టీచర్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌ రద్దు

10 Mar, 2017 01:45 IST|Sakshi
టీచర్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌ రద్దు

బ్యాలెట్‌ పేపర్‌లో అభ్యర్థుల ఫొటోలు తారుమారు
ఈసీ సూచన మేరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన భన్వర్‌లాల్‌


సాక్షి, హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి–హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియో జకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక కోసం నిర్వహించిన పోలింగ్‌ అనూహ్యంగా రద్దయింది. గురు వారం జరిగిన ఈ పోలింగ్‌లో ఉపయోగించిన బ్యాలెట్‌ పేపర్‌లో ఇద్దరు అభ్యర్థుల ఫొటోలు తారుమారు కావడం దీనికి కారణమైంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 19న (ఆదివారం) తిరిగి పోలింగ్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ ప్రకటించారు.

పోలింగ్‌ మొదలయ్యాక గుర్తింపు..
రాష్ట్రంలోని ఎనిమిది కొత్త జిల్లాల పరిధిలో ఉన్న 126 పోలింగ్‌ కేంద్రాల్లో గురువారం ఉదయం 8 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌ మొదలైంది. మొత్తం 23,789 మంది ఓటర్లు ఉండగా.. ఓటు వేసేందుకు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో బారులు తీరారు. తీరా పోలింగ్‌ మొదలయ్యాక బ్యాలెట్‌ పేపర్‌లో మూడో నంబర్‌లో ఉన్న అభ్యర్థి ఆది లక్ష్మయ్య, తొమ్మిదో నంబర్‌లో ఉన్న పి.మాణిక్‌రెడ్డి ఫొటోలు తారుమారైనట్లు గుర్తించడంతో.. గందరగోళం మొదలైంది. అభ్యర్థులతోపాటు ఎన్నికల ఏజెంట్లు, అధికారులు వెంటనే దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బ్యాలెట్‌ పేపర్ల ముద్రణలో ఈ తప్పు జరిగినట్లు నిర్ధారించిన సీఈవో భన్వర్‌లాల్‌.. వెంటనే కేంద్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు.

 ఎన్నికల కమిషన్‌ నుంచి తదుపరి ఆదేశాలు అందేంత వరకు అన్ని కేంద్రాల్లో పోలింగ్‌ను యథాతథంగా నిర్వహించారు. దాంతో ఈ ఎన్నిక రద్దవుతుందా.. లేదా అనే ఉత్కంఠ కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటల వరకే ఈ ఉపాధ్యాయ నియోజకవర్గంలో దాదాపు 51 శాతం పోలింగ్‌ నమోదైంది కూడా. ఈలోగా ఎన్నికను రద్దు చేయవద్దంటూ కొందరు, రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల కమిషన్‌కు వినతి పత్రాలు అందించారు. అయితే చివరికి కేంద్ర ఎన్నికల కమిషన్‌ నుంచి అందిన ఆదేశాల మేరకు ఎన్నికను రద్దు చేస్తున్నట్లు సాయంత్రం ఆరు గంటల సమయంలో భన్వర్‌లాల్‌ ప్రకటించారు. 19వ తేదీన రీపోలింగ్‌ నిర్వహిస్తామని.. ఓటర్లు తిరిగి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.