కుట్లేశారు.. కత్తెర మరిచారు..

10 Feb, 2019 02:30 IST|Sakshi

నిమ్స్‌ గ్యాస్ట్రోఎంటరాలజీవైద్యుల నిర్లక్ష్యం

ఆసుపత్రి ముందు రోగి బంధువుల ఆందోళన.. పోలీసులకు ఫిర్యాదు

ఇద్దరు డాక్టర్లపై కేసు నమోదు.. విచారణకు నిమ్స్‌ డైరెక్టర్‌ ఆదేశం

హెర్నియాతో బాధపడుతున్న బాధితురాలికి సర్జరీ

కడుపులో కత్తెర మరిచి కుట్లేసిన వైనం.. ఎక్స్‌రేతో వెలుగులోకి  

హైదరాబాద్‌/ సోమాజిగూడ: నగరంలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన నిమ్స్‌ (నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)లో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఇటీవల ఆసుపత్రిలోని గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం వైద్యులు ఓ మహిళకు ఆపరేషన్‌ చేసి కత్తెరను కడుపులోనే మరిచిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితురాలి తరపు బంధువులు పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేయడంతోపాటు శనివారం ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆపరేషన్‌ చేసిన ఇద్దరు వైద్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నిమ్స్‌ ముగ్గురు నిపుణులతో కమిటీ ఏర్పాటుచేసింది. దీని ఆధారంగా చర్యలు తీసుకుంటామని నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌ స్పష్టం చేశారు. 

ఆపరేషన్‌ సక్సెస్‌.. కానీ!
హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌కు చెందిన వ్యాపారి హర్షవర్దన్‌ భార్య మహేశ్వరి (33) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆమెను అక్టోబర్‌ 30న నిమ్స్‌ ఆసుపత్రి వైద్యులకు చూపించారు. మహేశ్వరిని పరిశీలించిన గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు డాక్టర్‌ వేణుమాధవ్, డాక్టర్‌ జగన్మోహన్‌రెడ్డిలు.. హెర్నియాతో ఆమెకు కడుపునొప్పి వస్తోందని గుర్తించి సర్జరీ చేయాలని సూచించారు. నవంబర్‌ 2న ఈ ఇద్దరు డాక్టర్లు ఆమెకు ఆపరేషన్‌ చేశారు. అయితే ఆపరేషన్‌ సమయంలో నిర్లక్ష్యంగా.. సర్జరీ చేసిన కత్తెరను కడుపులో మరిచిపోయి కుట్లు వేశారు. ఈ విషయం ఎవరూ గమనించలేదు.

రోగి కోలుకోవడంతో నవంబర్‌ 11న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. సర్జరీ జరిగి మూడునెలలైనా.. తరచూ కడుపునొప్పి వస్తుండటంతో బాధితురాలి కుటుంబం శుక్రవారం రాత్రి మళ్లీ నిమ్స్‌ వైద్యులను సంప్రదించింది. వైద్య పరీక్షల్లో భాగంగా ఎక్సరే తీయించగా, పొత్తి కడుపులో సర్జికల్‌ కత్తెర ఉన్నట్లు తేలింది. ఈ విషయం తెలియడంతో మహేశ్వరి భర్త, బంధువులు నిమ్స్‌ పరిపాలనాభవనం ముందు ఆందోళనకు దిగడంతో విషయం బయటికి పొక్కింది. ఈ ఆందోళనతో అప్రమత్తమైన వైద్యులు రోగికి మళ్లీ సర్జరీ చేసి కడుపులోని కత్తెరను బయటికి తీశారు. ప్రస్తుతం ఆమె ప్రాణాలకేమీ ప్రమాదం లేదు.

నిమ్స్‌ వైద్యులు నిర్లక్ష్యపూరిత వైఖరిపై రోగి తరపు బంధువులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. నిమ్స్‌ ఘటనపై వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో ఓ నివేదిక అందజేయాలని డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రోగికి సర్జరీ చేసే ముందు, ఆ తర్వాత.. ఆపరేషన్‌లో వినియోగించిన వైద్య పరికరాలు, ఇతర వస్తువులు లెక్కిస్తారు. బ్లేడ్స్, కత్తెర, కాటన్‌ బెడ్స్, ఇతర సర్జికల్‌ ఐటమ్స్‌ను విధిగా లెక్కించి, అన్నీ ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే కుట్లు వేస్తారు. కానీ నిమ్స్‌ ఆసుపత్రిలో ఇలాంటివేవీ జరగకుండానే పని పూర్తి చేస్తారనే ఆరోపణలున్నాయి.

దురదృష్టకరం
రోగి కడుపులో సర్జికల్‌ కత్తెర ఉంచి కుట్లు వేయడం దురదృష్టకరం. వైద్యపరమైన నిర్లక్ష్యానికి పాల్పడిన వారెంతటివారైనా ఉపేక్షించబోం. బాధ్యులను గుర్తించేందుకు ఆస్పత్రి డీన్, మెడికల్‌ సూపరింటిండెంట్, ఉస్మానియా ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ ప్రొఫెసర్‌తో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే సదరు వైద్యులపై చర్యలు తీసుకుంటాం. 
– డాక్టర్‌ మనోహర్, డైరెక్టర్, నిమ్స్‌

బాధ్యులపై చర్యలు తీసుకోండి
నిమ్స్‌కు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు ఉంది. కొంతమంది వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆస్పత్రి ప్రతిష్ట దెబ్బతింటోంది. వైద్యపరమైన నిర్లక్ష్యానికి పాల్పడుతున్న వైద్యులపై కఠినచర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.
– హర్షవర్థన్, బాధితురాలి భర్త

మరిన్ని వార్తలు