2020 ‘జీరో’తో వెల్‌కమ్‌!

31 Dec, 2019 12:19 IST|Sakshi

నూతన సంవత్సర వేడుకలకు నగరం ముస్తాబు

జీరో ఇన్సిడెంట్‌ నైట్‌గా చేసేందుకు పోలీసుల కసరత్తు

బేగంపేట మినహా ఫ్లైఓవర్ల మూసివేత

విస్తృతంగా తనిఖీలు.. ట్రాఫిక్‌ ఆంక్షలు.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు..

తెల్లవారుజాము వరకు మెట్రో, ఎంఎంటీఎస్‌ సేవలు

రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతి

సాక్షి, సిటీబ్యూరో: కొత్త సంవత్సరాన్ని జీరో ఇన్సిడెంట్‌ నైట్‌గా చేయడానికి పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది. దీనికోసం పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలకుతావు లేకుండా సిటీలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్న అధికారులు..బేగంపేట మినహా మిగిలిన ఫ్లైఓవర్లు మూసేస్తున్నారు. నగర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించడానికి 150 బృందాలను రంగంలోకి దింపుతున్నారు. సాధారణ తనిఖీలకు 50, డ్రంక్‌ డ్రైవింగ్‌పై మరో 100 బృందాలు పని చేయనున్నాయి. ఈవెంట్స్, హోటల్స్‌ తదితరాల నిర్వాహకులతో పాటు జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు నగరాన్ని ముస్తాబు చేస్తున్నాయి. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైల్, 1.30 గంటల వరకు ఎంఎంటీఎస్‌ రైళ్లు సేవలు అందించనున్నాయి. డిసెంబర్‌ 31 నేపథ్యంలో మద్యం తాగిన వారినీ మెట్రో రైల్‌లోకి అనుమతించనున్నారు. వీరి వల్ల ఇబ్బందులు రాకుండా ఉండడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మద్యం విక్రయాలకు ఒక గంటల అదనంగా సమయం ఇస్తూ అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతిస్తున్నారు. యువకుల అత్యుత్సాహం నేపథ్యంలో పలు వేడుకలు సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తుంటాయి. మాదకద్రవ్యాల విక్రయం, వినియోగం సైతం ఇక్కడే ఎక్కువగా సాగుతుంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు మంగళవారం నాటి న్యూ ఇయర్‌ వేడుకలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించాలని నిర్ణయించారు. వివిధ సందర్భాలు, సమయాల్లో సిటీలోని పబ్స్‌ కపుల్‌ ఎంట్రీలను మాత్రమే అనుమతిస్తుంటాయి. జంటగా వచ్చేవారు మినహా మిగతా వారిని పబ్స్‌లోకి ఎంట్రీ ఇవ్వవు.

దీనిపై పలు సందర్భాల్లో కొందరు యువకులు గుంపులుగా వచ్చి పబ్స్‌ వద్ద హల్‌చల్‌ చేస్తుంటారు. స్టాగ్‌ గ్యాంగ్స్‌గా పిలిచే వీరు గతంలో చేసిన హంగామాలను బట్టి పోలీసులు ఓ బ్లాక్‌లిస్ట్‌ తయారు చేశారు. ఇలాంటి వారి కదలికలు, వ్యవహారాలపై డేగకన్ను వేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు కానున్నాయి. జోష్‌లో భాగంగా విచ్చలవిడిగా హారన్లు మోగిస్తూ భయభ్రాంతులకు గురిచేసే హాంకింగ్‌ గ్యాంగ్స్‌తో పాటు కార్ల టాప్స్, బాయినెట్స్‌పై కూర్చుని హంగామా చేస్తూ ప్రయాణించే వారిపైనా కఠిన చర్యలు తీసుకోనున్నారు. న్యూ ఇయర్‌ పార్టీల నేపథ్యంలో డ్రగ్స్‌ విక్రయం, వినియోగం పెరిగే అవకాశం ఉందని వెస్ట్‌జోన్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. సిటీలో చిక్కిన డ్రగ్స్‌ విక్రేతలు, వినియోగదారుల్లో ఈ జోన్‌లో పట్టుబడిన వారే ఎక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు గతంలో మాదకద్రవ్యాలు విక్రయిస్తూ (పెడ్లర్స్‌) అరెస్టై, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న వారిని కట్టడి చేయాలని నిర్ణయించారు. వీరందరినీ ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ద్వారా చెక్‌ చెప్పేందుకు స్పెషల్‌ టీమ్స్‌ రంగంలోకి దింపనున్నారు. మరోపక్క గతంలో చిక్కిన డ్రగ్స్‌ ముఠాలు వెల్లడించిన వివరాలు, పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం కొన్ని పబ్స్‌లోని డీజేలు కూడా పెడ్లర్స్‌గా మారి వ్యవహారాలు సాగిస్తున్నట్లు అనుమానాలున్నాయి. వీరిపై నిఘా వేయడానికి మఫ్టీ బృందాలు విధుల్లో ఉంటాయి.

వీటితో పాటు శాంతి భద్రతల సమస్యలు రాకుండా చూసేందుకు క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌ (క్యూఆర్టీ), ఈవ్‌టీజింగ్‌ కంట్రోలింగ్‌కు ప్రత్యేక బృందాలు మోహరిస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము వరకు ఈ బృందాలన్నీ పని చేస్తుంటాయి. పశ్చిమ మండలంతో పాటు నగర వ్యాప్తంగా అవసరమైన అన్ని ప్రాంతాల్లోనూ ఈ తరహా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా కార్యక్రమాలు, వెన్యూల వద్ద ఉండే బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహుతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. నిబంధనల పర్యవేక్షణ, నిఘా కోసం 50 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేయడం, వాటిని చిత్రీకరించడంతో పాటు ఆడియో మిషన్ల సాయంతో శబ్ధ తీవ్రతనూ కొలుస్తారు. మంగళవారం సాయంత్రం నుంచే డ్రంక్‌ డ్రైవింగ్‌ తనిఖీలు ప్రారంభించనున్నారు. బుధవారం ఉదయం వరకు కొనసాగించాలని నిర్ణయించారు. పోలీసులు నెక్లెస్‌రోడ్, కేబీఆర్‌ పార్క్‌రోడ్, బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.1, 2, 45, 36లతో పాటు జూబ్లీహిల్స్‌ రోడ్‌నెం. 10, సికింద్రాబాద్, మెహదీపట్నం, గండిపేట దారుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రేసులు, డ్రంకన్‌ డ్రైవింగ్‌ పైనా కన్నేస్తారు.

‘సాగర్‌’ చుట్టూ నో ఎంట్రీ..
కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసులు కొన్ని చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షల్ని విధించారు. ప్రత్యామ్నాయం లేని బేగంపేట ఫ్లైఓవర్‌ మినహా మిగిలిన అన్నింటిని మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు మూసేస్తున్నారు. u ట్యాంక్‌ బండ్‌ పైన భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు విధించారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము 2 గంటల వరకు ఎన్టీఆర్‌ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. 

ట్రాఫిక్‌ మళ్లింపులు ఇలా...
వీవీ స్టాట్యూ నుంచి నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్, రా>జభవన్‌ మీదుగా మళ్లిస్తారు. u బీఆర్‌కే భవన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వచ్చే ట్రాఫిక్‌ని ఇక్బాల్‌ మీనార్, లక్డీకపూల్, అయోధ్య జంక్షన్‌ వైపు పంపుతారు. u లిబర్టీ జంక్షన్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ని జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి బీఆర్‌కే భవన్, తెలుగుతల్లి, ఇక్బాల్‌ మీనార్, రవీంద్రభారతి, లక్డీకపూల్, అయోధ మీదుగా మళ్లిస్తారు.
ఖైరతాబాద్‌ మార్కెట్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వచ్చే వాహనాలను మీరా టాకీస్‌ లైన్‌ మీదుగా పంపుతారు.
నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనాలను సంజీవయ్య పార్క్, నెక్లెస్‌రోడ్‌ పైకి పంపరు. వీటిని కర్బాలా మైదాన్, మినిస్టర్స్‌ రోడ్‌ మీదుగా పంపిస్తారు. u సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సెయిలింగ్‌ క్లబ్‌ నుంచి కవాడిగూడ చౌరస్తా, లోయర్‌ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ వైపు మళ్లిస్తారు. 

>
మరిన్ని వార్తలు