ఈ వైరస్‌కు మూలం వుహాన్‌ కాదు: సీసీఎంబీ

4 Jun, 2020 12:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌: దేశంలోకెల్లా ప్రసిద్ధి గాంచిన రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పలువురు శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌కు సంబంధించి కొన్ని దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు. ఇందుకు సంబంధించిన నివేదిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైంది. దీని ప్రకారం వుహాన్‌లో గుర్తించిన కరోనా వైరస్ జాతి పూర్వ వైరస్‌ ఒకటి  2019 డిసెంబర్ 11 నుంచి భారతదేశంలో వ్యాప్తిలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ‘ఎమ్‌ఆర్‌సీఏ’(మోస్ట్‌ రిసెంట్‌ కామన్‌ అన్సెస్టర్‌‌) అనే శాస్త్రీయ పద్దతి ద్వారా ప్రస్తుతం తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ నవంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ 25 మధ్య కాలంలో ఉద్భవించిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ రెండు తేదీల మధ్యస్థ సగటు సగటు డిసెంబర్‌ 11 కాబట్టి అప్పటినుంచే ఇది వ్యాప్తిలో ఉన్నట్టుగా పరిశోధకులు చెబుతున్నారు. అయితే జనవరి 30కి ముందే చైనా నుంచి వచ్చిన ప్రయాణికులు ఈ వైరస్‌ను తీసుకువచ్చారా, లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఎందుకంటే ఆ సమయంలో భారతదేశంలో సామూహిక పరీక్షలు ఎక్కువ జరగలేదు కాబట్టి ఈ అంశంలో స్పష్టత లేదంటున్నారు శాస్త్రవేత్తలు.

హైదరాబాద్‌లోని సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌కు చెందిన అనేక జాతుల ‘మోస్ట్‌ రిసెంట్‌ కామన్‌ అన్సెస్టర్‌’ వయస్సును లెక్కించారు. దీని ఆధారంగా ప్రస్తుతం ఉన్న వాటికి భిన్నమైన మరో కొత్త జాతిని గుర్తించారు. దీనికి క్లాడ్ ఐ/ ఏ3(I / A3) అని పేరు పెట్టినట్లు ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ వెల్లడించింది. భారతదేశంలో కేరళలో మొదటి కరోనా కేసును గుర్తించారు. ఈ వైరస్‌.. వుహాన్‌లో గుర్తించబడిన వైరస్‌ కుటుంబానికి చెందినది. అయితే, హైదరాబాద్‌లో గుర్తించిన వైరస్, వుహాన్‌ వైరస్‌కు భిన్నంగా ఉంది. క్లాడ్ ఐ/ ఏ3(I / A3)  వైరస్‌ మూలం వుహాన్‌ కాదని.. ఆగ్నేయాసియాలో ఎక్కడో ఉందని నిర్ధారించబడినట్లు నివేదిక తెలిపింది. ఈ వైరస్ కచ్చితంగా ఏ దేశంలో ఉద్భవించింది అనే విషయం ఇంకా తెలియలేదని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కె మిశ్రా వెల్లడించారు. 

మోస్ట్‌ రిసెంట్‌ కామన్‌ అన్సెటర్‌ ప్రకారం ఈ కొత్త వైరస్‌ జాతి క్లాడ్ ఐ/ ఏ3 (I / A3) జనవరి 17, ఫిబ్రవరి 25 మధ్య కాలంలో వ్యాప్తి చెందడం ప్రారంభించిదని తెలిపింది. తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీలో ఈ కొత్త క్లాడ్ కేసులు గరిష్టంగా ఉన్నాయని రాకేశ్‌ మిశ్రా తెలిపారు. (నిమ్స్‌లో భయం భయం: వైద్య సిబ్బందికి కరోనా)

మరిన్ని వార్తలు