ఎంసెట్‌లో గ్రేటర్‌

10 Jun, 2019 08:59 IST|Sakshi

టాప్‌ 10లో మన విద్యార్థులు  

ఇంజినీరింగ్‌లో ఏడుగురు  

అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీలో ఇద్దరు  

సాక్షి సిటీబ్యూరో: ఎంసెట్‌లో గ్రేటర్‌ విద్యార్థులు మెరిశారు. టాప్‌ 10లో నిలిచి సత్తా చాటారు. ఇంజినీరింగ్‌ విభాగంలో ఏడుగురు, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగంలో ఇద్దరు విద్యార్థులు ఈ ఘనత సాధించారు. ఇంజినీరింగ్‌లో దేవరకొండ చంద్రశేఖర్‌ రాష్ట్రస్థాయి రెండో ర్యాంక్‌ సాధించగా.. జిల్లెల ఆకాశ్‌రెడ్డి మూడో ర్యాంక్, భట్టేపాటి కార్తీకేయ నాలుగో ర్యాంక్, బి.సాయివంశీ ఆరో ర్యాంక్, సూరపనేని సాయివిజ్ఞ ఏడో ర్యాంక్, పి.వేదప్రణవ్‌ తొమ్మిదో ర్యాంక్, అప్పకొండ అభిజిత్‌రెడ్డి  పదో ర్యాంక్‌ దక్కించుకున్నారు. ఇక అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగంలో ఆరె అక్షయ్‌ రాష్ట్రస్థాయి ఐదో ర్యాంక్‌ సాధించగా, తిప్పరాజు హసిత  పదో ర్యాంక్‌ దక్కించుకుంది. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలను మే 3, 4, 6 తేదీల్లో నిర్వహించగా... అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్షలను మే 8, 9 తేదీల్లో నిర్వహించారు.

ఇంజినీరింగ్‌కు 1,42,210 మంది రిజిస్టర్‌ చేసుకోగా 1,31,209 మంది పరీక్షలకు హాజరయ్యారు. కాగా 1,08,213 (82.47 శాతం) మంది క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌కు 74,989 మంది రిజిస్టర్‌ చేసుకోగా 68,550 మంది పరీక్షలకు హాజరయ్యారు. కాగా 63,758 (93.01 శాతం) మంది క్వాలిఫై అయ్యారు. గ్రేటర్‌ పరిధిలో హైదరాబాద్‌ సెంట్రల్, హైదరాబాద్‌ ఈస్ట్, హైదరాబాద్‌ నార్త్, హైదరాబాద్‌ సౌత్‌ వెస్ట్, హైదరాబాద్‌ వెస్ట్‌ రీజియన్‌ల పరిధిలోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5 రీజియన్ల పరిధిలో ఇంజినీరింగ్‌ విభాగంలో 80,343 మంది రిజిస్టర్‌ చేసుకోగా 75,395 మంది పరీక్షలకు హాజరయ్యారు. అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగంలో 39,550 మంది రిజిస్టర్‌ చేసుకోగా 36,135 మంది పరీక్షలకు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు