చేతులు కలిపారు... చెరువును శుభ్రం చేశారు..

30 Sep, 2019 08:21 IST|Sakshi
కింగ్‌ఫిషర్‌ చెరువులో ప్లాస్టిక్‌ వ్యర్థాలు తొలగిస్తున్న సొసైటీ సభ్యులు

యానిమల్‌ వారియర్స్‌ కన్సర్వేషన్‌ సొసైటీ సభ్యుల చొరవ

కింగ్‌ఫిషర్‌ చెరువులో ప్లాస్టిక్‌ వ్యర్థాల తొలగింపు  

సాక్షి, హైదరాబాద్‌: ‘పరుగు పెట్టండి.. ప్లాస్టిక్‌ వ్యర్థాలు తొలగించండి’ ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో చెప్పిన మాట. శరీర ఆరోగ్యానికి పరుగు ముఖ్యమని, అదే సమయంలో రోడ్డుపై కనిపించే ప్లాస్టిక్‌ వ్యర్థాలను తీసి చెత్తకుండీలో వేయాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకు రిపుదమన్‌ బెల్వి అనే యువకుడు చేపట్టిన ఈ తరహా ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ స్వయంగా అతడికి ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. దానిని ఆదర్శంగా తీసుకోవాలని మోదీ పేర్కొన్నారు.  ఇప్పుడు ఇదే తరహాలో నగరానికి చెందిన 10 మందితో కూడిన యువ బృందం ఓ చెరువును తమ స్థాయిలో శుభ్రపరిచి ఆకట్టుకున్నారు. ‘యానిమల్‌ వారియర్స్‌ కన్సర్వేషన్‌ సొసైటీ’ సభ్యులు నగర శివారులోని అమీన్‌పూర్‌ చెరువుకు చేరువలో ఉన్న కింగ్‌ఫిషన్‌ చెరువును శుభ్రం చేశారు. సొసైటీ ఫౌండర్‌ ప్రదీప్‌ నాయర్‌ ఆధ్వర్యంలో సంజీవ్‌ వర్మ, సంతోషి, ప్రభు, మనీష్, పవన్, అనిరుధ్, అనురుధ్‌ సహదేవ్, నమ్రత, పూజిత, రాఘవ్‌ తదితరులు చెరువు నుంచి 12 బస్తాల ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించారు.

ఉదయపు వ్యాయామంలో భాగంగా ఆ చెరువు వద్దకు వెళ్లిన వారు అది ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోయినట్లు గుర్తించారు. దీంతో జాలరులకు చెందిన రెండు తెప్పలను తీసుకుని చెరువులోకి వెళ్లి ప్లాస్టిక్‌ వ్యర్థాలు తొలగించారు. ‘ఈ చెరువు సహజ అందాలకు నెలవు. ఇక్కడికి విదేశీ పక్షులు క్రమం తప్పకుండా వలస వస్తాయి. అయితే దీనిపై అవగాహన లేక స్థానికులు ప్లాస్టిక్‌ వ్యర్ధాలను అందులో డంప్‌ చేస్తుండటంతో చెరువు కాలుష్య కాసారంగా మారింది. ఇది వలస పక్షుల రాకపై ప్రభావం చూపనుంది. అందుకే మాకు చేతనైన స్థాయిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు తొలగించాం’ అని సొసైటీ సభ్యుడు సంజీవ్‌ వర్మ పేర్కొన్నారు. కొందరు తాగుబోతులు ఈ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని మద్యం తాగేందుకు ప్లాస్టిక్‌ గ్లాసులు తెచ్చి నిత్యం చెరువులో పడేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిని అరికట్టాలని సంబంధిత అధికారులను కోరారు.  అమీన్‌పూర్‌ శివారులోని చిట్టడివిలో సమీపంలోని ప్రాంతాల చిన్నారులతో సభ్యులు మోగ్లీ వాక్‌ నిర్వహించారు. పర్యావరణం, ప్రకృతి, జీవవైవిధ్యం, పక్షులపై చిన్నారులకు అవగాహన కల్పించారు. గతంలో మన చుట్టూ పక్షులు ఎలా ఉండేవో, ఇప్పుడు ఎందుకు తగ్గిపోయావో, అవి అంతరించకుండా మనం తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. 

మరిన్ని వార్తలు