63 వేల మంది ఒకేసారి ‘కనెక్ట్‌’

19 Jun, 2018 00:48 IST|Sakshi
కాప్‌–కనెక్ట్‌ యాప్‌ను ఆవిష్కరిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు

పోలీస్‌ శాఖలో సరికొత్త మెసేజింగ్‌ వ్యవస్థ 

గ్రూప్‌లో డీజీపీ నుంచి కానిస్టేబుల్‌ వరకు 

కాప్‌–కనెక్ట్‌ యాప్‌ ఆవిష్కరించిన డీజీపీ

సాక్షి, హైదరాబాద్‌ : వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా 256 మంది మాత్రమే సభ్యులుగా ఉండొచ్చు. అయితే పోలీస్‌ శాఖలో డీజీపీ నుంచి కానిస్టేబుల్‌ వరకు 63 వేల మంది ఒకే యాప్‌ ద్వారా గ్రూప్‌లో ఉండేలా సరికొత్త కమ్యూనికేషన్‌ వ్యవస్థను అందుబాటులోకి వచ్చింది. డీజీపీ ఒక విషయం గ్రూప్‌లో షేర్‌ చేస్తే యావత్‌ పోలీస్‌ శాఖ ఒకేసారి చూసేలా అత్యాధునిక విధానాన్ని ప్రవేశపెట్టింది. ‘కాప్‌–కనెక్ట్‌’పేరుతో పోలీస్‌ శాఖ రూపొందించిన వాట్సాప్‌ యాప్‌ను సోమవారం డీజీపీ మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ఫోన్‌ నంబర్ల ఆధారంగా యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వారా వాడుకలోకి తీసుకురానున్నట్లు మహేందర్‌రెడ్డి తెలిపారు.  

క్షణాల్లో అందరికీ ఆదేశాలు..  
కాప్‌ కనెక్ట్‌ ద్వారా పోలీస్‌ స్టేషన్లు, సర్కిల్, సబ్‌డివిజన్, ఎస్పీలు/కమిషనర్లు, రాష్ట్ర స్థాయి అధికారులు.. ఇలా ఎక్కడికక్కడ ఈ యాప్‌ ద్వారా గ్రూప్‌లు పెట్టుకొని సమాచారం చేరవేయడం, ఇతర ఆదేశాలు జారీ చేయనున్నారు. కాప్‌–కనెక్ట్‌ ద్వారా అప్పటికప్పుడు చేపట్టాల్సిన కార్యక్రమాలు, డీజీపీ ఆదేశాలు, సూచనలు నేరుగా సిబ్బందికి చేరవేయవచ్చు. ఈ యాప్‌ ద్వారా సందేశాలు, ఆడియోలు, డాక్యుమెంట్లు, వీడియోలు పంపొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 638 పోలీస్‌స్టేషన్లకు ఒకేసారి ఆదేశాలు జారీచేయడానికి ఈ యాప్‌ ఉపకరిస్తుందని డీజీపీ తెలిపారు. 

ఒకేసారి వెయ్యి మందితో.. 
సాధారణంగా వీడియో కాన్ఫరెన్స్‌ ఓ కార్యాలయం నుంచి మరో కార్యాలయంలోని అధికారుల మధ్య జరుగుతుంది. కాప్‌ కనెక్ట్‌ ద్వారా వెయ్యి మందితో నేరుగా డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడేలా ఈ యాప్‌ ఉపయోగపడుతుందని మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ యాప్‌లో ఐటీ బృందం మాత్రమే గ్రూప్స్‌ ఏర్పాటు చేసేలా, తొలగించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే మూడు రకాల చాటింగ్‌కు అవకాశం కల్పించారు. వన్‌ టు వన్‌ చాట్, వన్‌ టు మెనీ చాట్, గ్రూప్‌ చాట్‌ చేసే సౌలభ్యం ఉంటుంది. కీలక విభాగాలతో పలు గ్రూప్‌లు ఏర్పాటు చేయబోతున్నట్లు డీజపీ తెలిపారు. రోల్‌బేస్డ్‌ గ్రూప్‌లో పెట్రోలింగ్, స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్స్, రిసెప్షన్‌ ఆఫీసర్స్‌ ఉంటారని చెప్పారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్, సబ్‌ డివిజనల్‌ అధికారులతో డిజిగ్రేషన్‌ బేస్డ్‌ గ్రూప్, అలాగే టాస్క్‌ బేస్డ్, వర్టికల్‌ బేస్డ్‌ గ్రూప్స్, యూనిట్‌ లెవల్‌ గ్రూప్స్, పర్సనల్‌ గ్రూప్స్‌ ఉంటాయని వివరించారు.

మరిన్ని వార్తలు