హైదరాబాద్‌ షార్ట్‌ఫిల్మ్‌కు అంతర్జాతీయ అవార్డు 

23 Feb, 2020 09:06 IST|Sakshi
సునీల్‌ను అభినందిస్తున్న ఫిల్మ్‌ ఫెస్టివల్‌ చైర్‌పర్సన్‌ ఒల్గా జుబ్కొవా 

ఫిలింను నిరి్మంచిన మణికొండ పర్యావరణవేత్త 

అమెరికా న్యూయార్క్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శన 

చెరువు వేదనను మూగబాలికతో పంచుకునే ఇతివృత్తం

సాక్షి, మణికొండ: చెరువులు తమ ఆవేదనను ఓ మూగ బాలికతో పంచుకునే ఇతివృత్తంతో తీసిన షార్ట్‌ఫిల్‌్మకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. అమెరికాలోని న్యూయార్క్‌లో అక్కడి కాలమానం ప్రకారం గురువారం జరిగిన అంతర్జాతీయ లాంపా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో మొదటి బహుమతి దక్కించుకుంది. గత డిసెంబర్‌లో హైదరాబాద్‌ ఫోయనెక్స్‌ అరేనాలో జరిగిన జాతీయ షార్ట్‌ఫిల్మ్‌ విభాగంలోనూ మొదటి స్థానాన్ని దక్కించుకున్న వీడియో శనివారం అంతర్జాతీయ వేదికపైనా అదే స్థానాన్ని దక్కించుకుంది. ఓ చెరువు తన గోడును ఓ మూగ బాలికతో పంచుకోవటం ఇతివృత్తంగా మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్‌ పెద్ద చెరువు వద్ద ఈ వీడియోను చెరువు పరిరక్షణ కమిటీ సభ్యుడు సునీల్‌ సత్యవోలు నిరి్మంచగా అన్షుల్‌ దర్శకత్వం వహించారు.

రెండున్నర నిమిషాల నిడివి ఉన్న వీడియోలో ప్రస్తుతం పర్యావరణ, చెరువుల పరిరక్షణ, వాతావరణ సమతుల్యత వాస్తవాలను చెరువు ఓ పదేళ్ల మూగ బాలికకు చెప్పుకోవటం, ఆ బాలిక చెరువును ఊరడించటం అనే ఇతివృత్తంతో ‘సైలెంట్‌ వాయిస్‌’ అనే పేరుతో తీసినట్టు నిర్మాత తెలిపారు. మనుషులు తమ జీవనానికి ఉపయోగపడే చెరువులు, పర్యావరణం, వాతావరణ సమతుల్యతలను ఎలా దెబ్బ తీస్తున్నారనే అనే అంశం అందరి గుండెలకు హత్తుకునేలా ఉండటంతో అంతర్జాతీయ షార్ట్‌ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో నిర్వాహకులను కదలించిందని ఆయన పేర్కొన్నారు.

కమిషన్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ప్రతి ఏటా ఇలాంటి షార్ట్‌ఫిల్మ్‌ పోటీలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇతర షార్ట్‌ఫిల్‌్మల కన్నా అధికంగా 17 గోల్స్‌ సాధించటంతో తమ ఫిల్మ్‌కు ప్రథమ బహుమతి దక్కిందని ఆయన వివరించారు. అవార్డును లంప ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ చైర్‌పర్సన్‌ ఓల్గా జుబ్కొవా, యునైటెడ్‌ నేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్, సోషల్‌ అఫైర్స్‌ సెక్రటరీ జనరల్‌ లియూ జెన్‌మిన్, రష్యా మొదటి డిప్యూటీ శాశ్వత ప్రతినిధి డ్మిట్రై పోల్యానస్కై చేతుల మీదుగా అవార్డును అందుకున్నట్టు సునీల్‌ వివరించారు.

మరిన్ని వార్తలు