ప్రైవేట్‌ రోడ్స్‌ @ 600కి.మీ

27 Sep, 2019 11:15 IST|Sakshi

ప్రైవేట్‌ సంస్థలకు రహదారుల నిర్వహణ  

జోన్ల వారీగా ఐదేళ్ల కాంట్రాక్టు  

అంచనా వ్యయం రూ.1,500 కోట్లు  

ప్రతిపాదనలు రూపొందించిన ఇంజినీర్ల కమిటీ  

తర్వలో పాలసీ రూపకల్పన, టెండర్లు  

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో రోడ్ల నిర్వహణను ప్రైవేట్‌ సంస్థలకు కాంట్రాక్టుకు ఇవ్వాలన్న మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై ఉన్నతస్థాయి ఇంజినీర్లతో ఏర్పాటైన కమిటీ పలు దఫాలు సమావేశమై ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని స్టాండింగ్‌ కమిటీ ఆమోదించడంతో ప్రభుత్వానికి  పంపించనున్నారు. అనుమతి రాగానే కమిటీ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని తగిన పాలసీ రూపొందించనున్నారు. జీహెచ్‌ఎంసీ జోన్ల వారీగా ప్రధాన రహదారుల్లోని బీటీ రోడ్లను కాంట్రాక్టుకు ఇస్తారు. ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీ ప్రయాణానికి అనువుగా ఉండేలా కాంట్రాక్టు ఏజెన్సీ రోడ్ల నిర్వహణ చేయాల్సి ఉంటుంది. అందుకోసం అవసరమైన అన్ని వనరులు కలిగిన భారీ సంస్థలకే కాంట్రాక్టు ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అన్ని జోన్లలో కనీసం 600 కిలోమీటర్ల మేర రహదారులు ప్రైవేట్‌కు ఇవ్వదగినవి ఉన్నట్లు గుర్తించారు. వీటి కాంట్రాక్టుకు ఏటా దాదాపు రూ.300 కోట్లు ఖర్చవుతుందని అంచనా. వెరసి ఐదేళ్ల కాలానికి రూ.1,500 కోట్లు చెల్లించాలి. రోడ్ల నిర్వహణ బాగుందని ధ్రువీకరించేందుకు థర్డ్‌పార్టీని నియమించి, అది ఇచ్చే నివేదికల మేరకు నెలవారీగా చెల్లింపులు చేస్తారు. 

కమిటీ ప్రతిపాదనలు ఇవీ...  
వార్షిక నిర్వహణ ఒప్పందం (ఏఎంసీ)గా వ్యవహరించే ఈ కాంట్రాక్టును పొందే ఏజెన్సీ రోడ్ల రొటీన్‌ నిర్వహణతో పాటు తమ పరిధిలోని మార్గాల్లో ఉండే ఫ్లైఓవర్లు, బ్రిడ్జీలు, స్పెషల్‌ లింక్‌రోడ్లు తదితర చేపట్టాలి.  
అత్యవసర సమయాల్లో అవసరమైన పనులు  చేయాలి.
వర్షాకాలంలో (జూన్‌–సెప్టెంబర్‌) మినహా మిగతా సమయంలో రీకార్పెటింగ్‌ (మిల్లింగ్, టాక్‌కోట్స్, డీజీబీఎం, బీసీలతో) పనులు చేయాల్సి ఉంటుంది. ఏటా కనీసం 20శాతం చొప్పున మొదటి మూడేళ్లు చేయాలి. ఐదేళ్ల గడువులోగా రీకార్పెటింగ్‌ పూర్తి చేయాలి.  
వర్షాకాలానికి ముందుగానే అవసరమైన మరమ్మతులు చేయాలి. గుంతలను పూడ్చి, మరమ్మతులు చేపట్టాలి.  
వర్షాకాలంలో రోడ్లపై నీటి నిల్వలు లేకుండా చేయాలి. క్యాచ్‌పిట్లు, డ్రెయిన్లు, నాలాలు, సీవరేజీ లైన్లను క్లీన్‌ చేయాలి. నిల్వ నీటిని తొలగించేందుకు పంపింగ్‌తో సహా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. రోడ్లపై డెబ్రిస్‌ లేకుండా చూడాలి.  
ఆయా అవసరాల కోసం వివిధ సంస్థలు రోడ్లను తవ్వాల్సి వస్తే రోడ్‌ కటింగ్‌ అనుమతులిచ్చే అధికారం కూడా కాంట్రాక్టు సంస్థకే ఉంటుంది. వర్షాకాలంలో కాకుండా మిగతా సమయంలో రెండు నెలలు మాత్రమే ఈ అనుమతులివ్వాలి. అందుకు చార్జీలు వసూలు చేసి, తిరిగి పూడ్చివేయాలి.  
రోడ్ల నిర్వహణతో పాటు లేన్‌ మార్కింగ్‌లు, స్పీడ్‌బ్రేకర్లు, టేబుల్‌ డ్రెయిన్లు, ఫుట్‌పాత్‌లు, సైనేజీలు, పెయింటింగ్‌ తదితర పనులు కూడా నిర్వహించాలి. ఏడాదిలోపు ఈ పనుల్ని పూర్తిచేయాలి. నీటి నిల్వ ప్రాంతాలు, బ్లాక్‌స్పాట్స్‌ సమస్యలు పరిష్కరించాలి.  
దెబ్బతిన్న మ్యాన్‌హోళ్లు, క్యాచ్‌పిట్ల మూతల్ని 24 గంటల్లోగా మార్చాలి.   
పనుల్ని పర్యవేక్షించేందుకు కార్యాలయం, కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేసుకొని ప్రజల నుంచి అందే ఫిర్యాదుల్ని నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలి.  
పనులను ఎప్పటికప్పుడు వీడియో తీసి బిల్లుల చెల్లింపుల కోసం థర్డ్‌పార్టీ ఏజెన్సీకి అందజేయాలి.  
రోడ్డును వెడల్పు చేయడం తదితర పనులు అవసరమైతే జీహెచ్‌ంఎసీ సూచన మేరకు చేయాలి. ఎస్సార్‌డీపీ పనులు జరుగుతున్న ప్రాంతాల్లోనూ నిర్వహణ చేపట్టాలి. ఈ పనులకు అదనపు చెల్లింపులు చేస్తారు. 

మరిన్ని వార్తలు