వ్యాపార సంఘాలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌..

26 Jun, 2020 02:33 IST|Sakshi

హైదరాబాద్‌లోని బేగంబజార్, లాడ్‌బజార్, సికింద్రాబాద్‌లోని 

జనరల్‌ బజార్‌ సహా వివిధ ప్రాంతాల్లో వ్యాపారుల బంద్‌

కరోనా నేపథ్యంలో షాపుల మూసివేతకు నిర్ణయం..  

అబిడ్స్‌/చార్మినార్‌/రాంగోపాల్‌పేట: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వివిధ వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించేందుకు నిర్ణయించాయి. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లోని షాపులను మూసివేయనున్నట్లు ప్రకటించాయి. హైదరాబాద్‌ కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ గురువారం సమావేశమై బేగంబజార్‌ మార్కెట్‌ను ఈ నెల 28 నుంచి జూలై 5వ తేదీ వరకు పూర్తిగా మూసేయాలని నిర్ణయించింది. గత కొన్నిరోజులుగా బేగంబజార్, అఫ్జల్‌గంజ్, ఫీల్‌ఖానా, షాహినాయత్‌గంజ్, మహారాజ్‌గంజ్, ఉస్మాన్‌గంజ్‌ మార్కెట్లలో పలువురు వ్యాపారులకు కరోనా రావడంతో మిగిలిన వారంతా వణికిపోతున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లోనేకాక రాష్ట్రం నలుమూలల వ్యాపారస్తులంతా బేగంబజార్‌ నుంచి కిరాణా సామగ్రితో పాటు పప్పులు, ఇతర వస్తువులు హోల్‌సేల్‌ రేట్లకే కొనుగోలు చేసి విక్రయాలు చేస్తారు. వ్యాపారస్తులకు కరోనా వస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా మొత్తం కిరాణా హోల్‌సేల్‌ దుకాణాలను మూసేయాలని నిర్ణయించినట్లు హైదరాబాద్‌ కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రాఠి తెలిపారు. పాతబస్తీలోని వస్త్ర వ్యాపారులు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించడానికి నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన అనంతరం సిటీలో కరోనా వైరస్‌ ప్రభావం అధికం కావడంతో ఈ నెల 30వ తేదీ వరకు తమ వ్యాపారాలను మూసి ఉంచాలని వస్త్ర వ్యాపారుల సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి.

ఇందులో భాగంగా గురువారం ఉదయం నుంచి అన్ని రకాల రిటైల్‌ మార్కెట్లతో పాటు హోల్‌సేల్‌ వస్త్ర వ్యాపారాలను మూసివేశారు. ఇటు పాతబస్తీలోని లాడ్‌బజార్‌ కూడా మూతపడనుంది. అక్కడి వ్యాపారులు కూడా వారం రోజుల పాటు స్వచ్ఛందంగా షాపులు మూసేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సికింద్రాబాద్‌ జనరల్‌బజార్‌లో చీరల వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేశారు. చిత్ర దర్గా నుంచి మహంకాళి స్ట్రీట్‌ వరకు కొనసాగుతున్న పట్టు, ఫ్యాన్సీ చీరల వ్యాపారులు గురువారం నుంచి జూలై 5 వరకు మూసివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇటు జనరల్‌బజార్‌లోని బంగారు ఆభరణాల దుకాణాలను జూలై 5 వరకు మూసేస్తున్నట్లు సికింద్రాబాద్‌ గోల్డ్‌ సిల్వర్‌ జ్యువెలరీ డైమండ్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వార్తలు