మహిళలకు తోడుగా ‘ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌’

13 Dec, 2018 09:32 IST|Sakshi
ర్యాలీని ప్రారంభిస్తున్న సెంట్రల్‌ జోన్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ , మహిళా కానిస్టేబుళ్ల బైక్‌ ర్యాలీ

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌

పెట్రోలింగ్‌ వ్యవస్థలో మహిళా కానిస్టేబుళ్లు

నెక్లెస్‌ రోడ్డులో ర్యాలీ

ఖైరతాబాద్‌:     నగరం పోలీసు విభాగంలో షీ టీమ్స్‌ తరహాలోనే పెట్రోలింగ్‌ వ్యవస్థలో ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌ కూడా కీలకంగా మారుతుందని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ అన్నారు. బుధవారం సాయంత్రం నెక్లెస్‌ రోడ్డు పీపుల్స్‌ ప్లాజా వేదికగా ప్రత్యేకంగా శిక్షణ పొందిన 20 మంది మహిళా కానిస్టేబుళ్లను ‘‘ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌’’ విధుల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన బైక్‌ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పెట్రోలింగ్‌ వ్యవస్థలో మహిళా కానిస్టేబుళ్లతో ‘ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌’ పేరుతో పెట్రోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. షీ టీమ్స్‌ తరహాలోనే పెట్రోలింగ్‌ వ్యవస్థలో పురుషులకు సమానంగా మహిళలను నియమిస్తున్నారు.

వారికి రెండు నెలల పాటు డ్రైవింగ్‌ స్కిల్స్, ఇంటర్న్‌షిప్, ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రజల్లోకి పంపుతున్నట్లు తెలిపారు. విదేశాల్లో ఈ తరహా పోలీసింగ్‌ కీలక భూమిక పోషిస్తుందన్నారు. ఇప్పటివరకు మహిళా కానిస్టేబుళ్లు కౌన్సిలింగ్, రిసెప్షనిస్ట్‌లుగా మాత్రమే పరిమితమయ్యారన్నారు. ఎన్టీఆర్‌గార్డెన్, లుంబినీపార్క్, సంజీవయ్యపార్క్, మాల్స్‌ తదితర ప్రాంతాల్లో  మహిళలు ఈవ్‌టీజింగ్‌ తదితర ఇబ్బందులు ఎదుర్కొటున్నట్లు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఉమెన్‌ పెట్రోలింగ్‌ సిబ్బందితో మహిళలు వారి సమస్యలను నేరుగా చెప్పుకునేందుకు వీలవుతుందన్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు ‘ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. సెంట్రల్‌ జోన్‌ పరిధిలో 20మంది కానిస్టేబుళ్లు అవగాహన కల్పించేందుకు పీపుల్స్‌ ప్లాజా నుంచి ఐమాక్స్‌ రోటరీ చౌరస్తా, లుంబినీపార్క్, ట్యాంక్‌బండ్‌ తదితర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. సైఫాబాద్, పంజగుట్ట, బంజారాహిల్స్, చిక్కడపల్లి, ఆబిడ్స్, లేక్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో వీరు విధులు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో షీ టీమ్స్‌ ఏసీపీ నర్మద, సైఫాబాద్‌ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, సైఫాబాద్‌ ఇన్స్‌స్పెక్టర్‌ చింతల సైదిరెడ్డి, సీసీఎస్‌ అడ్మిన్‌ పూర్ణచందర్, నాంపల్లి రాజేష్, రాంగోపాల్‌పేట్‌ బాబు ఇన్స్‌ప్పెక్టర్లు పాల్గొన్నారు.  

సమస్యలను ధైర్యంగా చెప్పుకోవచ్చు
మహిళలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు 100కు డయల్‌చేసిన వెంటనే పెట్రోలింగ్‌ విధుల్లో ఉండే పురుషులు సంఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు వారి సమస్యలను నేరుగా చెప్పలేకపోవచ్చు. ఆ విధుల్లో మేము ఉండటం వల్ల వారు ధైర్యంగా వారి ఇబ్బందులు మాతో చెప్పుకోగలరు. విధులను చాలెంజ్‌గా తీసుకుంటా.– పుష్యమిత్ర, చాంద్రాయణగుట్ట పీఎస్‌  

కొత్త ఒరవడికి శ్రీకారం
ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌ అనే కొత్త వరవడికి శ్రీకారం చుట్టి అందులో భాగంగా మాకు రెండు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రజలకు నేరుగా సేవచేసేందుకు ఇదో మంచి అవకాశం.
– నాగకుమారి, చాంద్రాయణగుట్ట పీఎస్‌

మరిన్ని వార్తలు