..ఐతే చలానే!

9 Aug, 2019 12:13 IST|Sakshi

అధిక శబ్దం చేసే వాహనదారులపై కొరడా  

సైబరాబాద్‌లో 2,245 వాహనాలకు ఈ–చలాన్‌లు  

హైదరాబాద్‌లో 1,153 వెహికిల్స్‌కు జరిమానా  

సాక్షి, సిటీబ్యూరో: నిజాంపేటలో నివసించే వేణు మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగి. తనకు ఇష్టమైన ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను రూ.లక్షన్నర వెచ్చించి కొనుగోలు చేశాడు. అది అందరి దృష్టిని ఆకర్షించేందుకు బైక్‌ సైలెన్సర్, హారన్‌ను మోడిఫై చేయించాడు. దానిపై రోజూ ఆఫీస్‌కు వెళ్లొచ్చే సమయంలో చేసే శబ్దంతో తోటి వాహనదారులు చిరెత్తిపోయేవారు. చివరకు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు దొరకడంతో జరిమానా విధించారు.  

జూబ్లీహిల్స్‌లో నివసించే శ్రీకాంత్‌కు ఖరీదైన కారుంది. బిజినెస్‌ నిమిత్తం రోజూ మాదాపూర్‌ వెళ్తుంటాడు. రహదారిపై వెళ్తున్న సమయంలో చేస్తున్న మల్టీటోన్డ్‌ హారన్‌ ఇతరులకు ఇబ్బందికరంగా మారింది. శబ్ద పరిమితి దాటడంతో ట్రాఫిక్‌ పోలీసులు చలాన్‌ విధించారు.  

ఇలా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పరిమితికి మించి శబ్దం చేస్తూ, ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న వాహనచోదకులపై ట్రాఫిక్‌ పోలీసులు సౌండ్‌ లెవల్‌ మీటర్స్‌(ఎస్‌ఎల్‌ఎం) సహాయంతో ఉక్కుపాదం మోపుతున్నారు. మార్చిలో ప్రారంభించి ఇప్పటి వరకు 2,245 మంది వాహనదారులకు స్పాట్‌ ఈ–చలాన్‌లు విధించారు. మార్చిలో 9, ఏప్రిల్‌లో 54, మేలో 88, జూన్‌లో 197, జూలైలో 1,897 వాహనాలకు జరిమానా వేశారు. అయితే మొదట్లో బైకులు తొలి స్థానం లో ఉండగా... ఇప్పుడు కార్లు నిలిచాయి. శబ్ద కాలుష్యం, మల్టీటోన్డ్‌ హారన్, ఎయిర్‌ హారన్‌ల వారీగా స్పాట్‌లోనే చలాన్‌లు వేస్తున్నారు. ప్రస్తుతం ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి ఠాణాల్లో ఎస్‌ఎల్‌ఎం యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో నిర్వహిస్తున్న తనిఖీలను ఇతర ఠాణాల్లోనూ అమలు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.  

పరిమితిని మించి...  
యువత ఖరీదైన కార్లు, బైకులతో రహదారులపై దూసుకెళ్తున్నారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (పీసీబీ) మార్గదర్శకాల ప్రకారం ద్విచక్ర వాహనాలకు 75 డెసిబుల్స్‌ దాటితే, కార్లకు 74 డెసిబుల్స్‌ దాటితే జరిమానా విధిస్తున్నారు. వాహనదారులను హారన్‌ కొట్టమని అది మల్టీటోన్డ్, ఎయిర్‌ హారన్, కంపెనీ ఫిక్స్‌డ్‌ చేసిన హారనా? అని ట్రాఫిక్‌ పోలీసులు గుర్తిస్తున్నారు. 12 ఫీట్ల దూరం నుంచి శబ్ద తరంగాలను ఎస్‌ఎల్‌ఎంలతో గుర్తిస్తున్నారు. మోటారిస్టులు ఎక్సలేటర్‌ తొక్కితే కొంత దూరం నుంచి ఎస్‌ఎల్‌ఎం సౌండ్‌ సెన్సార్లు శబ్ద స్థాయిని పసిగడుతున్నాయి. వాహనానికి 5–6 ఫీట్ల దూరం నుంచి ఈ యంత్రాలు శబ్ద తీవ్రతను నమోదు చేస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఉప్పల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఒక యంత్రం ఉండగా పదుల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. ఇక హైదరాబాద్‌ కమిషనరేట్‌లో 1,153 ఈ–చలాన్‌లు జారీ చేసినట్టు ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.  

శబ్దం చేస్తే చర్యలే..  
కంపెనీ ఫిక్స్‌ చేసిన హారన్‌ శబ్దం నచ్చకపోవడంతో చాలామంది మార్చేస్తున్నారు. అలాగే రోడ్లపై వెళ్తున్న సమయంలో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు సైలెన్సర్‌లు మోడిఫై చేస్తున్నారు. చాలా వరకు ఈ బైకులు 90–120 డెసిబుల్స్‌ వరకు వెళ్తున్నట్టు ఎస్‌ఎల్‌ఎం రీడింగ్‌లు చెబుతున్నాయి. ఇక కార్ల పరిస్థితి వీరి కంటే ఎక్కువగా ఉంది. అధిక శబ్దం చేసే వాహనదారులపై చర్యలు తప్పవు.  – విజయ్‌కుమార్,సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ

మరిన్ని వార్తలు