మూగప్రేమ.. నిత్య సేవ

22 May, 2020 11:00 IST|Sakshi

లాక్‌డౌన్‌లో ప్రజలతో పాటు మూగజీవాలకూ ఇబ్బందులు తప్పలేదు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో ఆకలికిఅలమటించాయి. నిత్యం వాటి సమాచారం తెలుసుకొని ఉదయాన్నే వాటికోసం ఆహారం సిద్ధం చేసి అందిస్తున్నారు సర్వజీవా సొసైటీ సభ్యులు. సేవలను ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించారు. సంస్థకు చెందిన వలంటీర్లు నిత్యం వాటికి ఆహారం పెడుతూ సేవలు అందిస్తున్నారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు మరింత విస్తృతంగా సేవలు కొనసాగుతాయని సంస్థ నిర్వాహకులు తెలిపారు.

జూబ్లీహిల్స్‌: ఇంజినీర్‌ శివప్రకాష్‌ నేరేడ్‌మెట్‌లో ఆటోమొబైల్‌ వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నారు. చిన్ననాటి నుంచే మూగజీవాలపై  ప్రేమతో వాటికి సేవలు అందిస్తున్నారు. మూగజీవాలపై కరుణ చూపే నగరానికి చెందిన వ్యాపారవేత్త   లక్ష్మిభూపాల్‌తో కలిసి చాలాకాలంగా మూగజీవాలకు ఆహారం అందించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న తన షెడ్‌ను జీవాలకు ఆహారం అందించే కేంద్రంగా మార్చివేశారు. మార్చి 28వ తేదీన సైనిక్‌పురి ప్రాంతంలో 100 వీధి కుక్కలకు ఆహారం అందించడంతో లాక్‌డౌన్‌ సమయంలో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. క్రమంగా విస్తరించుకుంటూ నగరవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు. మూగజీవాలపై ప్రేమతో నగరం నలుమూలలా దాదాపు 250మంది వలంటీర్లు సంస్థకు తమవంతు సేవలు అందిస్తున్నారు. కీసరగుట్ట ఆలయం వద్ద కుక్కలకు, కోతులకు, గోశాలలోని ఆవులకు ఆహారం అందిస్తున్నారు. ఉప్పల్‌ మున్సిపాలిటీ వెటర్నటీ విభాగంతో కలిసి పనిచేస్తున్నారు. 

ఉదయం నుంచే సేవలు ప్రారంభం
నిత్యం ఉదయం 4.30 గంటలకే కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మార్కెట్లలో ధాన్యాలు, పండ్లు, కూరగాయలు కొనుగోలు చేయడం, వండించడం, ఆహారాన్ని వలంటీర్లకు అందించడం వారి ద్వారా పంపిణీ చేయించడం చేస్తున్నాం. వ్యాధులకు గురవుతున్న ఆవులు, గేదెలకు వైద్యం చేయిస్తున్నాం. ప్రస్తుతం అందిస్తున్న సేవలకు నిత్యం రూ.15 వేల వరకు ఖర్చు అవుతోంది. దాతలు, స్నేహితుల సహకారంతో లాక్‌డౌన్‌ ముగిసి సాధారణ పరిస్థితులు వచ్చేవరకు ఆహార సరఫరా కొనసాగించేందుకు కృషి చేస్తున్నాం.– శివప్రకాష్, నిర్వాహకులు, సర్వజీవా సొసైటీ సేవా సంస్థ.

మరిన్ని వార్తలు