హ్యాట్సాఫ్‌

7 Apr, 2020 10:30 IST|Sakshi

మీ సేవలు అమూల్యం.. స్ఫూర్తిదాయకం

కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం

మీతో కలిసి పని చేస్తున్నందుకు గర్విస్తున్నా

పోలీసు సిబ్బందికి లేఖ రాసిన నగర కొత్వాల్‌

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తున్న సిటీ పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు చెబుతూ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ లేఖ రాశారు. హోంగార్డు మొదలు డీసీపీల వరకు మొత్తం 12,897 మంది సిబ్బందికి ఆదివారం ఈ లేఖలు అందాయి. అనునిత్యం విధులకే అంకితమైన సిబ్బందికి స్ఫూర్తిని ఇచ్చేలా అందులోని అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంతో పాటు పోలీసు విభాగం సైతం కనిపించని శత్రువుతో కనీవినీ ఎరగని పోరాటం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. విధి నిర్వహణలో పోలీసులు చూపిస్తున్న నిబద్ధత స్ఫూర్తిదాయకం అన్నారు. ప్రజా సేవకు పునరంకితమవుతూ అమూల్యమైన సేవల్ని అందిస్తున్న ప్రతి అధికారి, సిబ్బందిని కొత్వాల్‌ అభినందించారు.

మీలో ఒకడిగా, మీతో కలిసి పని చేయడం గర్వంగా భావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడం, ఆ మహమ్మారి బారినపడిన వారిని, వీరితో సంబంధాలు కలిగిన వారిని గుర్తించడంలో పోలీసు విభాగం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రతి పోలీసు అధికారి తన ప్రాథమిక విధులైన శాంతిభద్రతల పరిరక్షణ, లాక్‌డౌన్‌ అమలుతో పాటు అదనపు విధులనూ సమర్థంగా నిర్వర్తిస్తున్నారని.. ఇబ్బందుల్లో ఉన్న వారికి నిత్యావసరాలు అందించడంలోనూ ముందున్నారని పోలీసు కమిషనర్‌ కితాబిచ్చారు. ఇప్పటి వరకు జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ గరిష్టంగా 32 దేశాలు మాత్రమే పాల్గొన్నాయని, ప్రస్తుతం కరోనాపై చేస్తున్న యుద్ధంలో మాత్రం 206 దేశాలు పాల్గొంటున్నాయని అంజనీకుమార్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు పోలీసు విభాగం అందిస్తున్న సేవలు అమూల్యమని వ్యాఖ్యానించారు. వేళకాని వేళల్లోనూ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు సామాజిక సేవలోనూ ముందున్నారని, అన్నార్థులకు ఆహారం అందించడం, గర్భిణులను ఆస్పత్రులకు తరలించడం, అత్యవసర సమయాల్లో మేమున్నామంటూ పోలీసులు ముందుకు రావడం అభినందనీయమని కమిషనర్‌ తన లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు