ఎందుకు రిస్క్‌? వేస్కోండి మాస్క్‌

16 May, 2020 09:34 IST|Sakshi

‘ఎఫ్‌ఎంవీఈ’ మొదలైంది  

మాస్క్‌ లేకుండా బయటకు వచ్చేవారిపై సాంకేతిక నిఘా

ఇలాంటి వారిని గుర్తించి అలర్ట్‌ ఇస్తున్న సీసీ కెమెరాలు

మూడు కమిషనరేట్లతో ప్రయోగాత్మకంగా అమలులోకి

ఆరు రోజుల్లో 1896 కేసులు నమోదు చేసిన పోలీసులు

డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం జరిమానా విధింపు

సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌ మహమ్మారి విస్తరించకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని బహిరంగ ప్రదేశాల్లో సంచరించే ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలన్న నిబంధన వాటిలో ఒకటి. దీన్ని అమలులోకి తీసుకువచ్చిన పోలీసు విభాగం నేరుగా, సాంకేతికంగానూ ఉల్లంఘనుల్ని గుర్తిస్తోంది. రహదారులపై మాస్కులు లేకుండా సంచరిస్తున్న వారిని సీసీ కెమెరాల ద్వారా ఆటోమేటిక్‌గా గుర్తించడానికి ఉద్దేశించిన ఫేస్‌ మాస్క్‌ వైలేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఎఫ్‌ఎంవీఈ) సిస్టం రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ప్రయోగాత్మకంగా అమలులోకి వచ్చింది. ఈ నెల 7నుంచి పని ప్రారంభించిన దీని ద్వారా ఆరు రోజుల్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు 1896 కేసులు నమోదు చేశారు. త్వరలో ఎఫ్‌ఎంవీఈ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురావడానికి పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది. ఈ తరహా విధానం దేశంలోనే తొలిసారి రాజధానిలోని మూడు కమిషనరేట్లలో మొదలైంది. 

ఎఫ్‌ఆర్‌ఎస్‌ సర్వర్‌కు అనుసంధానం..
వివిధ నేరాలకు సంబంధించి వాంటెడ్‌గా ఉన్న వ్యక్తులు, పాత నేరస్తుల్ని నగరంలో పట్టుకోవడానికి రూపొందించిన ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్‌)లో పోలీసు విభాగం సమకాలీన అవసరాలకు తగ్గట్టు మార్పు చేర్పులు చేసింది. రాజధానిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నీ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ)లోని ఎఫ్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థతో కూడిన సర్వర్‌కు అనుసంధానించి ఉన్నాయి. ఇక్కడి సర్వర్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ నిక్షిప్తమై ఉంది. ఫలితంగా ఆయా కెమెరాల ముందుకు వచ్చిన వాంటెడ్‌ వ్యక్తుల్ని గుర్తించే సాఫ్ట్‌వేర్‌ సీసీసీలోని సిబ్బందికి అలెర్ట్‌ ఇస్తుంది. దేశంలోని మరే ఇతర కమిషనరేట్‌లోనూ లేని ఈ ఎఫ్‌ఆర్‌ఎస్‌ పరిజ్ఞానాన్ని ఇప్పుడు కరోనా నిరోధానికి అనువుగా మార్చి వాడుతున్నారు. ఎఫ్‌ఎంవీఈ పేరుతో రూపొందే ఈ సాఫ్ట్‌వేర్‌ సైతం సీసీసీలోని సర్వర్‌లో నిక్షిప్తం అవుతోంది. ఫలితంగా నగరంలో కాలినడకన సంచరించే, వివిధ క్యూలైన్లలో నిల్చునే ఏ వారిలో ఎవరైనా ఫేస్‌మాస్క్‌ ధరించకపోతే ఆ విషయాన్ని సమీపంలోని సీసీ కెమెరాల ద్వారా ఎఫ్‌ఎంవీఐ గుర్తించి, కంట్రోల్‌ రూమ్‌ సిబ్బందికి సమాచారం ఇస్తుంది. వెంటనే ఆ సమాచారాన్ని ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీసులకు చేరవేసి వారు ఈ ఉల్లంఘనులున్న ప్రాంతానికి వెళ్లేలా చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఎఫ్‌ఎంవీఈ పరిజ్ఞానం మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. 

రూ.1000 జరిమానాలు..
వాహనంపై వెళ్తున్న వాళ్లు, పాదచారుల్లో కొందరు మాస్కులు ధరించట్లేదు. అయితే వీళ్లు ఓ ప్రాంతంలో ఎక్కువ సేపు ఉండరు. ఫలితంగా వీరు మాస్క్‌ ధరించలేదనే విషయం ఎఫ్‌ఎంవీఈ గుర్తించినా.. దానిపై క్షేత్రస్థాయి పోలీసులకు సమాచారం అంది, వాళ్లు అక్కడకు పంపేలోపు వారు వేరే చోటుకు వెళ్లిపోతున్నారు. అదే దుకాణాల వద్ద, ఇతర సంస్థల వద్ద క్యూలో ఉన్న వారు మాత్రం చిక్కుతున్నారు. మాస్క్‌ మస్ట్‌ అంటూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం దీన్ని ధరించకుండా బయటకు వచ్చిన వారికి రూ.1000 జరిమానా విధించాలని స్పష్టం చేసింది. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 51 (బి) ప్రకారం ఈ కేసులు నమోదు చేస్తున్నారు. అయితే పోలీసులకు ఈ మొత్తం వసూలు చేసే అధికారం లేకపోవడంతో ప్రస్తుతం చలానా జారీ చేసి, వ్యక్తిగత బాండ్‌పై విడిచిపెడుతున్నారు. న్యాయస్థానాలు పని చేయడం ప్రారంభమైన తర్వాత ఈ ఉల్లంఘనులకు నోటీసులు ఇచ్చి, కోర్టులో హాజరుపరచనున్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఈ నెల 7– 13 మధ్య నమోదైన కేసులు ఇలా.. హైదరాబాద్‌: 1315 సైబరాబాద్‌: 191, రాచకొండ: 390

మరిన్ని వార్తలు