పరభాషను ఒడిసిపట్టి.. వైవిధ్య కొలువు తలుపుతట్టి!

29 Jun, 2014 06:21 IST|Sakshi
పరభాషను ఒడిసిపట్టి.. వైవిధ్య కొలువు తలుపుతట్టి!

విదేశీ భాషలను నేర్చుకోవడంలో ముందుంటున్న నగర యువత
 మాతృభాష.. మనిషి మేధో వికాసానికి విలువైన వారధి! అలాంటి అమ్మ భాష ఆసరాగా విద్యా సుమాలను అందుకుంటూ, పరభాషలో ప్రావీణ్యం పెంచుకుంటోంది భాగ్యనగరం యువత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచీకరణ.. ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చుతున్న వేళ.. విదేశీ భాషా నైపుణ్యాలున్న వారికి కార్పొరేట్ ప్రపంచం ఆకర్షణీయ వేతనాలతో స్వాగతం పలుకుతోంది. అందుకే విదేశీ భాషను ఒడిసిపట్టి, వైవిధ్యమైన కొలువును చేజిక్కించుకుంటామంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.
 
 హైదరాబాద్.. ఐటీ రంగంలో దూసుకెళ్తుతున్న నగరం. అనేక విదేశీ కంపెనీలు భాగ్యనగరంలో ప్రవేశించి వ్యాపార కార్యకలాపాలను విస్తరింపజేసుకుంటున్నాయి. ఇక్కడి కంపెనీలు కూడా విదేశీ కంపెనీలతో జతకడుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీల మధ్య పరస్పర అవగాహన ఒప్పందాలు, ప్రాజెక్టుల అప్పగింత వంటి కార్యకలాపాలు సజావుగా సాగేందుకు విదేశీ భాషా నైపుణ్యాలున్నవారు అవసరమవుతున్నారు. విదేశాల్లో చదువుకొని అక్కడే కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకున్నవారు అధికమయ్యారు. ఇలాంటి వారు కూడా ఫారెన్ లాంగ్వేజ్‌లను నేర్చుకుంటున్నారు.  నగరానికి చెందిన భార్యభర్తలు ఇద్దరూ ఐటీ ప్రొఫెషనల్స్. ఓ కంపెనీలో గత రెండేళ్లుగా పనిచేస్తున్నారు.
 
 ఇద్దరూ ప్రముఖ కంపెనీ అడోబ్‌కు దరఖాస్తు చేసుకుంటే.. జర్మన్ భాషా పరిజ్ఞానం కలిగిన భార్యకు కంపెనీని నుంచి ఆఫర్ వచ్చింది. దాంతో భర్తకు కూడా జర్మనీ నేర్పించే పనిలో పడింది ఆ ఇల్లాలు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏలు చదివి ప్రముఖ కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్స్‌కు ఫ్రెంచ్, జర్మనీ, జపనీస్, ఇటాలియన్, స్పానిష్ లలో ఏదో ఒక భాష వచ్చి ఉండటం కెరీర్ ఉన్నతికి, మరిన్ని ఉన్నత అవకాశాలు అందుకోవడానికి దోహదపడుతోంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని నగరంలోని పలు సంస్థలు విదేశీ భాషలకు సంబంధించి వివిధ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి.
 
 అదనపు అర్హత: ఒక్క ఐటీ కంపెనీల్లోనే కాదు.. బ్యాంకింగ్, విద్య, వైద్యం తదితర రంగాల్లో ఉద్యోగాలు సంపాదించేందుకు విదేశీభాషా నైపుణ్యాలు అదనపు అర్హతగా ఉపయోగపడతాయంటున్నారు ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ప్రొఫెసర్లు. కర్నూలు జిల్లా నుంచి నగరానికి వచ్చిన అనంతరాములు స్నేహితులతో కలిసి ‘లాటిన్’ నేర్చుకున్నాడు. విదేశీ బ్యాంకు హైదరాబాద్‌లో శాఖను ప్రారంభించి, ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది. ఓ ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూకు వచ్చిన వారితో పోల్చితే రాములుకు తక్కువ మార్కులు వచ్చినా, లాటిన్ భాష ప్రత్యేకత ఉన్న ఆయన్నే ఉద్యోగం వరించింది. ఇలా గ్రామీణ ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి వచ్చిన యువతకూ  విదేశీ భాషలు ఉద్యోగ అవకాశాలకు ఆయువుపట్టుగా మారుతున్నాయి.
 
 అవకాశాలు ఇలా: విదేశీ భాష కోర్సులను పూర్తిచేసిన వారిలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ట్రాన్స్‌లేషన్. విదేశీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపేందుకు, వ్యాపార నివేదికలు, ఒప్పంద పత్రాలు వంటి వాటిని తర్జుమా చేసేందుకు ట్రాన్స్‌లేటర్లు అవసరమవుతున్నారు. ఒకరి మాటలను అనువదించి మరొకరికి అప్పటికప్పుడు వినిపించడమే ఇంటర్‌ప్రెటర్స్ పని. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలకు ఇంటర్‌ప్రెటర్స్ అవసరం ఉంటుంది. సదస్సులు, ఒక దేశ వాణిజ్య బృందం మరొక దేశంలో పర్యటించే సమయంలోనూ ఈ నిపుణుల అవసరం ఏర్పడుతుంది.  
 
 విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించే క్రమంలో విమానయాన, పర్యాటక, ఆతిథ్య సంస్థలు ఉద్యోగ నియామకాల్లో విదేశీ భాషలు తెలిసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.  విదేశీ భాషల కోర్సులు పూర్తిచేసిన వారికి మరో ఉపాధి వేదికగా బోధన రంగం ఉంటోంది. విదేశీ భాషలను నేర్చుకోవాలనుకుంటున్న ఔత్సాహికులు ఎక్కువ కావడంతో..  ఫ్యాకల్టీకి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఆయా సంస్థలు.. తమ దగ్గర కోర్సులు పూర్తిచేసిన వారికి, వెంటనే భారీ వేతనాలతో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం పలు కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలలు విదేశీ భాషల కోర్సులను నిర్వహిస్తున్నాయి. విదేశీ భాషల్లో పట్టు సాధించినా, పూర్తిస్థాయి ఉద్యోగంపై ఆసక్తి లేని వారు ఫ్రీలాన్సింగ్ ద్వారా అధిక మొత్తాలను ఆర్జిస్తున్నారు. సొంతంగా భాష శిక్షణ కేంద్రాలను, ట్రాన్స్‌లేటింగ్, ఇంటర్‌ప్రెటింగ్ సేవల సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు.
 
 దూరవిద్యలో: విదేశీ భాషలు నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఇఫ్లూ ‘ది స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్’ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ, విదేశీ భాషలను నేర్పిస్తోంది. విదేశీ భాషలు నేర్చుకునేందుకు అవసరమైన పుస్తకాలను సైతం విక్రయిస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని జర్మనీ సాంస్కృతిక సంస్థ గోథె జంత్రం (ఎౌ్ఛ్టజ్ఛ్డ్ఛ్టిటఠఝ) జర్మన్ భాషను, అలియన్స్ ఫ్రాంచైజ్ ఫ్రెంచి భాషలో కోర్సులను అందుబాటులో ఉంచాయి. విద్యార్థుల రోజువారీ చదువులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు వీలుగా ఉదయం, సాయంత్రం బ్యాచ్‌లను నడుపుతున్నాయి. దోమలగూడలోని రామకృష్ణమఠం ఆధ్వర్యంలోని ‘వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్’.. ఏటా జనవరి, జూన్, సెప్టెంబరు నెలల్లో విదేశీ భాషల తరగతులను నిర్వహిస్తోంది. ఇక్కడ సంస్కృతం, హిందీతో పాటు ఇంగ్లిష్, జర్మన్, ఫ్రెంచి, జపనీస్, స్పానిష్ వంటి విదేశీ భాషలను నేర్పుతున్నారు. ఔత్సాహికులు తమకు అనువైన సమయాన్ని ఎంపిక చేసుకోవచ్చు. గతేడాది ఇక్కడ విదేశీ భాషలు నేర్చుకునేందుకు నాలుగు వేల మందికిపైగా ఆసక్తి కనబరచడం విశేషం.
 
 ఫీజులు:
 విదేశీ భాషలు నేర్చుకునేందుకు స్థాయిలనుబట్టి (లెవెల్ 1, లెవెల్ 2..) ఫీజులు వసూలు చేస్తున్నారు. సంస్థను బట్టి ఈ ఫీజులు రూ.1200 నుంచి రూ.5 వేల వరకు ఉంటున్నాయి. జర్మన్, ఫ్రెంచ్ భాషలకు అధిక ఫీజులుంటున్నాయి.
 
 ప్రముఖ సంస్థలు:
 హైదరాబాద్‌లో ప్రధాన క్యాంపస్‌ను కలిగిన ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)కి.. విదేశీ భాషల కోర్సుల నిర్వహణలో మంచి పేరుంది. ఇఫ్లూ.. జర్మన్, జపనీస్, రష్యన్, స్పానిష్, అరబిక్, ఫ్రెంచ్ వంటి భాషల కోర్సులను ఆఫర్ చేస్తోంది. బీఏ, ఎంఏ స్థాయిలో కోర్సులను అందిస్తోంది. రష్యన్, ఫ్రెంచ్ భాషల్లో పీహెచ్‌డీ కూడా ఉంది.
 వెబ్‌సైట్: www.efluniversity.ac.in
 రామకృష్ణమఠం: జర్మన్, ఫ్రెంచ్, జపనీస్, స్పానిష్ భాషల తరగతులు నిర్వహిస్తోంది.
 వెబ్‌సైట్: www.rkmath.org
 గోథె జంత్రం (Goethe-zentrum): జర్మన్‌లో ఎక్స్‌టెన్షివ్, ఇంటెన్షివ్ తదితర కోర్సులను అందిస్తోంది.
 వెబ్‌సైట్: www.goethe.de
 అలియన్స్ ఫ్రాంచైజ్: ఫ్రెంచ్ భాషలో శిక్షణ ఇస్తోంది.
 వెబ్‌సైట్: www.alliancefranchise.org
 
 విదేశీభాషపై పట్టు సులభమే
 ఇతర భాషలను నేర్చుకోవటమంటే.. వారి సంస్కృతీ, సంప్రదాయాలను అర్థంచేసుకోవటమే. కేవలం ఉద్యోగావకాశాలకేకాకుండా.. ఆయా దేశాల ప్రజల జీవనవిధానం, ఆచార వ్యవహారాలు, చరిత్ర తెలుసుకునే గొప్ప అవకాశం.  ఇఫ్లూలో యూజీ నుంచి పీహెచ్ డీ వరకూ కోర్సులున్నాయి. ఇవిగాకుండా బయటి విద్యార్థుల కోసం సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. వీటికి జనవరి-ఏప్రిల్, ఆగస్టు-నవంబరు నెలల్లో క్లాసులు ప్రారంభిస్తుంటాం. ప్రపంచీకరణ ప్రభావంతో విదేశీభాషలు నేర్చుకున్న వారికి ఉద్యోగ అవకాశాలకు ఢోకాలేదు. ఇఫ్లూలో బీఏ ఫైనలియర్‌లో ఉన్నప్పుడే ప్లేస్‌మెంట్స్ ద్వారా ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు.  టెలిమార్కెటింగ్, బీపీవో, బ్యాంకింగ్, విదేశీ మంత్రిత్వశాఖ, దుబాసీలుగా మంచి అవకాశాలున్నాయి. ఫ్రెంచి, జర్మన్, స్పానిష్, అరబిక్, జపనీస్ భాషలకు మంచి క్రేజ్ ఉంది. వీటిలో ఫ్రెంచ్, జర్మన్‌లదే హవా అని చెప్పాలి. ఇంగ్లిషును తేలిగ్గా నేర్చుకునే ఇక్కడి విద్యార్థులు మరికొంత శ్రమిస్తే.. విదే శీభాషలు అలవోకగా నేర్చుకోవచ్చు.
 -వెంకటరెడ్డి, రిజిస్ట్రార్(ఇఫ్లూ)

>
మరిన్ని వార్తలు