ఆ వేళల్లో అదనపు సిబ్బంది!

24 Nov, 2018 10:31 IST|Sakshi

నిర్ణయించిన ట్రాఫిక్, ఆర్పీఎఫ్‌ అధికారులు

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాలపై దృష్టి

సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా నగరానికి వస్తున్న, ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తున్న రైలు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని నగర ట్రాఫిక్, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌) అధికారులు నిర్ణయించారు. ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలను గుర్తించేందుకు ఈ రెండు విభాగాల అధికారులు గురువారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో కాలినడకన పర్యటించారు. ఆర్పీఎఫ్‌ ఐజీగా నియమితులైన ఈశ్వర్‌రావు, ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్, డీసీపీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌తో పాటు స్థానిక అధికారులూ స్టేషన్‌ చుట్టూ ఉన్న ప్రతి రోడ్డులోకి వెళ్లి అక్కడి సమస్యలు గుర్తించారు.

రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉండే తెల్లవారుజాము 5 నుంచి ఉదయం 9, సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల మధ్యే రద్దీ భారీగా ఉందని తెలుసుకున్నారు. ఆయా సమయాల్లో రోటీన్‌గా ఉండే సిబ్బందికి అదనంగా మరికొందరిని మోహరించాలని, ట్రాఫిక్‌ అధికారులు ఆర్పీఎఫ్‌ వారితో సమన్వయం ఏర్పాటు చేసుకుని పని చేయాలని నిర్ణయించారు. రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో అక్రమ పార్కింగ్, ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, అడ్డదిడ్డంగా ఉంటున్న ఆటోలు, చిరు వ్యాపారుల వ్యవహారశైలితో వాహనచోదకులతో పాటు పాదచారులు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. వీరిని అదుపు చేసేందుకు మరికొన్ని చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు