దూరం..దూరం

14 Dec, 2018 10:26 IST|Sakshi

పోలింగ్‌లో పాల్గొనని హైదరాబాద్‌ జిల్లా ఓటర్లు

సగం మందికి పైగా ఓటింగ్‌పై విముఖత  

2014 కంటే ఓటర్లు పెరిగినా తగ్గిన పోలింగ్‌

ఖైరతాబాద్, సనత్‌నగర్‌ మహిళా ఓటర్లకు జై

కార్వాన్‌లో పురుషులకు జిందాబాద్‌

సాక్షి, సిటీబ్యూరో: విద్యావంతులు.. సామాజిక చైతన్యం మెండుగా ఉన్న రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌ జిల్లాలో లక్షల మంది పోలింగ్‌పై విముఖత చూపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయనివారు జిల్లాలో లక్షల్లో ఉన్నారు. ఓటింగ్‌పై అధికారులు ఎంత ప్రచారం చేసినా, ఎన్నికల చైతన్య కార్యక్రమాలు నిర్వహించినా మొత్తం ఓటర్లలో సగం మంది కూడా పోలింగ్‌ బూత్‌ల వైపు చూడలేదంటే అతిశయోక్తి కాదు. జిల్లా మొత్తం ఓటర్లు 40,57,450 మంది కాగా, వీరిలో ఓట్లు వేసింది 20,17,759 మంది మాత్రమే. మిగతా 20,39,691 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 2014లో 39,65,284 మంది ఓటర్లున్నప్పుడు ఓటు వేసిన వారికంటే.. ఇప్పుడు ఓటు వేసిన వారు మరీ తక్కువగా ఉండడం ప్రజాస్వామ్యానికే మచ్చగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఇప్పుడు ఓటర్లు పెరిగారు. అందుకు తగ్గట్టుగా ఓటు వేసేవారు కూడా పెరగాలి. కానీ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాల్లో అప్పటి కంటే తక్కువ మంది మాత్రమే పోలింగ్‌ బూత్‌లకు వెళ్లారు. మలక్‌పేట, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో మాత్రం అప్పటి కంటే ఇప్పుడు ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకుని విజ్ఞత చాటుకున్నారు. కార్వాన్‌ నియోజకవర్గంలో మాత్రం పురుషులు అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ మంది ఓటు వేశారు. ఖైరతాబాద్, సనత్‌నగర్‌ నియోజకవర్గాల్లో మహిళలు ఎక్కువమంది ఓట్లు వేశారు. మిగతా నియోజకవర్గాల్లో అప్పటికంటే ఓటర్లు పెరిగినప్పటికీ.. ఓట్లు వేసిన వారు మాత్రం బాగా తగ్గిపోయారు.

నియోజకవర్గాల వారీగా ఓటు వేసినవారిని పరిశిలిస్తే..  
ముషీరాబాద్‌ నియోజకవర్గంలో 2014లో 81,493 మంది పురుషులు ఓటు వేస్తే తాజా ఎన్నికల్లో 74,225 మంది మాత్రమే ఓటు వేశారు. మహిళలు అప్పట్లో 68,504 మంది ఓటు హక్కు వినియోగించుకోగా ఇప్పుడు 66,493 మంది మాత్రమే ఉన్నారు. అంబర్‌పేటలో గతంలో 78,565 మంది పురుషులు ఓటు వేయగా, ఇప్పుడు 70,664 మందికి తగ్గిపోయారు. మహిళలు సైతం గత ఎన్నికల్లో 68,117 మంది ఓటు వేయగా, ఇప్పుడు 64,226 మంది మాత్రమే ఉన్నారు. ఖైరతాబాద్‌లో పురుషులు అప్పుడు 78,314 మంది, ఇప్పుడు 74,461 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. మహిళలు అప్పుడు 65,177 మంది కాగా ఇప్పుడు అంతకంటే ఎక్కువగా 66,815 మంది ఓటు వేశారు. జూబ్లీహిల్స్‌లో పురుషులు గత ఎన్నికల్లో 92,415 కాగా, ఇప్పుడు 83,585 మందికి తగ్గిపోయారు. సనత్‌నగర్‌లో పురుషులు గతంలో 68,641 మంది, ఇప్పుడు 62,613 మంది, మహిళలు 56,097 మంది నుంచి 57,054 మందికి పెరిగారు. సికింద్రాబాద్‌లో గత ఎన్నికల్లో 72,222 పురుషులు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లగా ఇప్పడు 67,607 మందికి తగ్గిపోయారు. మహిళలు గతంలో 64,327 మంది, ఇప్పుడు 63,967 మంది పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లారు. కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో 67,228 మంది పురుషులు ఓట్లు వేస్తే, ఇప్పుడు 59,804 మందికి పడిపోయారు. మహిళలు అప్పుడు 58,338 మంది, ఇప్పుడు 57,785 మంది మాత్రమే ఓట్లు వేశారు.

పాతబస్తీ పరిధిలో ఇలా..
ఈ ప్రాంతంలో పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే మలక్‌పేట, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో అప్పటి కంటే ఇప్పుడు ఎక్కువమంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మలక్‌పేటలో 2014లో 64,804 మంది పురుషులు మాత్రమే ఓటు వేయగా, ఇప్పుడు 66,123 మందికి పెరిగారు. మహిళలు అప్పట్లో 56,833 మంది మాత్రమే ఓటు వేయగా.. ఈ ఎన్నికల్లో 59,320 మందికి పెరిగారు. ఇక  చాంద్రాయణగుట్టలో గతంలో 71,533 మంది పురుషులు ఓటు వేస్తే.. తాజాగా ఆ సంఖ్య 74,767 మందికి పెరిగింది. మహిళా ఓటర్ల సంఖ్య కూడా 64,601 మంది నుంచి 65,072 మందికి పెరింగింది. కార్వాన్‌లో పురుషులు అప్పుడు 72,472 మంది ఓటు వేయగా>.. ఇప్పుడు 88,992 మంది ఓటు వేసి వివేకవంతులనిపించుకున్నారు. మహిళా ఓటర్ల సంఖ్య మాత్రం 86,696 మంది నుంచి 76,299 మందికి తగ్గిపోయింది. గోషామహల్‌ నియోజకవర్గంలో పురుషులు అప్పుడు 87,386 మంది, ఇప్పుడు 77,822 మంది ఓట్లు వేశారు. మహిళలు అప్పుడు 71,164 మంది, ఇప్పుడు కేవలం 58,820 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. చార్మినార్‌లో పురుషులు గత ఎన్నికల్లో 61,312 మంది ఓటు వేయగా, ప్రస్తుత ఎన్నికల్లో 56,218 మంది, మహిళలు 48,139 మంది నుంచి 44,578 మందికి తగ్గిపోయారు. యాకుత్‌పురాలో పురుషులు గతంలో 77,193 మంది, ఇప్పుడు 76,087 మంది, మహిళలు 67,493 మంది నుంచి 65,082 మందికి తగ్గిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బహదూర్‌పురాలో 74,246 మంది పురుషులు ఓటు వేయగా, ఇప్పుడు 72,243 మందికి తగ్గింది. మహిళల సంఖ్య కూడా 62,120 మంది నుంచి, 57,951 మందికి పడిపోయింది. 

2014లో హైదరాబాద్‌ జిల్లాలో 11,23,826 మంది పురుషులు ఓట్లు వేస్తే 2018 ఎన్నికల్లో 10,80,236 మంది మాత్రమే ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే మహిళలు గత ఎన్ని కల్లో 9,74,742 మంది ఓటు వేయగా, ఈసారి ఆ సంఖ్య 9,37,491 మందికి తగ్గిపోయింది.

మరిన్ని వార్తలు