ఆర్టీఏ.. అదంతే!

19 Jul, 2019 10:37 IST|Sakshi

సేవలు పెండింగ్‌.. ఫిర్యాదులు ఫుల్‌

అపరిష్కృతంగా 2.15 లక్షలు   

డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్సీలపైనే ఎక్కువ  

జిల్లాల పునర్విభజనతో స్తంభించిన సేవలు  

సమన్వయలేమి, కార్డుల కొరతే కారణం

‘హలో సార్‌.. నాలుగు నెలల క్రితం డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం నిర్వహించిన పరీక్షలో పాస్‌ అయ్యాను. వారం రోజుల్లో లైసెన్స్‌ నేరుగా ఇంటికే వస్తుందన్నారు. ఇప్పటి వరకు రాలేదు’ ఇదో వాహనదారుడి ఆందోళన.  ‘కొత్త బండి రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఆరు నెలలైంది.ఇంకా ఆర్సీ రాలేదు. ట్రాఫిక్‌ పోలీసులుఇబ్బందులకుగురిచేస్తున్నారు’ మరో వాహనదారుడి ఆవేదన.  ‘వాహనం అడ్రస్‌ మార్పు కోసం అధికారులనుసంప్రదిస్తే సరైన స్పందన లేదు. పట్టించుకునేవాళ్లే లేరంటూ’ నగర శివార్లలోని ఒక ఆర్టీఏకార్యాలయంలో ఎదురైన పరిస్థితిపైఓ మహిళ విస్మయం.  

సాక్షి, సిటీబ్యూరో: ఇలా ఒక్కరో, ఇద్దరో కాదు. లక్షలాది మంది వాహనదారులు ఆర్టీఏ పౌరసేవల్లో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రూ.వేలల్లో ఫీజులు చెల్లించి, నిబంధనల మేరకు అన్ని డాక్యుమెంట్లను అందజేసినప్పటికీ డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీలు తదితర పౌరసేవలు లభించక  నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాదిలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2.15 లక్షల ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోకుండా పెం డింగ్‌ జాబితాలో ఉన్నట్లు అంచనా. ఒకట్రెండు ఆర్టీఏ కార్యాలయాల్లో సత్వరమే పరిష్కారం లభిస్తున్నప్పటికీ చాలాచోట్ల అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. ఆర్టీఏ పౌరసేవలపైన నిర్దిష్టమైన కాలపరిమితిని విధించారు. అంతర్రాష్ట్ర బదిలీలపైన మాత్రమే 30 రోజుల గడువు విధించారు. మిగతా అన్ని రకాల పౌరసేవలు... ముఖ్యం గా డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలు, అడ్రస్‌ మార్పులు తదితర వారం, పది రోజుల్లో లభించే విధంగా సిటిజన్‌ చార్టర్‌ను రూపొందించారు. కానీ అది  ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. వారంరోజుల కాలపరిమితి 6 నెలల వరకు కొనసాగడం గమనార్హం. 

ఎందుకిలా.?  
రవాణాశాఖ పౌరసేవలపై వినియోగదారుల నుంచి అందే ఫిర్యాదులను పరిష్కరించేందుకు సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సహకారంతో  పటిష్టమైన ఆన్‌లైన్‌ గ్రీవెన్సెస్‌ రిడ్రెసల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ (ఓజీఆర్‌టీఎస్‌) ఏర్పాటు చేశారు. వాహన వినియోగదారులు ఆర్టీఏ వెబ్‌సైట్‌లోని ‘సిటిజన్‌ చార్టర్‌ కంప్లయింట్స్‌’ను ఎంపిక చేసుకొని తమ ఫిర్యాదును తెలియజేయవచ్చు. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారా స్వీకరించేందుకు ‘1100’, ఇతర ఫోన్‌ల నుంచి స్వీకరించేందుకు ‘18004251110’ అనే రెండు టోల్‌ఫ్రీ నంబర్లను కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. జిల్లాల విభజన వరకు ఈ వ్యవస్థలు సక్రమంగానే పని చేశాయి. వినియోగదారుల నుంచి అందే ఫిర్యాదుల్లో చాలా వరకు అప్పటికప్పుడు పరిష్కరించడమో లేదా ఎప్పటిలోగా తమ సమస్యను పరిష్కరిస్తారో తెలియజేసేవారు. కానీ 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి, పైస్థాయి ఉన్నతాధికారులకు మధ్య సమన్వయం కొరవడింది. అన్ని చోట్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నప్పటికీ వాటికి ప్రాంతీయ రవాణా అధికారులు, యూనిట్‌ మోటారు వాహన ఇన్‌స్పెక్టర్ల స్థాయిలో పరిష్కారాన్ని సాధించడంలో  ఓజీఆర్‌ఆటీఎస్‌ వ్యవస్థ విఫలమైంది. దీంతో ఫిర్యాదులు పెద్ద ఎత్తున పెండింగ్‌ జాబితాలో చేరిపోయాయి. మరోవైపు తమకు సకాలంలో సరైన పరిష్కారం లభించకపోవడంతో వినియోగదారులు పదే పదే ఫిర్యాదులు చేయడం కూడా మరో కారణం. 

ఇదే అసలు సమస్య..   
వినియోగదారుల సమస్యల పరిష్కారంలో కిందిస్థాయి నుంచి పైవరకు సమన్వయ లేమితో పాటు ఇటీవల కాలంలో డ్రైవింగ్‌ లైసెన్సులు, రిజిస్ట్రేషన్‌ కార్డులు (ఆర్సీలు) ముద్రించేందుకు అవసరమైన కార్డులు, రిబ్బన్‌ల కొరత మరో ప్రధానమైన సమస్యగా మారింది. రవాణాశాఖకు స్టేషనరీ అందజేసే ప్రైవేట్‌ సంస్థలకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో సుమారు రూ.7 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో సదరు సంస్థలు కార్డులు, రిబ్బన్‌ల పంపిణీకి చేతులెత్తేయడంతో వినియోగదారులకు సకాలంలో అందజేయలేకపోయారు. కేవలం వారం రోజుల్లో అందాల్సిన డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీల కోసం 4 నెలల నుంచి 6 నెలలకు పైగా ఎదురుచూస్తున్న వినియోగదారులు కూడా ఉన్నారు.  

మంత్రి సమీక్షతో కదలిక..  
ఇటీవల రవాణాశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్డుల పంపిణీ స్తంభించిపోవడం, స్టేషనరీ కొరత, ప్రింటర్లు, స్కానర్లు లేకపోవడం, పనిచేయని కంప్యూటర్లు తదితర అంశాలను పరిశీలించారు. వాహనదారుల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే విధంగా ఓజీఆర్‌టీఎస్‌ వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు. మరోవైపు తేలిగ్గా ఫిర్యాదు చేసేందుకు ఒక వాట్సప్‌ నంబర్‌ను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ‘కొద్ది రోజుల క్రితమే కొత్త ప్రింటర్లు, స్కానర్లు, స్టేషనరీ వచ్చాయి. త్వరలోనే వాహనదారుల సమస్యలన్నింటినీ పరిష్కస్తాం’ అని ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  

మరిన్ని వార్తలు