బ్లాక్‌స్పాట్స్‌పై నజర్‌!  

4 Jun, 2018 08:35 IST|Sakshi

రోడ్డు ప్రమాదాల నివారణపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల ఫోకస్‌ 

70 బ్లాక్‌స్పాట్‌లను మెరుగుపరిచేందుకు చర్యలు 

ఫుట్‌పాత్‌ ఆక్రమణదారులకు చెక్‌ 

ఇక గల్లీల్లోనూ హెల్మెట్‌ జరిమానాలు  

సాక్షి, సిటీబ్యూరో : ఐటీ కారిడార్‌గా ముద్ర ఉన్న సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లోని శివారు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. వందల సంఖ్యలో కంపెనీలతో పాటు కళాశాలలు కూడా వెలుస్తున్నాయి. విద్య, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో అదే సంఖ్యలో జనప్రవాహం పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే ట్రాఫిక్‌ సమస్యలు పెరుగుతున్నాయి. వాహనదారులు మితిమీరిన వేగంతో రయ్‌మంటూ దూసుకెళుతూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో రోడ్డు బాగాలేక ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.

వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించిన 70 బ్లాక్‌స్పాట్‌లను మెరుగుపరిచేదిశగా సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నేషనల్‌ హైవే అథారిటీస్, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు, ఆర్‌ అండ్‌ బీ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటుచేసి రోడ్లను బాగుచేయడంపై దృష్టి సారించారు. ఆయా విభాగ అధికారులను తరచూ కలుస్తూ ఆ పనులను వేగిరం చేయాలని సూచిస్తున్నారు.  

హైవేల్లో వేగ నియంత్రణపై దృష్టి... 
నగర శివారు ప్రాంతాల్లో ఉన్న జాతీయ రహదారులపై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే అక్కడ ప్రత్యేకంగా స్పీడ్‌ లేజర్‌ గన్‌ కెమెరాలతో వాహనదారుల వేగంపై నిఘా ఉంచి ఉల్లంఘనులకు జరిమానాలు విధిస్తున్నారు. పగటిపూట కూడా డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షలు చేస్తున్నారు. హైవేల్లో వాహనాలు పార్కింగ్‌ చేయకుండా ఉండేందుకు ప్రత్యేక బృందాలతో ఎప్పటికప్పుడూ తనిఖీలు చేస్తున్నారు. నాణ్యత లేకుండా..గుంతలమయంగా మారిన రోడ్లను బాగుపరిచేందుకు నేషనల్‌ హైవే ఆథారిటీ అధికారులతో ఎప్పటికప్పుడూ సంప్రదిస్తున్నామని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. ముఖ్యంగా హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే చాలామంది ద్విచక్ర వాహనదారులు గాయాలై ప్రాణాలు పోతున్నాయనే దానికి అనేక ఘటనలు సాక్ష్యంగా ఉన్నాయన్నారు. 

ఈ నేపథ్యంలోనే బండి ఎక్కితే తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించడాన్ని పకడ్బందీగా అమలుచేయడాన్ని మరింత కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా గల్లీల్లోనూ ప్రయాణం చేసే వాహనదారులు హెల్మెట్‌ ధరించకపోతే జరిమానా విధిస్తామని, అవసరమైతే చట్ట ప్రకారం కేసులు నమోదుచేస్తామని ఆయన హెచ్చరించారు.  హెల్మెట్‌ తప్పనిసరి అని చట్టం చెబుతున్నా ఎవరికి వారు బాధ్యతగా హెల్మెట్‌ ధరించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు. హెల్మెట్‌ ఉల్లంఘనులకు సంబంధించి నెలకు మూడు లక్షలపైనే కేసులు నమోదవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. అధిక శాతం మంది కేసులు, జరిమానాలకు సిద్ధమవుతున్నారే తప్ప హెల్మెట్‌ మాత్రం ధరించడం లేదన్నారు. అలాగే రోడ్ల పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌ను ఆక్రమిస్తూ ట్రాఫిక్‌ సమస్యలకు కారణమవుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫుట్‌పాత్‌ ఆక్రమణదారులకు పూర్తిగా చెక్‌ చెప్తామన్నారు.  

మరిన్ని వార్తలు