నాలుగు వారాల్లో వైరస్‌కు మందులు!

13 Jun, 2020 01:19 IST|Sakshi

త్వరలో అందుబాటులోకి రెమిడెస్‌విర్, ఫావిపిరావిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌

క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించిన సిప్లా, గ్లెన్‌మార్క్‌

భారత ప్రజలపై పనిచేస్తాయా అన్న కోణంలో పరిశోధనలు

డ్రగ్‌ కంట్రోలర్‌ అనుమతులిస్తే మార్కెట్‌లోకి వచ్చే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా చికిత్సకు ఇంకో నాలుగు వారాల్లో మందులు అందుబాటులోకి రానున్నాయా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. కరోనా చికిత్స కోసం రెమిడెస్‌విర్, ఫావిపిరావిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లు ఉపయోగపడతాయని హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) కొన్ని నెలల కిందటే గుర్తించింది. వీటిల్లో రెమిడెస్‌విర్, ఫావిపిరావిర్‌పై దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలైన సిప్లా, గ్లెన్‌మార్క్‌లు క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించాయి. ఈ మందులను ఉపయోగించిన 100 మంది రోగుల్లో కనీసం 60–70 శాతం మంది పరిస్థితి మెరుగు కాగా, మిగిలిన వారిలో పెద్దగా దుష్ఫలితాలు కనిపించలేదు. వైరస్‌ సోకిన తొలినాళ్లలో లేదా తేలికపాటి నుంచి ఓ మోస్తరు లక్షణాలు మాత్రమే ఉన్న రోగులకు ఫావిపిరావిర్, మధ్యమ స్థాయి నుంచి తీవ్ర లక్షణాలు ఉన్న వారికి రెమిడెస్‌విర్‌ వాడటం మంచిదన్న అంచనా బలపడింది.

ఫావిపిరావిర్‌ను జపాన్‌లో సుమారు 70 వేల మంది రోగులకు అందించి సత్ఫలితాలు రాబట్టారని, రష్యాలోనూ దీని వాడకానికి అనుమతులు లభించాయని ఓ శాస్త్రవేత్త తెలిపారు. భారత్‌లో ఫావిపిరావిర్‌తో పాటు రెమిడెస్‌విర్‌పై ముందుగా 50 మందిపై ప్రయోగాలు జరిగాయని, ఆ తర్వాత దీన్ని 150కు పెంచారని గత నెల 24న ప్రయోగ ఫలితాలను డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియాకు అందించడం పూర్తయిందని వివరించారు. ఈ రెండు మందులను ఇప్పటివరకు భారత ప్రజలు ఎప్పుడూ వాడని కారణంగా డ్రగ్‌ కంట్రోలర్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నారని, మరింత మంది భారతీయులకు ఈ మందులు ఇచ్చి ఫలితాల సమాచారం ఇవ్వాలని సూచిస్తోంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో త్వరలోనే అను మతులు లభించే అవకాశం ఉందని అంచనా. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో నెలలో 2 మందులకూ అనుమతులు లభించనున్నాయి. ఆ వెంటనే ఆయా కంపెనీలు మందులను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. సాధారణ ప్రజలకు ఈ మందులు ఇచ్చిన తర్వాత కూడా వాటి సమర్థత, దుష్ప్రభావాలపై పరీక్షలు జరుగుతాయి. అంతేకాకుండా.. రెండు కంపెనీలు ఉత్పత్తి చేసిన మందులు ఒకే రీతిగా ఉన్నాయా.. లేదా అన్న దానిపై తుది అనుమతుల జారీ ఆధారపడి ఉంటుంది.

ఇప్పటికే ఆలస్యం.. 
నిజానికి కరోనా చికిత్సకు మందులు అభివృద్ధి చేసేందుకు భారత్‌ అందరి కంటే ముందుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇతర వ్యాధుల కోసం అభివృద్ధి చేసి.. అర్ధంతరంగా ప్రయోగాలను నిలిపేసిన వందలాది మందులను హైదరాబాద్‌లోని ఐఐసీటీ స్క్రీన్‌ చేసి పని చేస్తాయనుకున్న మూడింటిని వేరు చేసింది. ఎబోలా వైరస్‌ కోసం అమెరికన్‌ కంపెనీ గిలియాడ్‌ అభివృద్ధి చేసిన రెమిడెస్‌విర్, సాధారణ జలుబు కోసం జపనీస్‌ కంపెనీ తయారు చేసిన ఫావిపిరావిర్‌తో పాటు మలేరియా చికిత్సకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లు కరోనా చికిత్సకూ ఉపయోగపడతాయని ఐఐసీటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ సమయంలోనే సిప్లా ఓ అడుగు ముందుకేసి ఆ మందులను తయారు చేసి ఇస్తే తాము వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేస్తామని ఫార్మా కంపెనీ సిప్లా ముందుకొచ్చింది.

అయితే మానవ ప్రయోగాల దశకు చేరుకునేటప్పటికి వివిధ కారణాల వల్ల ప్రాజెక్టు ఆలస్యమైంది. భారత్‌లోని రోగులపై ప్రయోగించడం ద్వారా మాత్రమే వాటి పనితీరును మదింపు చేయాలని డ్రగ్‌ కంట్రోలర్‌ నిర్ణయించడం దీనికి ఒక కారణం. ఇందుకు తగ్గట్టుగా సిప్లాతోపాటు గ్లెన్‌మార్క్‌ కూడా మొత్తం ఏడు ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకున్నాయి. అయితే కరోనా రోగులతో వైద్యులు క్షణం తీరికలేని పరిస్థితులు ఏర్పడటం.. ఈ మందులను రోగులకు ఇచ్చి వాటి ఫలితాలను, సమాచారాన్ని నమోదు చేసే అవకాశం లేకపోవడంతో ఆలస్యమైంది. కొత్త మందులను ఉపయోగించేందుకు రోగులు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. చివరకు రెండు కంపెనీలు వేర్వేరుగా నిర్వహించిన ప్రయోగాల సమాచారాన్ని జోడించి డ్రగ్‌ కంట్రోలర్‌కు అందించారు. డ్రగ్‌ కంట్రోలర్‌ ఈ సమాచారాన్ని విశ్లేషించి అనుమతులిస్తే కరోనాపై పోరులో కొత్త అధ్యాయం మొదలైనట్లే.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు