చిన్నారులే ‘ట్రాఫిక్‌ పోలీసులు’

14 Jul, 2020 07:29 IST|Sakshi

తల్లిదండ్రులు చేసే ఉల్లంఘనలపై నిఘా

వీకాప్‌ పేరుతో కొత్త విధానానికి శ్రీకారం

తార్నాక ఎన్‌ఐఎన్‌లో నేడు ఆవిష్కరణ

సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగం మరో సరికొత్త ఆలోచనతో ముందుకు వస్తోంది. తల్లిదండ్రులు పాల్పడే ఉల్లంఘనలు గుర్తించడానికి, వారికి ‘కౌన్సెలింగ్‌’ ఇవ్వడానికి ఉద్దేశించి ‘వీకాప్‌’ అనే విధానంతో ముందుకు వస్తోంది. హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్, నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు సంయుక్తంగా ఈ కాన్సెప్ట్‌ను అమలులోకి తీసుకువస్తున్నారు. దీన్ని నగర పోలీసు విభాగం మంగళవారం తార్నాకలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషియన్‌ (ఎన్‌ఐఎన్‌) ఆడిటోరియంలో అధికారికంగా ఆవిష్కరించనుంది. నగరంలో రోజు రోజుకూ వాహనాల సంఖ్యతోపాటు ట్రాఫిక్‌ ఉల్లంఘనల సంఖ్య పెరుగుతూపోతోంది. దీన్ని నిరోధించడానికి ట్రాఫిక్‌ విభాగం అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. వైలేషన్స్‌ చేసే వారిని గుర్తించి చలాన్లు జారీ చేయడం, తీవ్రమైన వాటిలో వాహనాలు సీజ్‌ చేయడంతో పాటు ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో (టీటీఐ) కౌన్సిలింగ్స్‌ ఇస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడపటం, మైనర్‌ డ్రైవింగ్‌ వంటి వైలేషన్స్‌ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు బాధ్యుల్ని కోర్టుకు తరలిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిలో అనేక మంది ఎవరైనా తమ తప్పుల్ని ఎత్తి చూపితే వాటిని వీడుతున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. ఈ బాధ్యతల్ని కేవలం పోలీసు విభాగమే భుజాన వేసుకోకుండా..

చిన్నారులకూ అప్పగించాలని నగర పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే వీకాప్‌ విధానానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రాథమికంగా ఐదు, ఆరు, ఏడు తరగతులు చదువుతున్న విద్యార్థుల్ని టార్గెట్‌గా చేసుకున్నారు. స్థానిక ట్రాఫిక్‌ విభాగం అధికారులు, విద్యాశాఖ, ఆయా స్కూళ్ళ యాజమాన్యాలు కలిసి ఈ తరగతుల విద్యార్థులకు ట్రాఫిక్‌ నిబంధనలు, వాటి అమలుకు ఉన్న ప్రాధాన్యం ఉల్లంఘనలకు పాల్పడితే కలిగే నష్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారు. ఆపై తల్లిదండ్రులతో కలిసి, వారి వాహనాల్లో ప్రయాణించేప్పుడు ‘వీకాప్‌’ చిన్నారులే పోలీసుల పాత్ర పోషిస్తారు. డ్రైవింగ్‌ చేస్తున్న తన తల్లి లేదా తండ్రి చేసిన ఉల్లంఘనల్ని గుర్తిస్తారు. ఈ వివరాలను తమ వద్ద ఉండే రిపోర్ట్‌ కార్డ్‌లో నమోదు చేయడమే కాకుండా.. తమ తల్లిదండ్రులు చేస్తున్న ఉల్లంఘనలపై వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడం, లాభనష్టాలను వివరించి మరోసారి ఉల్లంఘనలకు పాల్పడకుండా అవగాహనకు ప్రయత్నించడం ఈ వీకాప్స్‌ ప్రధాన విధి. ఉల్లంఘనల్ని నమోదు చేసిన రిపోర్ట్‌ కార్డ్స్‌ను పాఠశాలతో సంబంధిత వారి ద్వారా స్థానిక ట్రాఫిక్‌ పోలీసులకు అందిస్తారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత వీకాప్స్‌ ఎంపిక, శిక్షణ చేపట్టనున్నారు. 

ఈ విధానం ఎంతో ఉపయుక్తం  
భద్రమైన ఇల్లు ఉంటేనే  భద్రమైన సమాజం సాకారం అయ్యే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రుల ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై నిఘా అనేది చిన్నారులకు అప్పగిస్తున్నాం. దీనికోసమే ప్రత్యేకంగా సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌తో కలిసి వీకాప్‌ విధానం అమలు చేస్తున్నాం. వాహనం కలిగి ఉన్న ప్రతి తల్లిదండ్రీ కచ్చితంగా తమ పిల్లల్ని తీసుకుని వాటిపై ప్రయాణిస్తూ ఉంటారు. ప్రతి రోజూ పాఠశాలల వద్ద పిల్లల్ని దింపడానికే లక్షల మంది సొంత వాహనాల్లో బయటకు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే డ్రైవింగ్‌ చేసే తల్లిదండ్రులపై నిఘా ఉంచడానికి, వారు చేసిన ఉల్లంఘనల్ని గుర్తించడానికి, కౌన్సెలింగ్‌ ఇవ్వడంపై చిన్నారులకు శిక్షణ ఇస్తున్నాం. ఈ విధానం వల్ల ఆయా చిన్నారులకూ ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన ఏర్పడి వాటి ప్రాధాన్యం తెలుస్తుంది. ఫలితంగా భవిష్యత్తులో వాళ్లు బాధ్యతగల వాహనచోదకులుగా మసలుకుంటారు.
– నగర పోలీసు అధికార

>
మరిన్ని వార్తలు