32 మంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

19 Jan, 2016 18:51 IST|Sakshi

యాకుత్‌పురా (హైదరాబాద్) : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా భవానీనగర్ పోలీసులు మంగళవారం స్టేషన్ పరిధిలోని 32 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ బి. శ్రీనివాస్‌రావు రౌడీషీటర్లను  స్టేషన్‌కు పిలిపించి ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నిబంధనలను అతిక్రమిస్తే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటికే బైండోవర్ అయిన రౌడీషీటర్ల కాలపరిమితి ఇంకా కొన్ని నెలలు మిగిలి ఉందన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఉన్నతాధికారుల ఆదేశానుశారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. కౌన్సిలింగ్ అనంతరం భవానీనగర్ పోలీసులు ముగ్గురు పేరు మోసిన రౌడీషీటర్లను మంగళవారం బైండోవర్ చేశారు.

తలాబ్‌కట్ట చాచా గ్యారేజీ ప్రాంతానికి చెందిన సత్తార్ బిన్ చావూస్ ఆలియాస్ మహఫూజ్ గోరే (30), భవానీనగర్‌కు చెందిన మహ్మద్ ఫరాజ్ (21), తలాబ్‌కట్టాకు చెందిన మహ్మద్ నవాజ్ (26)లను ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకొని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచి బైండోవర్ చేశారు.

మరిన్ని వార్తలు