టెక్కీల ఏపీ బాట

2 Apr, 2019 10:28 IST|Sakshi

దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంటున్నా అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలపైనే ఉంది. ఈసారి ఏపీలో ఓటు హక్కు ఉన్నవారు ఎలాగైనా ఓటు వేసి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. హైదరాబాద్‌లో ఉన్న టెక్కీలు ఈసారి భారీ సంఖ్యలో ఏపీకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోనున్నారని ఐటీ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ వెల్లడించారు. తెలంగాణలో కూడా ఏప్రిల్‌ 11నే ఎన్నికలు కావడంతో సాధారణంగా సెలవు దినంగానే ప్రకటిస్తారు. అయితే ఈసారి ఐటీ సంస్థలన్నీ ఓటు వెయ్యడానికి వీలుగా హాఫ్‌ డే హాలిడేగా ప్రకటించింది. ఏపీ వెళ్లే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు మాత్రం మినహాయింపు ఇస్తామని, అయితే వారు లీవ్‌ అప్లయ్‌ చేయడానికి ముందు ఓటు వేసిన గుర్తుగా సిరా చుక్క ఉన్న వేలు చూపించాలని అన్నారు.

గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పట్టణ ఓటర్లలో బద్ధకాన్ని వదిలించడానికి ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు నివసించే ప్రాంతాలైన రాజేంద్రనగర్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో ఓటింగ్‌ శాతం కూడా పెరిగింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కూడా టెక్కీలందరూ పాల్గొనేలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని రంజన్‌ చెప్పారు. ఏపీలో గురువారం పోలింగ్‌ జరగనుండటంతో టెక్కీలకు శుక్రవారం కూడా సెలవు ఇస్తే, వీకెండ్‌ కలిసివచ్చి నాలుగు రోజులు కుటుంబసభ్యులతో గడిపి వస్తారని అంటున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికలపైనే ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ ఆసక్తి ఉందని కిరణ్‌చంద్ర అనే ఐటీ ఉద్యోగి వెల్లడించారు. 

మరిన్ని వార్తలు