సిటీ సైక్లిస్ట్స్‌ @ ప్యారిస్‌

7 Sep, 2019 12:04 IST|Sakshi

ఆఫీసులో గంటల కొద్దీ కూర్చుని కూర్చుని అలవాటైపోయింది. నాలుగు మెట్లు ఎక్కితే చాలు మోకాళ్లు పట్టేస్తున్నాయి ఇక డాక్టర్‌ సలహా మేరకు సైక్లింగ్‌ ఎక్కడ చేస్తాం? అంటూ నిరుత్సాహపడిపోయే ఎందరో సిటీజనుల మధ్యలో కొందరుంటారు. రోజూ పది, ఇరవై...కిలోమీటర్లు అలవోకగా సైక్లింగ్‌ చేసేస్తూంటారు. మరికొందరు మరింత ముందుకెళ్లి వంద, వేయి కిలోమీటర్లకూ సై అంటారు. అలా సై రా అన్న సిటీ యువత ప్యారిస్‌ వేదికగా తమ సైక్లింగ్‌ సత్తా ప్రదర్శించారు. ప్రపంచపు అత్యంత లాంగెస్ట్‌ సైక్లింగ్‌ రైడ్‌... ప్యారిస్‌–బ్రెస్ట్‌–ప్యారిస్‌ (పి.బి.పి)ఈవెంట్‌లో సిటీ దమ్ము చూపి దుమ్ము లేపారు. 

సాక్షి, సిటీబ్యూరో: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు అనగానే ఏసీ గదుల్లో... సిస్టమ్‌ని వదలని వేళ్లూ, సీటు నుంచి కదలని కాళ్లూ, ఐదారంకెల జీతాలూ వారాంతాపు పబ్బుల్లో నృత్య గీతాలూ..అంతేనా..అంటే కాదు ఇంకా ఎంతో ఉంది అంటున్నారు సిటీ ఐటీ పీపుల్‌. తమలోని క్రీడా‘సక్తి’కి సానబెడుతున్నారు. హాబీగా మొదలుపెట్టిన ఆటల్లో రాణిస్తూ క్రీడాకారులకు మాత్రమే సాధ్యమయే విజయాలను స్వంతం చేసుకుంటున్నారు. నగరం నుంచి ప్యారిస్‌ వెళ్లి పీబీపీ ఈవెంట్‌లో పాల్గొన్న యువబృందం అందుకో ఉదాహరణ.  

ఏమిటీ పీబీపీ?
ఫ్రాన్స్‌ రాజధాని నగరం, ఫ్యాషన్‌/ఆర్ట్‌ క్యాపిటల్‌ ప్యారిస్‌ గురించి తెలియనివాళ్లు ఉండరు. అలాంటి గ్లామరస్‌ సిటీలో జరిగే ప్రపంచ ప్రసిద్ధ ఈవెంట్‌ ప్యారిస్‌–బ్రెస్ట్‌–ప్యారిస్‌ (పీబీపీ). సైక్లిస్టుల కోసం 1891లో ఈ ఈవెంట్‌ రూపుదిద్దుకుంది. ప్యారిస్‌ నుంచి బ్రెస్ట్‌కి వెళ్లి తిరిగి పారిస్‌కి వచ్చే  ప్యారిస్‌–బ్రెస్ట్‌–ప్యారిస్‌ లేదా పీబీపీ అంటారు. నాలుగేళ్లకి ఓసారి నిర్వహించే ఈ ఈవెంట్‌లో పాల్గొనడాన్ని సైక్లిస్టులు చాలా ప్రిస్టేజియస్‌గా భావిస్తారు. ఈ ర్యాండనీరింగ్‌ ఈవెంట్‌లో సైక్లిస్టులు కేవలం 90 గంటల్లో 1230 కి.మీ. దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దీనిలో పాల్గొనడం అంత సులభమేమీ కాదు. పాల్గొనడానికి ముందు ఏడాది 100 కిలో మీటర్ల సైక్లింగ్‌ నుంచి 200, 300, 400, 600 కి.మీ దాకా క్రమం తప్పకుండా సాధించి ఆ వివరాలను అందజేసిన తర్వాతే పీబీపీలో పాల్గొనేందుకు అర్హత వస్తుంది. మన నగరంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సైక్లిస్టులు ఎక్కువ సంఖ్యలో ఉన్న నగరాల్లో పీబీపీ తరపున ఈ ప్రక్రియను ఆడెక్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ప్యారిస్‌ నిర్వహిస్తుంది. పీబీపీ తరపున ఆడెక్స్‌ ఇక్కడ రైడ్స్‌ నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈవెంట్‌లో 75 దేశాలకు చెందిన 7 వేల మంది సైక్లిస్టులు పాల్గొన్నారు. 

సై అన్న సిటీ...
నగరం నుంచి దాదాపుగా 50 మంది ఈ ఈవెంట్‌లో పాల్గొనడానికి ప్రయత్నిస్తే...26 మంది అవసరమైన అర్హత సాధించగలిగారు. వీరంతా గత ఆగస్టు 18 నుంచి 22 వరకు ప్యారిస్‌లో జరిగిన ఈవెంట్‌కి హాజరయ్యారు. అయితే అక్కడి అత్యంత చలి వాతావరణం, ఫుడ్‌...వంటి వాటిని తట్టుకోలేక వెళ్లిన 26 మందిలో 19 మంది ఈవెంట్‌కి ముందే గుడ్‌బై చెప్పేశారు. మిగిలిన ఏడుగురిలో ముగ్గురు విజయవంతంగా లక్ష్యాన్ని చేధించగలిగారు. మిగిలిన నలుగురు (రాజా శబరీష్, నవీన్, ప్రసాద్‌ రాజు, గౌతమ్‌రెడ్డి)విజయవంతంగా  పూర్తి చేసి ఫినిషర్స్‌ మెడల్స్‌ అందుకున్నారు. విజేతలైన గచ్చిబౌలి నివాసితులు సంజయ్‌ యాదవ్, సిద్ధార్ధ, చైతన్య ముగ్గురూ పాతికేళ్ల లోపు వాళ్లే కావడం, ఐటి ఉద్యోగులే కావడం విశేషం.   

కఠినమే..కాని కంప్లీట్‌ చేశా
ఇది అత్యంత సంక్లిష్టమైన రైడ్‌. అయితే సైక్లింగ్‌లో కొన్నేళ్లుగా అలవాటు ఉండబట్టి ఎలాగైతేనేం ఈ ఈవెంట్‌లో విజయం సాధించా. అమెరికాలో ఉండబట్టి నాకు ఇక్కడి చలి వాతావరణం అంతగా ఇబ్బంది పెట్టలేదు. నేను రోజులో ఎక్కువ టైమ్‌ సైక్లింగ్‌ చేస్తుంటాను. అది బాగా యూజ్‌ అయింది.  –చైతన్య

బర్త్‌ డే గిఫ్ట్‌...
టఫెస్ట్‌ రైడ్‌ ఇది. ఇంత సుదూరపు సైక్లింగ్‌ ఎప్పుడూ చేయలేదు. కాని అందుకేనేమో ఇది చాలా సంతృప్తిని అందించింది. నిద్రను బాగా మేనేజ్‌ చేయగలగడం నాకు బాగా హెల్ప్‌ అయింది.  నెక్టŠస్‌ వీక్‌ నా బర్త్‌డే సో.. ఈ విజయం నాకు నేను ఇచ్చుకున్న బెస్ట్‌ బర్త్‌డే గిఫ్ట్‌ అనుకుంటున్నా. –సిద్ధార్ద్‌

92 గంటలు పట్టింది...
ఈ ఈవెంట్‌లో పాల్గొనడం దగ్గర్నుంచి అన్నీ కష్ట సాధ్యాలే. అయినా పట్టుదలగా ప్రయత్నించాం. పూర్తి స్థాయి లక్ష్యంతో పాటు సైక్లింగ్‌ చేస్తూ ప్రతి 100 కి.మీకి కాస్త అటూ ఇటూగా ఉండే ఉండే 12 చెక్‌పాయింట్స్‌ని కూడా టైమ్‌ ప్రకారం రీచ్‌ కావాలి. రోడ్లు చాలా ఎత్తు పల్లాలతో ఉంటాయి. మనం నగరంలో చేసే ప్రాక్టీస్‌ని పూర్తిగా నమ్ముకుంటే దీన్ని పూర్తిచేయలేం. రాత్రి ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. నేను 92 గంటల్లో గమ్యాన్ని చేరుకుని ఫినిషింగ్‌ మెడల్‌ అందుకున్నా.   –గౌతమ్‌రెడ్డి

ఇంకో 5 గంటలు ఉండగానే...
సైక్లింగ్‌ గత ఏడాది స్టార్ట్‌ చేశాను. ఈ ఈవెంట్‌కు ముందు చాలా లాంగ్‌ రైడ్స్‌ చేయడం అలవాటైంది. ముఖ్యంగా శంషాబాద్‌ టు లేపాక్షి (బెంగళూర్‌ దగ్గర) తిరిగి శంషాబాద్‌...1000 కి.మీ రైడ్‌ పూర్తి చేశాక ఈ ఈవెంట్‌లో పార్టిసిపేట్‌ చేయగలమని మరింత నమ్మకం వచ్చింది. ఫ్రెంచ్‌ పీపుల్, వారి ఆత్మీయత మమ్మల్ని ఆదరించిన తీరు చాలా తృప్తిని అందించింది. ఈరైడ్‌ని నేను వాళ్లిచ్చిన టైమ్‌ కంటే చాలా ముందుగానే అంటే 85 గంటల 10 నిమిషాల్లోనే పూర్తి చేయగలిగా. భవిష్యత్తులో లండన్‌లోని ఎడిన్‌బర్గ్‌లో జరిగే ఎల్‌ఇఎల్‌ రైడ్‌లో పాల్గొనాలి అనుకుంటున్నా.  –సంజయ్‌ యాదవ్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా