హలో.. మీ కేసు ఇలా!

31 May, 2018 14:19 IST|Sakshi

ఫిర్యాదుదారులకు పోలీసుల ఫోన్‌ కాల్‌ 

కేసు దర్యాప్తు పురోగతిపై సమగ్ర వివరణ 

కనీసం పక్షానికి ఓసారైనా, సమాచారం  

దర్యాప్తు అధికారులను ఆదేశించిన రాష్ట్ర డీజీపీ 

సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని ఓ ఠాణాలో రెండేళ్ల క్రితం నమోదైన చీటింగ్‌ కేసు.. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దర్యాప్తు అధికారులు తీసుకున్న చర్యల విషయం తెలియని బాధితుడు తన కేసును నిర్లక్ష్యం చేస్తున్నారని భావించి చులకన భావం ఏర్పరుచుకున్నాడు. అనేక మంది పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలెట్టాడు. పోలీసులపై ఒత్తిడి రావడంతో వారు అసలు విషయం బాధితుడికి వివరించారు.  ఏదైనా నేరానికి సంబంధించి కేసు పెట్టడం ఒక ఎత్తయితే.. దర్యాప్తు పురోగతిని తెలుసుకోవడం మరో ఎత్తుగా మారింది. అనేక కేసులకు సంబంధించి బాధితులు తమ కేసులను దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారులను (ఐఓ) కలుసుకోవడానికే అనేక ఇబ్బందులు పడుతుంటారు. అతి కష్టం మీద కలుసుకున్నా.. సరైన స్పందన లేని కారణంగా నిరాశ, అసంతృప్తి, అసహనాలకు లోనవుతారు. బాధితులకు సంబంధించిన ఈ ఫీలింగ్‌ పోలీసు విభాగంపై మచ్చకు 

కారణమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఓ వినూత్న విధానాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఫిర్యాదుదారులకు కేసు దర్యాప్తునకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇవ్వాల్సిన బాధ్యతల్ని ఐఓలకే అప్పగించారు. ఫిర్యాదుదారుడికి స్వయంగా ఫోన్‌ చేసి కనీసం పక్షం రోజులకొకసారైనా కేసు దర్యాప్తు పురోగతి వివరించాలని ఆదేశించారు. గత నెలలో కూకట్‌పల్లి జేఎన్టీయూలో జరిగిన సమగ్ర సమీక్ష సమావేశంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.  

సాధారణంగా చిక్కరు.. దొరకరు.. 
నమోదైన కేసు ప్రాధాన్యం, దాని తీరుతెనులను బట్టి దర్యాప్తు అధికారుల హోదా ఉంది. అధిక కేసుల్లో సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై) స్థాయి అధికారులే ఐఓలుగా వ్యవహరిస్తుంటారు. హత్య, భారీ చోరీ, దోపిడీ, బందిపోటు దొంగతనం తదితర కేసుల్లో ఇన్‌స్పెక్టర్, వరకట్న వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన వాటిలో ఏసీపీ స్థాయి అధికారులు దర్యాప్తు అధికారులుగా ఉంటారు. పోలీసుస్టేషన్లలో ఉండే ఎస్సైలు, ఇతర ఐఓలకు దర్యాప్తు బాధ్యతలతో పాటు పరిపాలన, బందోబస్తు, భద్రత విధులు, ఇతర డ్యూటీలు తప్పవు. దీంతో చాలా సందర్భాల్లో పోలీసుస్టేషన్‌లో కూర్చుని ఉండటం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే బాధితులు తమ కాళ్లు అరిగేలా పోలీసుస్టేషన్ల చుట్టూ తిరిగినా ఆయా దర్యాప్తు అధికారుల్ని కలుసుకోవడం అరుదు. అతికష్టమ్మీద కలిసినా వారి స్పందన అనేక సందర్భాల్లో అభ్యంతరకరంగా ఉంటోంది. ఇవన్నీ పోలీసు విభాగంపై ప్రజల్లో చులకన భావానికి కారణమయ్యే ఆస్కారం ఉంది.  

ఆన్‌లైన్‌ అవకాశాలు ఉన్నప్పటికీ... 
ఈ సమస్యల్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసు విభాగం ఈ–కాప్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక ఆన్‌లైన్‌ విధానాలను ప్రవేశపెట్టింది. సంక్షిప్త సందేశం (ఎస్సెమ్మెస్‌), పోలీసు వెబ్‌సైట్లలో ‘నో యువర్‌ కేస్‌ స్టేటస్‌’ అవకాశం కల్పించింది. వీటి ద్వారా ఎవరైనా తమ కేసు దర్యాప్తు పురోగతిని తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ‘అండర్‌ ఇన్వెస్టిగేషన్‌’ (యూఐ), ‘అండర్‌ ట్రయల్‌’ (యూటీ), క్లోజ్డ్‌... అని మాత్రమే తెలుస్తుంది. బాధితులు/ఫిర్యాదుదారులు తమ కేసు అప్పటికీ దర్యాప్తు దశలోనే ఉండిపోవడానికో, కేసును మూసేయడానికో కారణం తెలుసుకోవాలంటే అది ఆన్‌లైన్‌ ద్వారా సాధ్యంకాదు. మళ్లీ ఠాణాలు, ఐఓల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో సాంకేతిక కారణాల నేపథ్యంలో కేసు వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండట్లేదు. 

ఐఓలకే ఆ బాధ్యతలు అప్పగిస్తూ... 
ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి కేసు దర్యాప్తు దశ, తీరుతెన్నుల్ని బాధితులు/ఫిర్యాదుదారులకు వివరించాల్సిన బాధ్యతల్ని దర్యాప్తు అధికారులకే అప్పగించారు. ప్రతి ఐఓ తన దగ్గర ఉన్న కేసుల జాబితాతో పాటు ఫిర్యాదుదారుల ఫోన్‌ నెంబర్లు సైతం కలిగి ఉంటారు. ప్రతి రోజూ కొంతమంది చొప్పున ప్రతి బాధితుడికీ కనీసం 15 రోజులకు ఒకసారైనా వీరు ఫోన్‌ చేయాల్సి ఉంటుంది. వారి కేసు ప్రస్తుతం ఏ దశలో ఉంది? దర్యాప్తులో జాప్యానికి కారణమేంటి? ఇతర ఇబ్బందులు, సమస్యలు ఏంటి? అనే అంశాలను సవివరంగా చెప్పాలని సూచించారు. ఇలా ప్రతి ఐఓ తాను ఎవరెవరితో మాట్లాడాననే విషయంతో పాటు వారి కాంటాక్టు నెంబర్‌ను ఉన్నతాధికారులకు అందించాల్సి ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా ఈ విధానం అమలయ్యేలా చూడాలని డీజీపీ ఆదేశించారు. పర్యవేక్షణ బాధ్యతల్ని యూనిట్‌ ఆఫీసర్లుగా వ్యవహరించే జిల్లా ఎస్పీలు, కమిషనరేట్ల పోలీసు కమిషనర్లకు అప్పగించారు. 

>
మరిన్ని వార్తలు