ఇష్టానుసారం కుదరదు

8 Jun, 2020 08:10 IST|Sakshi

ట్రాఫిక్‌ నియమాలు కఠినంగా అమలు  

ఐదు నెలల్లో 5156 కేసులు, 425 మైనర్‌ డ్రైవింగ్‌ కేసులు

చిన్నతప్పిదాలే  ప్రాణాలు తీస్తున్నాయంటున్న సైబరాబాద్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్‌): ప్రజాభద్రతను దృష్టిలో ఉంచుకొని సైబరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్‌ నియమాలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే పిలియన్‌ రైడర్‌కు హెల్మెట్‌ తప్పనిసరి అని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాలకు సైడ్‌ మిర్రర్‌లు ఉండాలంటూ విధిస్తున్న ఈ–చలాన్‌లతో వాహనదారుల్లో కాస్త మార్పు కనిపిస్తోంది. అదే సమయంలో అనుమతి పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్లు, యువకుల భరతం పడుతున్నారు.  స్నేహితులు, బంధువుల కార్లు, బైక్‌లను తీసుకుని రహదారులపై దూసుకెళ్తూ ఇతరుల వాహనాలను ఢీకొట్టే వారిని కట్టడి చేయడం..  ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా  కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 5156 వితవుట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కేసులు, 425 మైనర్‌ డ్రైవింగ్‌ కేసులు నమోదు చేశారు. (నెంబర్‌ప్లేట్‌ కనిపించకుండా ట్యాంపరింగ్‌..)

ఊహించని విధంగా...
సైబరాబాద్‌లో విస్తృ్తతంగా వాహనాలను నిలిపి తనిఖీలు చేస్తున్నారు. ఒకే బైక్‌పై ముగ్గురి ప్రయాణించడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసే వారిని పట్టుకునేందుకు వాహన చోదకులు ఊహించని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. లైసెన్స్‌ లేకుండా బండి నడిపే వారిని ఆపి అక్కడికక్కడే  స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలా సైబరాబాద్‌లో జనవరి నుంచి ఇప్పటివరకు 5,156 కేసులు నమోదుచేశారు. మైనర్లైతే తల్లిదండ్రులను పిలిపించి వారితో మరోసారి వాహనాలను నడపనీయమంటూ లిఖితపూర్వకంగా రాయించుకుని వాహనం ఇస్తున్నారు. ఇలా 425 మైనర్‌ డ్రైవింగ్‌ కేసులు నమోదుచేశారు. మేజర్లయితే కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఇతర ప్రక్రియలతోపాటు ... లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నామంటూ దరఖాస్తు నంబరు చూపించాకే వాహనాన్ని ఇస్తున్నారు.   

జరిమానా కాదు...నేరుగా న్యాయస్థానానికే
ద్విచక్ర వాహనం, కార్లు, ఇతర వాహనాలు నడిపేందుకు అవసరమైన డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా నడిపితే నేరుగా న్యాయస్థానానికి వెళ్లాల్సిందే. గతంలో లైసెన్స్‌ లేకుండా  నడిపితే పోలీసులు జరిమానా విధించి వదిలేసేవారు.  కొద్ది నెలల నుంచి వాహనాలను స్వాధీనం చేసుకొంటున్నారు. మరుసటి రోజు ఉదయం సదరు చోదకుడు ధ్రువపత్రాలు, ఫొటోలు తీసుకుని న్యాయస్థానంలో హాజరు కావాలి. వాస్తవానికి మోటార్‌ వాహన చట్టంలో ఇవన్నీ ఉన్నా.. పోలీసులు, రవాణా శాఖ అధికారులు అవసరమైన సందర్భాల్లోనే వినియోగిస్తున్నారు. ప్రమాదాలు తగ్గుతున్నా.. తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎవరినీ ఉపేక్షించడం లేదు. అందరూ లైసెన్సును తప్పక దగ్గర ఉంచుకోవాలని  ఇప్పటికే అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. కూడళ్ల వద్ద సైన్‌ బోర్డుల్లోనూ ఈ విషయాన్ని వివరిస్తున్నారు. హెల్మెట్‌ లేని వారికి జరిమానాను విధిస్తున్నారు.

ఉల్లంఘిస్తే కఠిన శిక్షలే..
లైసెన్సు లేకుండా తొలిసారి పోలీసులకు చిక్కితే.. వాహనం స్వాధీనం చేసుకుంటారు. తర్వాతి రోజు న్యాయస్థానంలో వాహనదారుడిపై చార్జిషీట్‌ దాఖలు చేస్తారు. కోర్టు సమయం పూర్తయ్యేవరకూ న్యాయస్థానం ప్రాంగణంలోనే నిలబడి ఉండాలి. జరిమానా చెల్లించాలి.
♦  రెండోసారి పోలీసులకు దొరికితే.. 48 గంటలపాటు జైల్లో ఉంచుతారు.
మూడోసారి చిక్కితే రెండు అంతకంటే ఎక్కువ రోజుల జైలుశిక్షతోపాటుగా భారీగా జరిమానా చెల్లించాలి. దీని ప్రభావం విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగాలు, విదేశాలకు వెళ్లే అవకాశాలపై ఉంటుంది.
♦ ఐదు, అంతకంటే ఎక్కువసార్లు దొరికితే మాత్రం వారం రోజుల జైలుశిక్ష అనుభవించి.. భారీ జరిమానా చెల్లించక తప్పదు. పోలీసుల నివేదిక అధారంగా కోర్టులు జరిమానాను  నిర్ణయిస్తాయి. 

మరిన్ని వార్తలు