సైకిళ్ల నగరంలో షి'కారు'

5 Nov, 2017 02:18 IST|Sakshi

శరవేగంగా మారిపోయిన భాగ్యనగర రవాణా ముఖచిత్రం

సిటీ ఆఫ్‌ బైస్కిల్స్‌.. అంటే సైకిళ్ల నగరమని అర్థం.. ఎటు చూసినా సైకిళ్లే కనిపించడంతో ఒకప్పుడు మన భాగ్యనగరాన్ని అలా పిలిచేవారు.. మరి ఇప్పుడో...? రవాణా రంగ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది! రోడ్డెక్కి ఆటో కోసం, సిటీ బస్సు కోసం పడిగాపులు కాయాల్సిన పనిలేదు. ఆటోవాలాల ఆగడాలను భరించాల్సిన అవసరం లేదు. బెంబేలెత్తించే మీటర్‌ ట్యాంపరింగ్‌లు లేవు. అక్కడక్కడా ఒకట్రెండు ఘటనలు మినహా పూర్తిగా భద్రతతో కూడిన రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అదీ ఆటోరిక్షా కంటే చౌకగా!! మొబైల్‌లో బుక్‌ చేస్తే క్యాబ్‌లు క్షణాల్లో ఇంటి ముందు వాలిపోతున్నాయి. సినిమాకు వెళ్లాలన్నా, షికారుకెళ్లాలన్నా, ఆసుపత్రికెళ్లాలన్నా, బస్‌స్టేషన్‌లు, రైల్వేస్టేషన్‌లు, స్కూళ్లు, కాలేజీలకు ఎక్కడికి వెళ్లాలన్నా ఇప్పుడు సొంత వాహనాన్ని తలపించే క్యాబ్‌ ఉంది. ఉబెర్, ఓలా వంటి అంతర్జాతీయ సంస్థలతోపాటు మేరు, డాట్, గ్రీన్‌క్యాబ్స్, రేడియో క్యాబ్స్, షీ క్యాబ్స్‌ వంటి స్థానిక క్యాబ్‌ సంస్థలు ప్రయాణికులకు రవాణా సదుపాయం అందజేస్తున్నాయి. నగరంలో మారుతున్న రవాణా రంగ ముఖచిత్రంపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్‌..
– సాక్షి, హైదరాబాద్‌

నాటికి నేటికి ఎంత తేడా..?
గుర్రపు బగ్గీలు, టాంగాలు, జట్కాలు మాత్రమే రవాణా సాధనాలుగా ఉన్న రోజుల్లో సైకిల్‌ దూసుకొచ్చింది. అదీ కొందరు సంపన్నుల వద్దే కనిపించేది. కాలక్రమంలో నగరపు రహదారులను సైకిళ్లు ముంచెత్తాయి. వాహనప్రియుల అభిరుచికి అనుగుణంగా రకరకాల మోడళ్లలో సైకిళ్లను రూపొందించి వినియోగంలోకి తెచ్చారు. 1930 నుంచి మొదలైన సైకిల్‌ ప్రస్థానం నాలుగైదు దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా సాగింది. సంపన్నులతో మొదలై నిరుపేదల వరకు సైకిల్‌ను వాడేవారు. అలా ఇంటింటికీ సైకిల్‌ వచ్చేసింది. దీనికి సమాంతరంగా సైకిల్‌ రిక్షాలు పరుగులు తీశాయి. 1980 నాటికి హైదరాబాద్‌లో సైకిల్‌ రిక్షాయే అతి ముఖ్యమైన రవాణా సాధనమైంది. నిజాం కాలం నుంచే సిటీ బస్సులు అందుబాటులో ఉన్నా పరిమితమైన రూట్‌లలోనే తిరిగేవి.

80వ దశాబ్దం నాటికి సిటీ బస్సుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగినా చిన్నచిన్న బస్తీలు, ఇరుకు గల్లీల్లోంచి గణగణ గంట మోగించుకొంటూ సైకిల్‌ రిక్షా దూసుకుపోయింది. ‘రిమ్‌ జిమ్‌ రిమ్‌ జిమ్‌ హైదరాబాద్‌...రిక్షావాలా జిందాబాద్‌.. మూడు చక్రములు గిరగిరా తిరిగితే మోటారు కారు బలాదూర్‌...’ అంటూ సైకిల్‌ రిక్షా హైదరాబాద్‌ను ఏలిన రోజులవి! ఎనభైల నాటికి సుమారు లక్ష వరకు సైకిల్‌ రిక్షాలు ఉండేవని అంచనా. అంతకు రెట్టింపు సంఖ్యలోనే సైకిళ్లు ఉండేవి. ఎనభయ్యో దశాబ్దం హైదరాబాద్‌ వాహనరంగాన్ని ఓ కుదుపు కుదిపింది. జట్కాలు, టాంగాలు, సైకిల్‌ రిక్షాల కంటే వేగంగా గమ్యాన్ని చేర్చే ఆటోరిక్షాలు వచ్చాయి. 1990 నాటికి సిటీ బస్సుతో పాటు ఆటోరిక్షాలు ప్రజా రవాణా రంగంలో అగ్రభాగంలో నిలిచాయి. సహజంగానే మొదట్లో ఉన్నత వర్గాలే వీటిని వినియోగించినా క్రమంగా ప్రతి ఒక్కరు ఆటోను వినియోగించే స్థాయికి వీటి సేవలు అందుబాటులోకి వచ్చాయి.

పోటెత్తిన వ్యక్తిగత వాహనాలు
నగరం విస్తరిస్తున్నట్లుగానే అందుకు అనుగుణంగా వాహనాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. రవాణా శాఖ లెక్కల ప్రకారం 1970లో వ్యక్తిగత వాహనాలు కేవలం 9789. ప్రజా రవాణా వాహనాలు 5083 మాత్రమే ఉండేవి. 1980 నాటికి వ్యక్తిగత వాహనాల సంఖ్య 27,819కు, ప్రజా రవాణా వాహనాల సంఖ్య 10,437కు చేరింది. 1990లో సుమారు 2.22 లక్షల వాహనాలు నమోదయ్యాయి. ఆ తర్వాత వాహనాల వినియోగంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. సైకిళ్లు, సైకిల్‌ రిక్షాలు, ఆటోలు తదితర వాహనాల కంటే బైక్‌ల సంఖ్య భారీగా పెరిగింది. ఇదే సమయంలో కార్ల వినియోగం ఎక్కువైంది. ఈ అభివృద్ధి మరింత వేగంగా కొనసాగింది. 2012 నాటికి అన్ని రకాల వాహనాలు కలిపి 36.72 లక్షలకు చేరాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 50 లక్షలకు చేరింది. అంటే సుమారు కోటి జనాభా ఉన్న నగరంలో అరకోటి వాహనాలు ఉన్నాయన్నమాట! ప్రతి మనిషికీ ఓ బైక్‌ అన్నట్టుగా వాహన రంగం విస్తరించింది. మధ్య తరగతి, వేతన జీవుల ఆదాయానికి అనుగుణంగా కార్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 35 లక్షలకు పైగా ద్విచక్రవాహనాలు ఉంటే 10 లక్షలకు పైగా కార్లున్నాయి. మిగతావి రవాణా రంగానికి చెందినవి.

క్యాబ్‌ వైపే మొగ్గు ఎందుకు?
- సికింద్రాబాద్‌ నుంచి హైటెక్‌సిటీకి వెళ్లేందుకు ఆటోరిక్షాలో కనీస చార్జీ రూ.20. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.11 చొప్పున కనీసం రూ.500 వరకు చార్జీ అవుతుంది. కానీ అంతే దూరానికి క్యాబ్‌లు రూ.300 నుంచి రూ.350 వరకే లభిస్తున్నాయి.
పైగా నేరుగా ఇంటి నుంచే బయలుదేరి గమ్యానికి చేరుకొనే సదుపాయం ఉండడంతో ప్రతి ఒక్కరు క్యాబ్‌ వైపు మొగ్గుతున్నారు.
మూడేళ్ల క్రితం వరకు నగరంలో సుమారు 1.3 లక్షల ఆటోరిక్షాల్లో ప్రతి రోజు 15 లక్షల మంది పయనించగా ఇప్పుడు ఆ సంఖ్య 8 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఉంది.
నగరంలో 3,550 సిటీ బస్సుల్లో రోజుకు 33 లక్షల మంది తిరుగుతున్నట్లు అంచనా. కానీ క్యాబ్‌లు, ఇతర ప్రైవేట్‌ వాహనాల పోటీ కారణంగా ఈ సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఒకప్పుడు 72 శాతం ఉన్న సిటీ బస్సు ఆక్యుపెన్సీ రేషియో ఇప్పుడు ఏకంగా 65 శాతానికి పడిపోయింది. 
నగరంలో ప్రతిరోజు 121 ఎంఎంటీఎస్‌ సర్వీసుల్లో రోజుకు 1.4 లక్షల మంది పయనిస్తున్నారు. ట్రైన్‌ దిగిన ప్రయాణికులు తిరిగి క్యాబ్‌లను వినియోగిస్తుండటం గమనార్హం.

క్షణాల్లో బుకింగ్‌లు..  నిమిషాల్లో పరుగులు..
శరవేగంగా దూసుకొచ్చిన క్యాబ్‌ సర్వీసులతో ఆటోరిక్షాలు, సిటీ బస్సుల గ్రాఫ్‌ క్రమంగా పడిపోయింది. గ్రేటర్‌లో సుమారు 2 లక్షల క్యాబ్‌లు ప్రతిరోజు 20 లక్షల మందికి పైగా రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ఒక్క శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికే ప్రతిరోజు సుమారు 10 వేల క్యాబ్‌లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉబెర్, ఓలా మొబైల్‌ యాప్‌ల నుంచి రోజూ సుమారు 15 లక్షల మంది తమ గమ్యస్థానాలను బుక్‌ చేసుకుంటున్నట్లు అంచనా. మరో 5 లక్షల మంది మిగతా క్యాబ్‌లను వినియోగిస్తున్నారు. ఇందులో ఇండికా, ఆల్టో వంటి చిన్న కార్ల నుంచి ఇన్నోవా, స్విఫ్ట్‌ డిజైర్‌ వంటి లగ్జరీ వాహనాల వరకు అందుబాటులో ఉన్నాయి. ఓలా సంస్థ మరో అడుగు ముందుకేసి ఆటోరిక్షా సర్వీసులను కూడా అందజేస్తోంది. మరోవైపు మోటో పేరుతో ఉబెర్‌ బైక్‌లు అందుబాటులోకి వచ్చాయి. హైటెక్‌సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్‌ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ కారణంగా ఇబ్బందులకు గురయ్యే ఐటీ ఉద్యోగులు, ఇతర వర్గాలు క్షణాల్లో కార్యాలయాలకు చేరుకొనేందుకు ఉబెర్‌ బైక్‌లను వినియోగిస్తున్నారు. ఓలా క్యాబ్‌లలో కేవలం రూ.36ల కనీస చార్జీలతో మొదలై ఒక కిలోమీటర్‌కు రూ.6 చొప్పున రవాణా సదుపాయం అందజేసే మైక్రో, మినీ వాహనాల నుంచి రూ.80ల కనీస చార్జీలతో సేవలందజేసే ప్రైమ్‌ వాహనాలున్నాయి. ఉబెర్‌ పూల్, ఉబెర్‌ ఎక్స్, ఉబెర్‌ గో, కేటగిరీలలో ప్రయాణికులకు రవాణా సదుపాయాలు అందుతున్నాయి.

ట్యాక్సీ గిరాకీ దెబ్బతిన్నది
ఇరవై ఏళ్ల నుంచి ట్యాక్సీ నడుపుతున్నా. క్యాబ్‌ పోటీకి తట్టుకోలేకపోతు న్నారు. క్యా బ్‌లు వచ్చిన తర్వాత గిరాకీ మొత్తం పడిపోయింది. క్యాబ్‌ తరహాలో మేం ఎక్కడికంటే అక్కడకు వెళ్ల లేం. చార్జీలు కూడా ట్యాక్సీలో ఎక్కువగానే ఉంటాయి. సికింద్రా బాద్‌ నుంచి బేగంపేట్‌కు వెళ్లాలంటే ట్యాక్సీ చార్జీ రూ.300 వరకు ఉంటుం ది. అదే క్యాబ్‌లో అయితే చాలా తక్కువ. ఏం చేయాలో అర్థం కావడం లేదు. రాత్రింబవళ్లు కష్టపడ్డా పెట్రోల్, డీజిల్‌ ఖర్చులు కూడా రావడం లేదు. 
– సయ్యద్‌ అఫ్సర్, ట్యాక్సీ డ్రైవర్‌

ఆటో ఎక్కడమే మరిచాను
ఒకప్పుడు ఆటో ఎక్కువగా వినియోగించే వాణ్ని. రెండేళ్ల నుంచి పూర్తిగా మానేశాను. నాలుగైదు కిలోమీటర్లయినా సరే క్యాబ్‌లే ఎంతో సౌకర్యంగా ఉన్నాయి. ఎక్కడికంటే అక్కడికి వస్తారు. బేరమాడాల్సిన పనిలేదు. పైగా ఆటో కంటే తక్కువ చార్జీ. ఏసీ సదుపాయం ఉంటుంది. అనుకున్న చోటుకు అనుకున్న సమయానికి చేరుకోవచ్చు. ఒక ప్రయాణికుడికి ఇంతకంటే ఏం కావాలి?
    – హరీష్, ప్రైవేట్‌ ఉద్యోగి

ట్రైన్‌ దిగగానే క్యాబ్‌ రెడీగా ఉంది
కొద్దిక్షణాల్లో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో దిగు తామనగా క్యాబ్‌ బుక్‌ చేసుకున్నాం. స్టేషన్‌ బయటకు వచ్చే వరకు క్యాబ్‌ రెడీగా ఉంది. ఎలాంటి బేరసారాలు లేవు. డ్రైవ ర్‌ ఫొటో, బండి నంబర్, ఫోన్‌ నంబర్, సికింద్రాబాద్‌ నుంచి మల్కాజిగిరి వరకు అయ్యే రూ.135 చార్జీ వివరాలు అన్నీ ముందే ఫోన్‌లో నమోదయ్యాయి. నిశ్చిం తంగా బయలుదేరాం. క్యాబ్‌ సదుపాయం చాలా బాగుంది.     
– కుమారి

మిగతా వాటి కన్నా క్యాబే బెటర్‌
బస్సు కోసం, ఆటో కోసం ఎదురు చూసే రోజులు పోయాయి. ప్రయాణానికి క్యాబ్‌ ఒక నిర్వచనంగా మారింది. మహిళలకు భద్రతాపరమైన కొన్ని ఇబ్బందులు ఉన్నమాట నిజమే కానీ, మిగతా ట్రాన్స్‌పోర్ట్‌ కంటే ఇది బెటర్‌ కదా.
– రవి, శరణ్య దంపతులు

మాకు కష్టంగానే ఉంది
ఆటోలకు గిరాకీ లేదు. గతంలో రోజుకు రూ.1,200 వస్తే ఇప్పుడు రూ.800 కూడా రావడం లేదు. చాలా కష్టంగా ఉంది. ఆటో కిరాయి రూ.300, ఎల్పీజీ ఖర్చు రూ.250 మినహాయిస్తే ఒక రోజుకు రూ.200 కూడా గిట్టుబాటు కావడం లేదు. క్యాబ్‌ల వల్ల పోటీ బాగా పెరిగింది.    
     – మహ్మద్‌ అబ్దుల్లా, ఆటో డ్రైవర్‌

ఆదాయం అంతంతే
ఓలా, ఉబెర్, క్యాబ్‌ల వల్ల ప్రయాణికులకు బాగానే ఉన్నా ఈ రంగంలో పెరిగిన పోటీ కారణంగా ఆదాయం బాగా పడిపోయింది. రోజుకు 18 గంటలు కష్టపడితే తప్ప రూ.1000 లభించడంలేదు. గతంలో వారానికి రూ.1,500 ప్రోత్సాహకంగా ఇచ్చేవారు. ఇప్పుడు పూర్తిగా తగ్గించారు. కమీషన్‌లు, ట్యాక్స్‌లు చెల్లిస్తే మాకు దక్కేది కూడా తక్కువే.         
    – బాబర్, క్యాబ్‌ డ్రైవర్‌

మరిన్ని వార్తలు