ప్లేట్‌లెట్లు తగ్గేది ఇందుకే..

14 Jul, 2020 04:50 IST|Sakshi

కారణాన్ని గుర్తించిన హైదరాబాద్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు

సమర్థ మందుల తయారీకి ఈ పరిశోధన దోహదం

జర్నల్‌ ఆఫ్‌ వైరాలజీ సంచికలో వివరాలు ప్రచురితం  

సాక్షి, హైదరాబాద్‌: డెంగీ వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గిపోయేందుకు కారణమేమిటో గుర్తించామని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ లైఫ్‌ సైన్సెస్‌ విభాగం శాస్త్రవేత్తలు సోమవారం ప్రకటించారు. వ్యాధికారక వైరస్‌లోని ప్రొటీన్‌ ఒకటి కణాల్లోని మైటోకాండ్రియా పనితీరును ప్రభావితం చేస్తుండటం వల్ల ప్లేట్‌లెట్లు తగ్గిపోతున్నట్లు తాము ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నామని డాక్టర్‌ ఎం. వెంకట రమణ, డాక్టర్‌ ఎస్‌. నరేశ్‌బాబులు తెలిపారు. సుమారు 140 దేశాల్లో ప్రభావం చూపగల డెంగీకి ఇప్పటివరకూ సరైన టీకా లేదా మందు లేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాము డెంగీ కారక వైరస్‌పై పరిశోధనలు చేపట్టామని తెలిపారు.

డెంగీ వైరస్‌లో మొత్తం పది వరకూ ప్రొటీన్లు ఉంటే ఇందులోని ఎన్‌ఎస్‌–3 ప్రొటీన్‌ నకళ్ల తయారీలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. అంతేకాకుండా ఎన్‌ఎస్‌–3 ప్రొటీన్‌ కణానికి శక్తిని అందించే మైటోకాండ్రియా మ్యాట్రిక్స్‌లోకి ప్రవేశించి జీఆర్‌పీఈఎల్‌1 అనే ప్రొటీన్‌ను ముక్కలు చేస్తోందని, ఇది కాస్తా మైటోకాండ్రియా పనితీరుపై ప్రభావం చూపుతున్నట్లు తాము గుర్తించామని వారు వివరించారు. ఈ కారణంగానే రక్తంలోని ప్లేట్‌లెట్లు తగ్గిపోతున్నాయన్నది తమ అంచనాగా వారు చెప్పారు. జీఆర్‌పీఈఎల్‌1 ప్రొటీన్‌ ఆధారంగా డెంగీకి సమర్థమైన మందులు తయారు చేసేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని అన్నారు. మానవ, జంతు సంబంధిత వైరస్‌ మైటోకాండ్రియాలోని ప్రొటీన్లతో చర్య జరుపుతున్నట్లు తెలియడం ఇదే మొదటిసారి అని, కరోనా కారక వైరస్‌లోనూ ఇదేమాదిరిగా జరుగుతుండవచ్చని తెలిపారు. పరిశోధన వివరాలు జర్నల్‌ ఆఫ్‌ వైరాలజీ సంచికలో ప్రచురితమయ్యాయి. 
 

మరిన్ని వార్తలు