సైకిల్‌ యాత్రకు మనోళ్లు

6 Aug, 2019 11:29 IST|Sakshi
ప్యారిస్‌ సైకిల్‌ యాత్రలో హైదరాబాదీలు (ఫైల్‌)

ఈ నెల 18 నుంచి ప్యారిస్‌లో నిర్వహణ  

పాల్గొననున్న 30 మంది హైదరాబాదీలు  

రాయదుర్గం: ప్రపంచంలో అతిపురాతనమైన సైకిల్‌ యాత్రలో నగరవాసులు పాల్గొననున్నారు. ఈ నెల 18–22 వరకు ప్యారిస్‌లో నిర్వహించనున్న ‘ప్యారిస్‌–బ్రెస్ట్‌–ప్యారిస్‌’ సైకిల్‌ యాత్రలో పాలుపంచుకోనున్నారు. ఈ యాత్రలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 6వేల మంది పాల్గొంటారు. ఇందులో పాల్గొనే అవకాశం 320 మంది భారతీయులకు దక్కగా... వారిలో 30 మంది హైదరాబాద్‌ సైక్లిస్టులు కావడం విశేషం. వీరిలో అధిక శాతం మంది గచ్చిబౌలి పరిసరాల్లోని ఐటీ ఉద్యోగులుండడం గమనార్హం. వీరు ఈ నెల 14న ప్యారిస్‌కు వెళ్లనున్నారు. ఈ సైకిల్‌ యాత్రకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. నాలుగు రోజుల పాటు నిర్విరామంగా 90 గంటలు.. 765 మైళ్లు (1,230 కిలోమీటర్లు) వెంబడి ఈ యాత్ర కొనసాగుతుంది. దీన్ని 1891లో ప్రారంభించగా మొదట్లో దశాబ్దానికోసారి నిర్వహించేవారు. అయితే 1951 నుంచి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో పాల్గొనే సైక్లిస్ట్‌లను బ్రివర్ట్, అడాక్స్‌ అని రెండు వర్గాలుగా విభజిస్తారు. బ్రివర్ట్‌లను ప్రొఫెషనల్స్‌గా పరిగణిస్తారు. వీరు తమ ప్రయాణాన్ని ఒంటరిగా నాలుగు రోజుల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రయాణంలో అవసరమైన సామగ్రిని నిర్దేశించిన తనిఖీ కేంద్రాలలో మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అడాక్స్‌ పైవర్గానికి భిన్నంగా సమూహంగా ప్రయాణం చేస్తారు.  

అదే నా కోరిక  
ఇప్పటి వరకు 21 బ్రేవెట్స్‌లో పాల్గొని 19 విజయవంతంగా పూర్తి చేశాను. ఇప్పుడు ప్యారిస్‌లో యాత్రలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉన్నాను. ప్రత్యేకంగా ఎలాంటి ప్రాక్టీస్‌ చేయడం లేదు. నేను వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. రోజూ కార్యాలయానికి, మార్కెట్‌కు ఇతరత్రా పనులకు సైకిల్‌ వినియోగిస్తాను. భారత్‌ సైక్లింగ్‌కు స్వర్గధామం కావాలన్నదే మా కోరిక. అలాగే ఎకో ఫ్రెండ్లీ సైక్లింగ్‌ జరగాలన్నదే లక్ష్యం.  – మణికంఠ కార్తీక్, సైక్లిస్ట్‌  

నాలుగేళ్లుగా..  
ప్యారిస్‌లో యాత్రలో పాల్గొనేందుకు నాలుగేళ్లుగా సాధన చేస్తున్నాను. ఇప్పటి వరకు 23 బ్రేవెట్స్‌లో పాల్గొన్నాను. ఈ పురాతన సైకిల్‌ యాత్రలో పాల్గొననున్నందుకు గర్వంగా ఉంది. భారత్‌ నుంచి 320 మంది ఉంటే... వారిలో 30 మంది హైదరాబాదీలు కావడం గర్వకారణం.       – నవీన్‌ కొమ్ముకూరి, సీనియర్‌ సైక్లిస్ట్‌

15 నెలలుగా...
ప్యారిస్‌ సైకిల్‌ యాత్రలో పాల్గొనేందుకు 15 నెలలుగా సాధన చేస్తున్నాను. ఇప్పటి వరకు 13 బ్రేవెట్‌లలో పాల్గొన్నాను. ఈసారి పూర్తి సైకిల్‌యాత్ర చేయాలనే సంకల్పంతో ఎదురుచూస్తున్నాను. నగరం నుంచి ఇతర ప్రాంతాలకు చాలాసార్లు సైకిల్‌ రైడ్‌ చేశాను. కానీ ప్రపంచ స్థాయి సైకిల్‌ యాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను.     – పృథ్వీకృష్ణ, సీనియర్‌ సైక్లిస్ట్‌ 

మరిన్ని వార్తలు