చిన్నారుల తల్లిదండ్రులారా! ఈ లేఖ మీకే

8 Jun, 2018 11:00 IST|Sakshi

సూచనలు జారీ చేసిన ట్రాఫిక్‌ పోలీసులు 

సాక్షి, సిటీబ్యూరో : పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. స్కూలు ఆటోలు, బస్సులు రోడ్డెక్కుతున్నాయి. విద్యార్థులను తరలించే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా నగర ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులకు గురువారం కొన్ని కీలక సూచనలు జారీ చేశారు. దీనిని సోషల్‌మీడియా ద్వారా విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ సందేశమిదీ... 

ప్రియమైన చిన్నారుల తల్లిదండ్రులారా... 
హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల  శుభాభినందనలు. మీ చిన్నారుల భద్రత మాకు అత్యంత కీలక బాధ్యత. వారి భద్రతకు సంబందించిన విషయంలో మీరూ ఏ మాత్రం రాజీపడకండి. పాఠశాలకు వెళ్లే విద్యార్థులను ఆయా వాహనాల్లో పరిమితికి మించి ఎక్కించుకోవడం నిబంధనలకు విరుద్ధం. అది మీ చిన్నారులకు ప్రాణాపాయం తెచ్చిపెట్టే ప్రమాదం కూడా ఉంది. పాఠశాలలకు మీ చిన్నారులు ప్రయాణించే వాహన డ్రైవర్‌ పూర్తి వివరాలు సరిచూసుకోండి. డ్రైవింగ్‌ లైసెన్స్, వాహన ఆర్సీ, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్‌లను సరిచూసుకోండి. డ్రైవర్‌ ప్రవర్తనను కూడా నిశితంగా పరిశీలించండి. మోటారు వాహనాలకు సంబంధించిన నిబంధనలు పాటించని డ్రైవర్ల వాహనాల్లో మీ చిన్నారులను పంపకండి. మాకు సహకరిస్తున్నందుకు మీకు, మీ పిల్లలకు హైదరాబాద్‌  ట్రాఫిక్‌ పోలీసుల  శుభాకాంక్షలు.  

 ఇట్లు,  
హైదరాబాద్‌  ట్రాఫిక్‌ పోలీసులు, 
మీకోసం.. మీతోనే.. ఎల్లప్పుడూ...
   

మరిన్ని వార్తలు