‘హాక్ ఐ’తో ఆపద నుంచి బయటపడొచ్చు ఇలా..

9 Jan, 2015 00:21 IST|Sakshi
‘హాక్ ఐ’తో ఆపద నుంచి బయటపడొచ్చు ఇలా..

మీరు ఆపదలో ఉన్నారా?.. మీ కళ్లముందే అన్యాయం జరుగుతుందా?.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఉందా?.. ఇదివరకటిలా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమయం వృథా చేసుకోనవసరం లేదు. జస్ట్ ఒకే ఒక్క క్లిక్‌తో మీ ఫిర్యాదును నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. డ్యూటీలో ఉన్న పోలీసూ నిర్లక్ష్యం చేసినా ఒక్క క్లిక్ చాలు. ఇందుకోసం ‘హాక్ ఐ’ పేరిట హైదరాబాద్ పోలీస్ ఐటీ సెల్ డిపార్ట్‌మెంట్ సరికొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ఎలా ఉపయోగించాలి?, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో మీ కోసం...                
 
కావాల్సింది ఏమిటి?..
* ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్, ఇంటర్‌నెట్ డేటా సౌకర్యం ఉండాలి. అప్పుడు ‘హాక్ ఐ’ అప్లికేషన్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* ఇందుకోసం మీరు ప్లే గూగూల్.కామ్‌లో సెర్చ్ చేయవచ్చు.
* http://www.hyderabadpolice.gov.in/Default.htm ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  
* కుడి వైపున ఉన్న ‘హాక్ ఐ’ సింబల్‌పై క్లిక్ చేయండి.  విండోలో కనిపిస్తున్న ‘ఇన్‌స్టాల్’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే యాప్ మొబైల్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. అప్లికేషన్ యాక్టివేట్ చేయాలంటే లాగిన్ కావాలి.  లాగిన్ రెండు రకాలుగా చేయవచ్చు. ఒకటోది లాగిన్ విత్ ఫేస్‌బుక్, రెండోది లాగిన్ విత్ ఎప్పిర్ విండో.
* స్క్రీన్‌పై ఉన్న ఆప్షన్ లాగిన్ అయిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.
 
రిపోర్ట్ వైలేషన్ టూ పోలీస్...
* ఇక్కడ మీరు మీ ఫిర్యాదును ఫొటోలు, వీడియో రూపంలో పంపవచ్చు.
* మీరున్న ప్రాంతం, దాని వివరాలు క్లుప్తంగా ఇక్కడ అందించి ఫిర్యాదు చేయవచ్చు.
 
ఉమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్
* మహిళలు ప్రయాణించే సమయంలో ఇది రక్షణగా ఉంటుంది.
* ఆటోలు, ట్యాక్సీలో ప్రయాణిస్తున్నప్పుడు దీన్ని వాడవచ్చు.
* ముందుగా మీరు ఎక్కే వాహనం ఫొటోను క్యాప్చర్ చేయాలి.
* ఈ ఆప్షన్‌లో.. ఎక్కడ ఎక్కుతున్నది, వాహనం ఏది, దాని నంబరు, ఎక్కడికి వెళ్తున్నారు... అనే వివరాలు పొందుపర్చాలి.
* ప్రమాదం జరిగితేనేకాకుండా ప్రయాణ సమయంలో ఇబ్బందులు ఎదురైనా దీన్ని ఉపయోగించవచ్చు.
 
ఎస్‌ఓఎస్ (ఎమర్జెన్సీ బటన్)

* ఈ ఆప్షన్‌లో మీ పేరు, ఫోన్ నంబరు, అత్యవసర సమాచారాన్ని టైప్ చేయాలి.
* తరువాత మీరు అత్యవసర సమయంలో ఎవరిని సంప్రదించాలనుకుంటున్నారో వారి ఫోన్‌నంబరును ఎంటర్‌చేసి సెండ్ చేయాలి.
* ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ బటన్ యాక్టివేట్ అవుతుంది.
* అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఈ బటన్ నొక్కితే ఆ సమాచారం మీరు అనుకున్నవారికి చేరుతుంది.
 
కమ్యూనిటీ పోలీసింగ్
* సమాజంలో మీరు లా అండ్ ఆర్డర్‌కు సహకరించాలనుకున్నా, పోలీసులకు అన్ని విధాలా సహకరించాలనుకున్నా కమ్యూనిటీ పోలీసింగ్ ఆప్షన్‌లో రిజిష్టర్ కావొచ్చు.
* ఇక్కడ మీరు.. పేరు, చిరునామా, ఈ-మెయిల్, ఫోన్ నంబరు, మీ పరిధిలోని పోలీస్ స్టేషన్ తదితర వివరాలు ఇవ్వాలి.
* ఇక్కడ మీరు పోలీసుల నుంచి కమ్యూనిటీ పోలీసింగ్ న్యూస్ కావాలంటే అది సెలక్ట్ చేసి సబ్‌మిట్ చేయాలి.  
 
ఎమర్జెన్సీ కాంటాక్ట్స్
*ఇక్కడ మీరు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల వివరాలు పొందవచ్చు.
* ఈ ఆప్షన్‌లో మీకు అన్ని పోలీస్ స్టేషన్‌ల పేర్లు కనిపిస్తాయి.
* మీకు కావాల్సిన పోలీస్ స్టేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* అప్పుడు మీకు సంబంధిత పోలీస్ స్టేషన్ చిరునామా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ నంబర్, ఏసీపీ, కంట్రోల్ రూమ్ తదితర ఇతర అధికారుల ఫోన్ నంబర్లు కనిపిస్తాయి.
 
ఎస్‌ఓఎస్ ప్రాధాన్యత
* దీన్ని క్రియేట్ చేసిన తరువాత మీ స్క్రీన్‌పై ఎస్‌ఓఎస్ బటన్ కనిపిస్తుంది.
* అత్యవసర సమయంలో ఈ బటన్ నొక్కితే ఇదివరకు మీరు నమోదు చేసిన ఐదుగురితోపాటు స్థానిక పోలీస్ స్టేషన్‌కు, ఏసీపీ, డీసీపీలకు సమాచారం వెళ్తుంది.

>
మరిన్ని వార్తలు