ధర అదిరే

22 Jan, 2020 01:22 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల ధరల వృద్ధిలో 14వ స్థానం

క్యూ3లో 9% ధరల పెరుగుదల

ఇండియా నుంచి టాప్‌–20లో చోటు దక్కించుకున్న ఏకైక నగరం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల ధరల వృద్ధిలో హైదరాబాద్‌ 14వ స్థానంలో నిలిచింది. మన దేశం నుంచి టాప్‌–20లో చోటు దక్కించుకున్న ఏకైక నగరం భాగ్యనగరమే. గతేడాది జూలై –సెప్టెంబర్‌ (క్యూ3) మధ్య కాలంలో హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 9% వృద్ధి చెందాయని గ్లోబల్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ నైట్‌ఫ్రాంక్‌ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో సర్వే నిర్వహించగా..హంగేరీలోని బుడాపెస్ట్‌ తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ ధరల వృద్ధి 24%గా ఉంది. ఆ తర్వాత చైనాలోని జియాన్, యూహాన్‌ నగరాలున్నాయి. ఈ ప్రాంతాల్లో వరుసగా 15.9%, 14.9% ధరల వృద్ధి ఉంది.

ఇండియాలో ఏకైక నగరం హైదరాబాదే
టాప్‌–20లో చోటు దక్కించుకున్న ఏకైక నగరం మనదే. జూలై – సెప్టెంబర్‌ మధ్య కాలంలో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌ నగరాల్లో ధరలు వృద్ధిలో ఉంటే..మిగిలిన అన్ని మెట్రో నగరాల్లో గృహాల ధరలు క్షీణించాయి. ధరల వృద్ధిలో హైదరాబాద్‌ తర్వాత 73వ స్థానంలో ఢిల్లీ నిలిచింది.

ఇక్కడ 3.2 % ధరల వృద్ధి ఉంది. 2% రేట్ల అప్రిసియేషన్‌తో బెంగళూరు 94వ స్థానంలో, 1.1% వృద్ధితో అహ్మదాబాద్‌ 108వ స్థానంలో నిలిచింది. 2% క్షీణతతో కోల్‌కతా 130వ స్థానంలో, 3% క్షీణతతో 135వ స్థానంలో ముంబై, 3% క్షీణతతో 136వ స్థానంలో చెన్నై, 3.5% క్షీణతతో 138వ స్థానంలో పుణే నగరాలు నిలిచాయి.

హైదరాబాద్‌లోనే వృద్ధి ఎందుకంటే?
ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో సగటున 3.2% ధరలు పెరిగాయి. 2015 రెండో త్రైమాసికం నుంచి ఇదే అత్యంత బలహీనం. ఇండియాలోని నగరాల్లో గృహాల ధరల వృద్ధి అనేది రిటైల్‌ ద్రవ్యోల్బణం కన్నా దిగువలోనే ఉంది. ఈ అంతరం 2016 హెచ్‌1 నుంచి పెరుగుతూనే ఉంది.

ఒక్క హైదరాబాద్‌లో మాత్రం రిటైల్‌ ద్రవ్యోల్బణం స్థాయిని మించి గృహాల ధరల వృద్ధి ఉందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశీర్‌ బైజాల్‌ తెలిపారు. పైగా ఇక్కడ కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు తగ్గిపోవటంతో కొనుగోలుదారులు గృహ ప్రవేశానికి సిద్ధం గా ఉన్న ఇళ్లను, ఇన్వెంటరీ గృహాలను కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపించారు. ఇదే డెవలపర్లకు లాభసాటిగా మారిందని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు