భళారే బాస్మతి

31 Jan, 2020 10:04 IST|Sakshi

బాస్మతి రైస్‌ హబ్‌గా సిటీ

నవాబుల కాలం నాటి ఈ బియ్యానికి మంచి ఆదరణ

రెస్టారెంట్లు, ఫంక్షన్‌ హాళ్లు, ఇళ్లల్లో విరివిగా వినియోగం

రోజుకు సగటున 12 వేల క్వింటాళ్లతో వంటకాలు

దేశంలో ఢిల్లీ తర్వాత నగరంలోనే ఎక్కువ వాడకం

సేమియా మాదిరిగా గుండ్రటి.. పొడవైన రూపం.. మంచి సువాసన బాస్మతి బియ్యం ప్రత్యేకత. అన్ని రకాల బిర్యానీల్లోనూ బాస్మతి రైస్‌దే కీలకపాత్ర. ఇలా అందరి మనసులు చూరగొంటున్న బాస్మతీ బియ్యం వినియోగంలో మన హైదరాబాద్‌ నగరం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ రోజుకు దాదాపు 12 వేల క్వింటాళ్ల బాస్మతి బియ్యం వినియోగిస్తున్నట్టు ఆల్‌ ఇండియా బాస్మతి రైస్‌ ఎక్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది.

సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు నవాబులు, ధనికుల ఇళ్లల్లో వడ్డించే బిర్మానీలో బాస్మతి బియ్యం వినియోగించే వారు. నాడు బిర్యానీకే పరిమితమైన బాస్మతి నేడు అన్ని రకాల వంటకాల్లో వినియోగిస్తున్నారు. ధనికుల ఇళ్లలో వినియోగంలో ఉన్న బాస్మతిని..నేడు సాధారణ ప్రజలు కూడా ఇళ్లల్లో,  ఫంక్షన్లలో ఎక్కువగా వాడుతున్నారు. దీంతో నగరంలో బాస్మతి బియ్యం వినియోగం ఎక్కువైంది. గతంలో బిర్యానీ కోసం బాస్మతిని తప్పక వాడేవారు. కానీ నేడు బగార రైస్, పల్వా, లెమన్‌ రైస్, కిచిడి, జీరా రైస్‌తో పాటు అన్ని రకాల బిర్యానీ సంబంధిత వంటకాల్లో వినియోగిస్తున్నారు. దీంతో జంటనగరాల మార్కెట్లకు బాస్మతి పండే ఉత్తరాది రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతి అవుతున్నట్లు నగర వ్యాపారులు తెలిపారు. ప్రధాన మార్కెట్లయిన బేగంబజార్, కిషన్‌గంజ్, ఉస్మాన్‌గంజ్‌ టోకు మార్కెట్లు ఈ బియ్యం అమ్మకాలకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. స్టార్‌ హోటళ్లు, ఇతర బిర్యానీ హోటళ్లన్నీ కూడా బాస్మతిని ఈ మార్కెట్ల నుంచే కొనుగోలుచేస్తుంటాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజుకు 60 వేల క్వింటాళ్ల సాధారణ బియ్యం వినియోగం అవుతుండగా ఇందులో బాస్మతి బియ్యం దాదాపు 12 వేల క్వింటాళ్ల వరకూ ఉంటుందని బేగంబజార్‌లోని కశ్మీర్‌ హౌస్‌ నిర్వాహకుడు రాజ్‌కుమార్‌ టాండన్‌ చెప్పారు. 

ఉత్తరాది నుంచి దిగుమతులు
ఉత్తరాదిలో పంజాబ్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఈసారి బాస్మతి ఉత్పత్తి భారీగా ఉంది. ఇక్కడి నుంచే నగరానికి సరఫరా పెరిగింది. అలాగే నాణ్యతను బట్టి ధరలు కూడా కొద్దిగా తగ్గడంతో ప్రస్తుతం అన్నివర్గాలకు అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. రిటైల్‌ మార్కెట్‌లో స్టీమ్‌ కేజీ బాస్మతి బియ్యం రూ.60 నుంచి రూ.90 వరకు లభిస్తున్నాయి. అదే రా బాస్మతి బియ్యం మొదటి రకం రూ.110– 125 వరకు ధర పలుకుతుంది. ఢిల్లీ, తెలంగాణలో మినహా ఇతర రాష్ట్రాల్లో దీని వినియోగం తక్కువ. దక్షిణాది రాష్ట్రాలకు హైదరాబాద్‌ నగరం బాస్మతి హబ్‌గా మారింది. దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాలకు హైదరాబాద్‌ నుంచే బాస్మతి బియ్యం ఎగుమతి చేస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి నగరానికి బాస్మతి బియ్యాన్ని దిగుమతి చేసుకున్న వ్యాపారులు తిరిగి ఇక్కడి నుంచి ఇతర నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. 

రా బాస్మతి రైస్‌కు ఎక్కువ డిమాండ్‌
స్టీమ్‌ బాస్మతి బియ్యం ధర తక్కువగా ఉన్నా..వంట చేసిన తర్వాత బియ్యం సైజు అంతగా పెరగదు. బియ్యం గింజ పగలదు. అదే రా బాస్మతి రైస్‌ ధర ఎక్కువగా ఉంటుంది. ఇది వండిన తర్వాత బియ్యపు గింజ సైజ్‌ పెరుగుతుంది. దీంతో పాటు బియ్యంలో సువాసన వస్తుందని విజయ్‌జైత్ర కేటరింగ్‌ నిర్వాహకుడు పి.సత్యనారాయణ వాసు తెలిపారు. రా రైస్‌తో బిర్యానీ, బగారా, జీరా రైస్‌తో పాటు ఇతర వంటకాలు చేస్తే చాలా రుచిగా ఉంటాయని తెలిపారు.

మరిన్ని వార్తలు