సోప్‌.. మాస్క్‌.. సోషల్‌ డిస్టెన్స్‌

12 May, 2020 08:13 IST|Sakshi

ఎస్సెమ్మెస్‌’లను అలవాటుగా మారుద్దాం

ఇకపై ఈ మూడే అత్యంత కీలకం

ప్రత్యేక ప్రచారం షురూ చేసిన సిటీ కాప్స్‌

సోషల్‌ మీడియా సైతం విరివిగా వినియోగం

సాక్షి, సిటీబ్యూరో: సీజనల్‌ నేరాలు, సైబర్‌ క్రైమ్, అంతర్రాష్ట్ర ముఠాలు.. పోలీసు విభాగం ఇప్పటి వరకు వీటిపై మాత్రమే విస్తృతంగా ప్రచారం చేసేంది. అయితే కరోనా వైరస్‌ కట్టడి నేపథ్యంలో సామాజిక బాధ్యతగా వినూత్న క్యాంపెయినింగ్‌ మొదలెట్టారు. నగరంలో నివసించే ప్రతి ఒక్కరికీ సోప్‌ (ఎస్‌), మాస్క్‌ (ఎం), సోషల్‌ డిస్టెన్స్‌ (ఎస్‌) వినియోగం అలవాటుగా మార్చాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రచారానికి పోలీసు విభాగం సోషల్‌ మీడియాను వినియోగిస్తోంది. ఎస్‌ఎంఎస్‌పై అవగాహనకు సంబంధించి తొలి స్లైడ్‌ను అధికారులు సోమవారం విడుదల చేశారు. గడిచిన 45 రోజులుగా కరోనా వ్యాప్తి నిరోధం, లాక్‌డౌన్‌ అమలు కోసం పోలీసు విభాగం నిర్విరామంగా కృషిచేస్తోంది. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టడం నుంచి కంటైన్మెంట్‌ జోన్ల పర్యవేక్షణ, పాజిటివ్, ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్‌ వంటి వారి గుర్తింపు.. ఇలా అనేక విధుల్లో తలమునకలయ్యారు.

అయితే కరోనా ఇప్పట్లో పోయేది కాదని, దాంతో సహజీవనం చేయాల్సిందేనంటూ నిపుణులు పేర్కొంటున్నారు. కేవలం అవగాహన, వ్యక్తగత జాగ్రత్తలతోనే దీన్ని జయించేందుకు ఆస్కారం ఉందని ఇప్పటికే స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే నగర పోలీసు విభాగం ‘ఎస్సెమ్మెస్‌’ క్యాంపెయినింగ్‌ మొదలెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలోని బహిరంగ ప్రదేశాల్లో సంచరించే వారికి మాస్కులు తప్పనిసరంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు వ్యక్తిగత శుభ్రత, భౌతికదూరంపైనా అవగాహన కల్పిస్తున్నారు. నగరంలో నివసించే ప్రతి ఒక్కరూ కచ్చితంగా సబ్బుతో వీలైనన్నిసార్లు చేతులు కడుక్కోవడం, బయటకు వచ్చేప్పుడు పక్కాగా మాస్క్‌ ధరించడం, ఎక్కడైనా ఎదుటి వారితో భౌతికదూరం పాటించడం..

ఈ క్యాంపెయినింగ్‌లో కీలకాంశాలు. తొలుత శానిటైజర్ల వినియోగాన్ని ఇందులో చేర్చాలని భావించారు. అయితే నగరంలో అన్ని వర్గాలకు చెందిన వారు ఉండటం, ప్రతి ఒక్కరూ వీటిని ఖరీదు చేయడం సాధ్యం కాని నేపథ్యంలో సబ్బు వినియోగానికి ప్రాధాన్యమిస్తూ ప్రచారం చేస్తున్నారు. పోలీసు అధికారిక ఫేస్‌బుక్, వాట్సాప్‌లతో పాటు ట్విట్టర్‌ ద్వారానూ ఈ ‘ఎస్సెమ్మెస్‌’ ప్రచారం సోమవారం నుంచి మొదలైంది. దీన్ని నిర్విరామంగా కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మూడు ప్రతి నగవాసికి ఓ అలవాటుగా చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. భవిష్యత్తులో మరికొన్ని రకాలుగానూ ప్రచారం చేయనున్నారు.

మరిన్ని వార్తలు