నేడు సిటీ పోలీస్‌కు సవాల్‌!

9 Nov, 2019 07:45 IST|Sakshi

ఆర్టీసీ జేఏసీ ‘చలో ట్యాంక్‌ బండ్‌’

డిపోల వద్ద ఆందోళనలు ‘బాబ్రీ’ తుది తీర్పు నేపథ్యం

శుక్రవారం రాత్రి పాతబస్తీలో కొత్వాల్‌

సాక్షి,సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధనకు మిలియన్‌ మార్చ్‌తరహాలో తలపెట్టిన ‘చలో ట్యాంక్‌బండ్‌’ ఒక వైపు.. ఏళ్ల తరబడి నలుగుతున్న అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు శనివారం వెలువడనుంది. ఈ నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నెలరోజులకు పైగా ఆందోళనలతో పాటు ఆత్మహత్యలకు సైతం వెనుకాడకుండా ఆర్టీసీ సిబ్బంది చేస్తున్న ఉద్యమంతో పోలీసులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ప్రభుత్వం ఎంతకూ దిగిరాకపోవడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు శనివారం చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీలు సైతం మద్దతు పలికాయి. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా విజయవంతం చేసేందుకు ఆర్టీసీ జేఏసీ సన్నద్ధమైంది. మరోపక్క ఆయా డిపోల వద్ద కూడా ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ఇప్పటికే తమ శ్రేణులకు పిలుపునిచ్చారు.

జిల్లాల నుంచి ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, ఆయా పార్టీల కార్యకర్తలు భారీ సంఖ్యలో నగరానికి చేరుకోనున్నారు. అయితే, ఆందోళనలను కట్టడి చేసేందుకు పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. నిరసన తెలిపేందుకు కార్మికులు ఏ మలుపు నుంచి ఎక్కడ ప్రత్యక్షమవుతారో.. ఏ గుంపు ఎటు నుంచి వస్తుందో తెలియకపోవడంతో పోలీసులు అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన మిలియన్‌ మార్చ్‌ ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రే నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ పాతబస్తీలో మకాం వేశారు. పురానీ హవేలీలో ఉన్నతాధికారులతో సమావేశమై రాత్రి మొత్తం నగర వ్యాప్తంగా గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. అంతకుముందు కమిషనర్‌ కార్యాలయం నుంచి శాంతి భద్రతలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. 

అయోధ్య తీర్పు కూడా నేడే..
దశాబ్దాలుగా సాగుతున్న అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడయ్యే క్షణం కూడా నేడే కావడంతో నగరంలోని సున్నిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులు, పారామిలటరీ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా జనం గుమికూడకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. మరోవైపు గురునానక్‌ జయంతి ఉత్సవాల్లో భాగంగా ర్యాలీలు జరుగనున్నాయి. ఇంకోవైపు మిలాద్‌ ఉన్‌ నబీ నేపథ్యంలో ఆదివారం కూడా పాతబస్తీ రద్దీగా మారనుంది. గత నెల రోజులుగా ఆందోళనలు, ధర్నాల కట్టడిలో అలసిపోయిన పోలీసు సిబ్బందికి విశ్రాంతితో పాటు సెలవులు సైతం లేవు. శనివారం కూడా వారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. కాగా, మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 20 వేల మంది బలగాలను మోహరించారు. ఘర్షణలకు అవకాశమున్న ప్రాంతాలకు ఆక్టోపస్‌ కమెండోలు, వాటర్‌ క్యాన్లు, వజ్ర వాహనాలను పంపించారు. సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే సందేశాలు పోస్ట్‌ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా