ఎంజే మార్కెట్‌: ప్రస్తుత పరిస్థితి ఇది

27 Apr, 2020 19:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగర వాసులు యథేచ్ఛగా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని కొన్ని మీడియా చానళ్లలో వచ్చిన కథనాలపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. పాతబస్తీలోని ఎంజే మార్కెట్‌, జంబాగ్‌ ప్రాంతాల్లో ప్రజలు విచ్చలవిడిగా రోడ్డు మీదకు వస్తున్నారని కొన్ని వార్తా చానళ్లు ప్రసారం చేశాయి. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని ఈస్ట్‌ ‌జోన్‌ డీసీపీ ఎం. రమేశ్‌ తెలిపారు. ‘లాన్‌డౌన్‌ ఉల్లంఘన గురించి భయాలు సృష్టిస్తూ ఎంజే మార్కెట్, జంబాగ్ ప్రాంతాలకు చెందిన పాత చిత్రాలు మీడియాలో ప్రసారం చేయబడ్డాయి. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రస్తుత చిత్రాలను చూడమని చెప్పండి. మిమ్మల్ని రక్షించడానికి మేము అక్కడ ఉన్నాము, ఎల్లప్పుడూ ఉంటాము. దయచేసి అబద్దపు ప్రచారాన్ని నమ్మకండి, వ్యాప్తి చేయకండి’ అంటూ ఈస్ట్‌ ‌జోన్‌ డీసీపీ రమేశ్‌ ట్వీట్‌ చేశారు. అక్కడ ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన ఫొటోలను కూడా ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశారు. (ఐదు రాష్ట్రాల్లో కరోనా లేదు: కేంద్రం)

లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో అనవసరంగా రోడ్ల మీదకు వస్తున్న వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. విపత్తు నిర్వహణ చట్టం ఉల్లంఘన కింద కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలకు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో భారీ సంఖ్యలో వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. కరోనా మహమ్మారి కట్టడికి ప్రజలందరూ సహకరించాలని, అనవసరంగా బయటకు రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

చదవండి: బయటకు రావాలంటే భయం

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు