్లు విక్రయిస్తుండటంతో వాటిని కొనేందుకు ప్రజలు పోటీపడుతున్నారు.

రెండురోజుల్లో 500 కేసులు..
అబిడ్స్‌: అబిడ్స్‌ జోన్‌ పరిధిలో మంగళ, బుధవారాల్లో దాదాపు 500 వాహనాలను  ట్రాఫిక్‌ పోలీసులు సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు. ఎంజే మార్కెట్, పురానాపూల్, ఎంజే బ్రిడ్జ్, అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్, అబిడ్స్, నాంపల్లి, మల్లేపల్లి చౌరస్తా తదితర ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. చౌరస్తాల్లో రోడ్లపైకి వచ్చేవారిని అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాలను సీజ్‌ చేస్తున్నారు.  

సైకిళ్లపై తిరుగుతూ ప్రచారం
అల్వాల్‌: లాక్‌డౌన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు వినూత్న రీతుల్లో ప్రచారం చేస్తున్నారు. అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సీఐ పులి యాదగిరి ఆధ్వర్యంలో బుధవారం మచ్చబొల్లారం, ఓల్డ్‌ అల్వాల్, ఇందిరాగాంధీ విగ్రహం తదితర ప్రాంతాల్లో సైకిళ్లపై తిరుగుతూ ప్రచారం చేశారు. అనవసరంగా బయట తిరిగితే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్‌ చేస్తామని సీఐ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు