ఖాకీలపై కన్ను!

16 Apr, 2019 08:33 IST|Sakshi

పోలీస్‌ సిబ్బంది, అధికారుల ఉల్లంఘనలపై దృష్టి  

సిటీలో స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభం  

హెచ్‌ఎండీఏ కార్యాలయం మార్పుపై వ్యతిరేకత  

తార్నాకలోనే మేలంటున్న ప్రజలు  

అమీర్‌పేట్‌కు వెళ్లడం కష్టమవుతుందని ఆవేదన  

ట్రాఫిక్‌ రద్దీ, పార్కింగ్‌ కష్టాలు తప్పవని వ్యాఖ్య   

ఉన్నతాధికారులు పునరాలోచించాలని వినతి  

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కేవలం నగరవాసులపైనే కాదు... పోలీస్‌ సిబ్బంది, అధికారులపైనా కొరడా ఝళిపిస్తున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే... నిబంధనలు ఉల్లంఘించిన సాధారణ ప్రజలకు జరిమానా మాత్రమే పడుతోంది. అదే పని పోలీసులు చేస్తే వారికి జరిమానా, తాఖీదులతో పాటు తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే వేటు కూడా పడనుంది. పోలీసులకు సంబంధించిన స్పెషల్‌ డ్రైవ్‌ను సిటీ ట్రాఫిక్‌ కాప్స్‌ సోమవారం ప్రారంభించారు. ఇది మూడు, నాలుగు రోజుల  పాటు కొనసాగుతుందని నగర ట్రాఫిక్‌ విభాగం అదనపు కమిషనర్‌ అనీల్‌కుమార్‌ ‘సాక్షి’కితెలిపారు. పోలీసులకు సంబంధించిన అధికారిక, వ్యక్తిగత వాహనాలపై ఉన్న జరిమానాలను తక్షణం చెల్లించాల్సిందిగా ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

వారే తప్పు చేస్తే...  
రహదారి భద్రతకు సంబంధించిన అంశాలు, నిబంధనలను క్షేత్రస్థాయిలో  ట్రాఫిక్, శాంతిభద్రతల అధికారులే అమలు చేస్తుంటారు. ఈ అధికారాలు ఉన్న వారే తప్పులు చేస్తే ప్రజల్లో చులకన భావం వస్తుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో హెల్మెట్‌ నిబంధన పక్కా చేసినప్పుడు కమిషనరేట్‌లోకి, సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌)కు ద్విచక్ర వాహనాలపై వచ్చే ప్రతి అధికారి/సిబ్బంది కచ్చితంగా దీన్ని ధరించాల్సిందేనని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. లేని పక్షంలో ఆయా వాహనాలను లోపలికి అనుమతించొద్దని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానాన్ని మరింత విస్తరిస్తూ తీవ్రమైన ఉల్లంఘనలపై  చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గడిచిన కొన్నాళ్లుగా ట్రాఫిక్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్స్‌ చేపడుతున్నారు. ఉల్లంఘనల వారీగా వీటిని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే సాధారణ ప్రజలతో పాటు పోలీసులు చేసే వాటిపైనా దృష్టి పెట్టారు. 

యూనిఫామ్‌లో ఉంటే...  
నగర పోలీస్‌ విభాగంలో పని చేస్తున్న 10వేల మందికి పైగా సిబ్బంది నిత్యం ఇళ్ల నుంచి పోలీస్‌ స్టేషన్‌/కార్యాలయం మధ్య, వ్యక్తిగత/అధికారిక పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ఇలా వీరు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో అత్యధిక శాతం యూనిఫామ్‌లోనే ఉంటున్నారు. సిబ్బంది/అధికారులు వినియోగిస్తున్న వాటిలో ప్రైవేట్‌ వాహనాలతో పాటు ప్రభుత్వం అందించినవీ ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో యూనిఫామ్‌లో ఉన్న పోలీసులతో పాటు పోలీస్‌ వాహనాలు ఉల్లంఘనలకు పాల్పడడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. వీరిలో మార్పు తీసుకురావడానికి ఇప్పటికే పలుసార్లు కౌన్సెలింగ్‌ కార్యక్రమాలు చేపట్టిన అధికారులు ఇప్పుడు స్పెషల్‌డ్రైవ్‌ ద్వారా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ప్రాథమికంగా హెల్మెట్‌ లేకుండా వాహనం నడపడం, నిబంధనలకు విరుద్ధంగా నంబర్‌ ప్లేట్‌ కలిగి ఉండడం, వాహనాల నంబర్‌ ప్లేట్లపై పోలీస్‌ లాంటి పదాలు రాసి ఉండడంపై దృష్టి పెట్టి స్పెషల్‌డ్రైవ్‌ చేస్తున్నారు.  

ఆధారాల సేకరణ...  
పోలీసుల ఉల్లంఘనలకు సంబంధించి పక్కా ఆధారాలు ఉంటేనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఇప్పటికే నాలుగు రకాల సాధనాల ద్వారా పోలీస్‌ ఉల్లంఘనుల వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో విధుల్లో ఉంటున్న సిబ్బంది తమ చేతిలో ఉండే కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నారు. దీంతోపాటు బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచీ ఫొటోలు తీస్తున్నారు. ఈ రెండింటితో పాటు సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న వాటిని, పత్రికల్లో ప్రచురితం/ప్రసారమైన ఫొటోలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇలా సేకరించిన ఫొటోలను కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సిబ్బంది అధ్యయనం చేస్తున్నారు. ఆ సమయంలో వాహనాన్ని నడిపింది ఎవరు? అనేది నిర్ధారించిన తర్వాత ప్రాథమికంగా సదరు పోలీసుల నుంచి జరిమానా వసూలు చేసి, ఆపై చార్జ్‌మెమో జారీ చేస్తున్నారు. ఉల్లంఘన తీవ్రతను బట్టి కొందరు అధికారులపై బదిలీ/ఎటాచ్‌మెంట్‌ వేటు కూడా వేస్తున్నారు. ఇప్పుడు స్పెషల్‌డ్రైవ్‌ ద్వారా ఈ చర్యలు వేగవంతం చేశామని అధికారులు పేర్కొంటున్నారు. సాధారణ ప్రజలతో పాటు పోలీసుల్లోనూ మార్పు రావాలన్న లక్ష్యంతోనే స్పెషల్‌డ్రైవ్‌ చేపడుతున్నామని వివరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు