నర్సరీ, ఎల్‌కేజీ టాపర్లంటూ ఫ్లెక్సీ..

2 Oct, 2019 15:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాధారణంగా ఏ టెన్త్‌క్లాస్‌కో, ఇంటర్‌కో.. స్టేట్‌ ఫస్ట్‌ అంటూ బ్యానర్లు వేస్తూ ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఊదరగొడుతుంటాయి. పబ్లిసిటీ కోసం భారీ కటౌట్లు, బ్యానర్లతో హంగామ చేస్తుంటాయి. కానీ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యం మాత్రం నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలో టాపర్లు అంటూ భారీ ఫ్లెక్సీ వేయించి విమర్శలపాలైంది. 

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని ప్రియా భారతి హైస్కూల్‌.. తమ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల ర్యాంకులు, గ్రేడింగ్‌లతో ఓ భారీ కటౌట్ ఏర్పాటు చేయించింది. తమ టాపర్లు వీరే అంటూ ఘనంగా చెప్పుకుంది. ఆ స్కూల్‌కు తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు కూడా ఉన్నట్లులో ఫ్లెక్సీలో పేర్కొంది. నర్సరీ నుంచి ఫస్ట్‌ క్లాస్‌ వరకు 44 మంది ప్రతిభ గల విద్యార్థుల ఫొటోలు ఫ్లెక్సీలో ఉన్నాయి. ప్రస్తుతం ఆ కటౌట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు​ కొడుతోంది. కాగా నర్సరీ పిల్లలకు కూడా ర్యాంకులు కేటాయించడం పట్ల విద్యావేత్తలు మండిపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నర్సరీ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను బోధిస్తారని విద్యావేత్తలు గుర్తుచేస్తున్నారు. చిన్న పిల్లలను పోటీ ప్రపంచంలోకి నెట్టడం విచారకరమని పలువురు నెటిజన్లు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘పిల్లలు పాలు తాగడంలో ఫస్టా..’ అంటూ క్రిష్‌ యాదు అనే నెటిజన్‌ విద్యాసంస్థలపై వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. 

ఆడుతూ పాడుతూ సరదాగా గడపాల్సిన వయస్సులో విద్యార్థులకు ఇలాంటి కష్టాలు రావడం విచారకరమని, విద్యాసంస్థలను నియంత్రించే వ్యవస్థ అవసరమని సునీష అనే మహిళ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. మన ప్రాథమిక విద్యావ్యవస్థ పూర్తిగా లోపభూయిష్టమని ఫ్రాన్స్‌లోని భారత మాజీ రాయబారి డాక్టర్‌ మోహన్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు ఈ రకమైన స్కూళ్లను నిషేదించాలని, పిల్లల్లో ఒత్తిడి పెంచడం తీవ్ర ఆక్షేపణీయమని దీరజ్‌ సింగ్లా అనే నెటిజన్‌ ఘాటుగా ట్వీట్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా