ఇదీ రాజ్‌భవన్‌ పాఠశాల పరిస్థితి

13 Jul, 2018 13:17 IST|Sakshi

అది అత్యాధునిక పాఠశాల... అడ్మిషన్ల కోసం పోటీపడి మరీ 1,300 మంది విద్యార్థులు చేరారు. కానీ తీరా చూస్తే... ఆరుగురు టీచర్లే అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదీ రాజ్‌భవన్‌ ప్రభుత్వ పాఠశాల పరిస్థితి. స్వయంగా గవర్నర్‌ నరసింహన్‌ పర్యవేక్షణలో కొనసాగుతున్నపాఠశాలలోనే ఇలాంటి దుస్థితి తలెత్తడం శోచనీయం. అయితే గవర్నర్‌ సహా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పాఠశాల కొనసాగుతుండడంతో ఇక్కడికి రావడానికి ఉపాధ్యాయులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.  

సాక్షి, హైదరాబాద్‌ ‌: రాజ్‌భవన్‌ ప్రభుత్వ పాఠశాల.. ప్రత్యేకంగా గవర్నర్‌ నరసింహన్‌ పర్యవేక్షణ.. డిజిటల్‌ క్లాస్‌ రూంలు.. అత్యాధునిక సౌకర్యాలతో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనం.. ఇన్ని ప్రత్యేకతలున్న పాఠశాల అంటే ఏ విద్యార్థికైనా ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఈ విద్యా సంవత్సరం రాజ్‌భవన్‌ ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు క్యూ కట్టారు. దీంతో పరిమితికి మించి ప్రవేశాలు జరిగాయి. ఏకంగా ఉన్నత పాఠశాలలో 650 మంది, ప్రాథమిక పాఠశాలలో 650 మంది విద్యార్థులు చేరారు. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది కానీ.. ఉపాధ్యాయుల సంఖ్య దగ్గరకు వచ్చేసరికి మాత్రం డొల్లతనం బయటపడింది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో ఈ పాఠ«శాల నుంచి 12 మంది బదిలీ అయ్యారు. వీరి స్థానంలో కేవలం ఇద్దరు టీచర్లు మాత్రమే వచ్చారు. రాజ్‌భవన్‌ స్కూలుకు రావడానికి చాలా మంది టీచర్లు మొగ్గు చూపించలేదు. ఇక్కడ నిరంతరం గవర్నర్‌ పర్యవేక్షణ, విద్యాశాఖ అధికారుల ప్రమేయం అధికంగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇకపోతే ఉన్నత పాఠశాల రెగ్యులర్‌ హెచ్‌ఎం కూడా లేకపోవడంతో డిప్యూటీ డీఈఓ శామ్యూల్‌రాజును ఇన్‌చార్జిగా నియమించారు. నిబంధనల ప్రకారం.. ఈ స్కూల్‌ గ్రేడ్‌– 1 హెచ్‌ఎం ఉండాలి. 15 ఏళ్లుగా గ్రేడ్‌– 1 హెచ్‌ఎం పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఇన్‌చార్జిలతోనే సరిపెడుతున్నారు.  

ప్రాథమిక పాఠశాలలో నో టీచర్స్‌.. 
రాజ్‌భవన్‌ ప్రాథమిక పాఠశాలలో ఒక్క టీచర్‌ కూడా లేరంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడున్న ప్రధానోపాధ్యాయురాలు మంజులత ఇన్‌చార్జి కావడం గమనార్హం. కనీసం విద్యావలంటీర్లతోనైనా చదువులు నెట్టుకొద్దామంటే ఒక్కరు కూడా లేకపోవడం విద్యార్థుల భవిష్యత్‌ పట్ల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.  
 

మరిన్ని వార్తలు