అవ్వకు బువ్వపెట్టి.. ఆశ్రమంలో చేర్పించాడు

2 Apr, 2018 17:47 IST|Sakshi

కూకట్‌పల్లి హోంగార్డుపై ప్రశంసలు.. ఫొటోలు వైరల్‌

సాక్షి, హైదరాబాద్‌: అది నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన కూకట్‌పల్లి జేఎన్‌టీయూ సిగ్నల్‌.. జనం ఎవరి సోయిలో వాళ్లు.. రోడ్డు పక్కనే ఒక అవ్వ.. పెట్టే దిక్కులేక చాన్నాళ్ల నుంచి తిండి తిననట్లు బక్కచిక్కిన శరీరం.. ఎటు పోవాలో, ఏం చెయ్యాలో తెలియని బిత్తరచూపులు! అటుగా వచ్చిన హోంగార్డు ఒకరు ఆ అవ్వను చూసి చలించిపోయాడు. పక్కనున్న టిఫిన్‌ సెంటర్‌ నుంచి ఆహారం తీసుకొచ్చి ఓపికగా అవ్వకు తినిపించాడు. అంతేనా, అధికారుల సాయంతో అవ్వను ఆశ్రమంలో చేర్పించాడు.

అతని పేరు బి.గోపాల్‌. కూకట్‌పల్లి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డు. ఉద్యోగరీత్యా అతని స్థాయి చిన్నదే అయినా, ఉన్నత వ్యక్తిత్వం అతని సొంతం. అందుకే ఉన్నతాధికారుల నుంచి సామాన్యపౌరుల దాకా అందరూ అతన్ని అభినందిస్తున్నారు. తెలంగాణ డీజీపీకి పీఆర్వో భార్గవి పోస్ట్‌ చేసిన ఈ ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఆ వృద్ధురాలిని చర్లపల్లిలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఆనందాశ్రమానికి తరలించినట్లు భార్గవి తెలిపారు.

మరిన్ని వార్తలు