' నో 'ఆటో సేఫ్‌

8 Feb, 2019 10:54 IST|Sakshi

బినామీ పేర్లపైనే 70 శాతం ఆటోలు

ఫైనాన్షియర్ల గుప్పిట్లో పర్మిట్లు

నలుగురైదుగురు పేరుతో ఒకే ఆటో

ఏళ్లు గడిచినా ఏ ఆటో ఎవరిదో తేల్చని ఆర్టీఏ

భద్రత లేని ‘మై ఆటో సేఫ్‌’

సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్‌  పోలీసులు ఇటీవల  ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ‘మై ఆటో సేఫ్‌’. ప్రయాణికులకు సురక్షితమైన ఆటో రవాణా సదుపాయాన్ని కల్పించేందుకు ప్రారంభించారు. ఇందుకోసం పోలీసులు ఆటోలవివరాలను, వాటిని నడిపే డ్రైవర్ల వివరాలను నమోదు చేసుకుని ‘మై ఆటో సేఫ్‌’ స్టిక్కర్‌ను అతికిస్తున్నారు. సహజంగానే ఇలాంటి స్టిక్కర్‌ ఉన్న ఆటోలు సురక్షితమైనవేనని ప్రయాణికులు కూడా భావిస్తారు. వాటిలో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతారు. కానీ గ్రేటర్‌ హైదరాబాద్‌లో తిరుగుతున్న సుమారు 1.40 లక్షల ఆటోల్లో 70 శాతానికి పైగా ఫైనాన్షియర్ల గుప్పిట్లోనే ఉన్నాయి. అలాంటి ఆటోరిక్షాలను ఫైనాన్సర్లు కేవలం అగ్రిమెంట్లపై విక్రయిస్తున్నారు.

ఇలాంటి ఒప్పందాల ప్రాతిపదికపై ఒకే ఆటోను నలుగురు లేదీ అంతకంటే ఎక్కువ మందికి విక్రయిస్తారు. చివరకు ఏ ఆటో ఎవరి పేరు మీద ఉందో తెలియని పరిస్థితి. ఎలాంటి చట్టబద్ధత లేని ఈ అగ్రిమెంట్లపై ఫైనాన్సర్లు వందల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారాన్ని సాగిస్తుండగా, ఈ బినామీ పేర్ల ఆధారంగానే పోలీసులు ఆటోల భద్రతపై దృష్టి సారిస్తున్నారు. ఒరిజినల్‌ పర్మిట్లు, రిజిస్ట్రేషన్‌ పత్రాలను ఫైనాన్షియర్లు తమ వద్దనే ఉంచుకొని కేవలం అగ్రిమెంట్లపైనే ఆటోలను విక్రయిస్తున్నారు.  ఇలా ఒక్కో ఆటో ఎంతోమంది చేతులు మారుతోంది. ఇలాంటి ఆటోలు ప్రమాదాలకు గురైనప్పుడు, అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు ఆటో పత్రాల ఆధారంగా  నిందితులను గుర్తించడం అసాధ్యం. మరోవైపు పొరుగు జిల్లాల్లో నమోదై నగరంలో తిరుగుతున్న ఆటోలకు సైతం పోలీసులు ‘మై ఆటో సేఫ్‌’ స్టిక్కర్లను అతికిస్తున్నారు. కానీ నగరంలో తిరిగేందుకు వీటికి పర్మిట్లు లేవనే వాస్తవాన్ని విస్మరించారు.

ఏళ్లకు ఏళ్లుగా అదే నిర్లక్ష్యం
గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆటోరిక్షాలపై మొదటి నుంచి ఫైనాన్షియర్ల గుత్తాధిపత్యమే కొనసాగుతోంది. ఆటో ద్వారా ఉపాధి పొందాలనుకొనే  డ్రైవర్లు ఫైనాన్షియర్లను ఆశ్రయిస్తున్నారు. చివరకు ఫైనాన్షియర్లకు వడ్డీలు చెల్లించలేక ఆటోలను వదిలేసుకుంటున్నారు. ఒక డిఫాల్టర్‌ అయిన డ్రైవర్‌ నుంచి మరో డ్రైవర్‌కు మారుతున్నాయి. ఆ డ్రైవర్‌ డిఫాల్టర్‌ కావడంతో మరొకరికి విక్రయిస్తున్నారు. ఇదొక అక్రమార్జన పర్వంగా కొనసాగుతోంది. మోటారు వాహన చట్టం ప్రకారం ఏ వాహనమైనా ఒకరి నుంచి మరొకరికి బదిలీ అయినప్పుడు ఆ వివరాలు ఆర్టీఏలో నమోదు కావాలి. రుణ ప్రాతిపదికపై విక్రయించినట్లు రిజిస్ట్రేషన్‌ చేయాలి. కానీ ఇలాంటి చట్టబద్ధమైన మార్పు లేకుండానే అఫిడవిట్లు, ఇతర అగ్రిమెంట్ల ఆధారంగా ఫైనాన్షియర్లు ఒకే ఆటోను అనేక మందికి విక్రయిస్తున్నారు. ఈ అడ్డగోలు వ్యాపారాన్ని అరికట్టడంలో రవాణాశాఖ పూర్తిగా విఫలమవుతోంది.

ఆర్టీఏ అధికారులు ఫైనాన్షియర్లకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఆటో యజమానులను గుర్తించి, చట్టబద్ధంగా ధృవీకరించేందుకు 2014లో స్పెషల్‌  డ్రైవ్‌కు ప్రణాళికలు రూపొందించారు. ఫైనాన్షియర్లతో సంప్రదింపులు సైతం చేశారు. ఆటోలకు ఎఫ్‌ఆర్‌సీ (ఫ్రెష్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌) అందజేయాలని నిర్ణయించారు. ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీఏ సంయుక్తంగా చేపట్టిన  ఈ కార్యక్రమం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఫైనాన్షియర్ల అక్రమ వ్యాపారం యదేచ్ఛగా సాగుతూనే ఉంది. ఒకే ఆటోను పదే పదే విక్రయిస్తూనే ఉన్నారు. ఆటోల నిజమైన యజమానుల గుర్తింపు   ఆచరణకు నోచుకోలేదు. పైగా ఇలా అగ్రిమెంట్లపై విక్రయించే ఆటోల్లో ఎక్కువ శాతం నకిలీ ఇన్సూరెన్స్‌ పత్రాలు, నకిలీ అడ్రస్‌లపైనే ఒకరి నుంచి మరొకరికి చేతులు మారుతున్నాయి. ఇలాంటి ఆటోలు ప్రమాదాలకు గురైనప్పుడు ప్రయాణికులకు బీమా వర్తించడం లేదు. 

ఈ ఆటోల్లో భద్రత ఎంత?
ఆటోల్లో మీటర్‌ రీడింగ్‌లు ఉండవు. డ్రైవర్లు అడిగినంతా చెల్లించాల్సిందే. జబర్దస్త్‌గా వసూళ్లకు పాల్పడతారు. తరచుగా ప్రయాణికులపై బెదిరింపులకు దిగుతున్నారు. ఇక మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, బేగంపేట్, హైటెక్‌సిటీ వంటి రైల్వేస్టేషన్ల నుంచి రాత్రి వేళల్లో ఆటోల్లో ప్రయాణం చేయడం దాదాపుగా అసాధ్యం. మహిళలు, పిల్లలు ఆటోల్లో ప్రయాణం చేయలేని పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల ఆటోడ్రైవర్ల రూపంలోనే అసాంఘిక శక్తులు మోహరించి ఉంటున్నాయి. నిజమైన యజమాని ఎవరో నిర్ధారణ లేని, చట్టబద్ధమైన గుర్తింపు పత్రాలు లేని ఇలాంటి ఆటోల్లో ‘మై ఆటో సేఫ్‌’ స్టిక్కర్లు భద్రతను ఇస్తాయని భావించడం హాస్యాస్పదమే అవుతుంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ధనిక రాష్ట్రంలో జీతాలకు కోతలా?

గాంధీలో వైద్యులపై దాడి

టిక్‌టాక్‌ భారీ విరాళం

కేసీఆర్‌ తాతా కనికరించవా?

యువకులపై పంజా

సినిమా

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా

మ‌ళ్లీ అడ్డంగా దొరికిన న‌టి, ఇదిగో ఫ్రూఫ్‌..

‘నాలుగో సింహం ఎవరో చెప్పిన సాయి కుమార్‌’

ఆర్జీవీ: రోజూ గిల్లే వాడు